close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

పాత పేజీలో కొత్త పహాణీ

మిర్యాలగూడ కేంద్రంగా ‘రెవెన్యూ’ దందా

ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం

‘కీ’లకంగా వ్యవహరిస్తున్న విశ్రాంత తహసీల్దారు


అద్దంకి రహదారి వెంట చింతపల్లి సమీపంలో ఉన్న ఓ సర్వేనెంబరు భూమి చాలా రోజులుగా వివాదంలో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఉద్యోగులు పహాణీలో 17 క్రమసంఖ్య తర్వాత 17/1 వేసి 2016లో మ్యుటేషన్‌లో అదనంగా చేర్చి సంతకాలు చేశారు. ఈ తతంగంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు తెలిసింది. బాగా విలువైన ఈ స్థలాన్ని దక్కించుకునేందుకే ఉద్యోగి ఈ విధమైన అక్రమ దందాకు తెర తీసినట్లు తెలిసింది.


ఈనాడు-నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం కొందరు రెవెన్యూశాఖ మాజీ ఉద్యోగులు, అధికారుల పాలిట వరంగా మారింది. పాత దస్త్రాల ఆధారంగా చేసుకొని తమకు అనుకూలమైన వారికి అక్రమంగా ధ్రువపత్రాలు జారీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా మిర్యాలగూడ కేంద్రంగా సాగుతోంది. కొంత మంది స్థిరాస్తి వ్యాపారులు, రెవెన్యూ శాఖ ఉద్యోగులతో కలిసి విశ్రాంత ఉద్యోగుల సహకారంతో రికార్డుల్లో పాత పేజీలను తీసేసి కొత్తగా పహాణీలు చేర్చి వాటికి పాత తేదీలే వేసి రూ.లక్షలు దండుకుంటున్నారు. ఈ అక్రమ బాగోతం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. దీంతో రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కొంత మంది పరం అవుతుండగా.. సంబంధిత అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిర్యాలగూడ పట్టణంతోపాటు డివిజన్‌లో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (ఎన్నెస్పీ) భూములకు బాగా గిరాకీ ఉంది. వీటినే లక్ష్యంగా చేసుకున్న ఓ ముఠా దొంగ పత్రాలతో ఆ భూములను కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టిస్తోంది.

సమగ్ర విచారణ జరిపిస్తాం: వి.చంద్రశేఖర్‌, ఇన్‌ఛార్జ్‌ కలెక్టరు, నల్గొండ

ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఉదంతాలపై మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులను చట్ట ప్రకారం శిక్షిస్తాం.

పట్టణంలోని అద్దంకి- నార్కట్‌పల్లి ప్రధాన రహదారి వెంట 639 సర్వేనెంబరు భూమిలో 1998లో భూమి యాజమాన్య ధ్రువీకరణ పత్రం (13-బి, పత్రం) ఇటీవల జారీ చేశారు. 2000 సంవత్సరం తరువాత ముద్రించిన ధ్రువీకరణ పత్రంలో 1998 ఏడాదితో జారీ చేయడం గమనార్హం.

2000 ఏడాది జారీ చేసిన పత్రంలో 2000కి బదులుగా 1998 తేదీతో ఇచ్చిన సర్క్యులర్‌

ఆ ఒక్కడు?

ఈ అక్రమ బాగోతంలో గతంలో పట్టణంలో పనిచేసి పదవీ విరమణ చేసిన తహసీల్దార్‌ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. మిర్యాలగూడ డివిజన్‌ కార్యాలయంలో గతంలో తాను పనిచేయడంతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని దస్త్రాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ దందాలో ప్రస్తుతం ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులూ భాగస్వాములైనట్లు తెలిసింది.

సాక్ష్యాలు ఇవిగో..

* పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను ఓ ప్రైవేటు వ్యక్తికి ధారాదత్తం చేయడంలో విశ్రాంత ఉద్యోగి కీలకంగా పనిచేశారనే ఆరోపణలున్నాయి. ఈయన పనిచేసే రోజుల్లోనే పట్టణంలో చాలా వరకు ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి.

* దామరచర్ల మండలంలోనూ ఈ విశ్రాంత ఉద్యోగి గతంలో పనిచేయడంతో అక్కడా ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో కొంత మందికి ధారాదత్తం చేసినట్లు తెలిసింది.

* ఆ ఉద్యోగి ట్రస్టీగా ఉన్న సంఘ స్థలం యజమాని మృతిచెందగా ఆయన బతికే ఉన్నట్లుగా తప్పుడు ధ్రువీకరణ పత్రం ఇచ్చి రిజిస్ట్రేషన్‌కు సహకరించారనే ఆరోపణలున్నాయి.

* ముత్తిరెడ్డికుంట ప్రాంతంలో కొంతమేరకు ప్రభుత్వ భూమి ఉండగా ఇటీవల సదరు అధికారి 13, బి పత్రాలు జారీ చేస్తూ జోరుగా దండుకున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.