close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

మేడారం

హద్దుల తకరారు.. ఓటర్ల తారుమారు!

రోజురోజుకు పెరుగుతున్న ఫిర్యాదులు
రేపటితో ముగియనున్న అభ్యంతరాల స్వీకరణ
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌(కరీంనగర్‌)

పుర, నగరపాలికల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు స్వీకరిస్తుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.. రోజురోజుకు పెరుగుతున్న ఫిర్యాదులతో కూడికలు, తీసివేతల్లో ఏం జరుగుతుందోననే చర్చ జరుగుతోంది. గతంలో వార్డులు, డివిజన్ల పునర్విభజన, ఓటరు జాబితాల తయారీ హడావుడిగా చేపట్టడంతో గందరగోళం నెలకొంది. తప్పులు సరిచేయాలని చేసిన విజ్ఞప్తులు ఫలించకపోవడంతో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేయడం, తాజాగా మళ్లీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.. అందులో భాగంగా కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల పునర్విభజన ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు డివిజన్ల ప్రజలు, ఆశావహులు, మాజీ పాలకవర్గ సభ్యులు ముసాయిదా జాబితాల్లోని కొన్ని డివిజన్ల పరిధిలోని హద్దులు, ఓటర్లను సవరించాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు.

స్వల్పంగా మారనున్న ఓటర్లు
పునర్విభజన ముసాయిదా ప్రకారం నగరపాలికలో అభ్యంతరాలు స్వీకరిస్తుండగా వచ్చిన అభ్యంతరాలపై పరిశీలన చేపట్టే కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఓటర్ల జాబితాలో ఒక్కో డివిజన్‌లో 5 నుంచి 10 శాతం కనిష్ఠం, గరిష్ఠంగా ఓటర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వందల సంఖ్యలో ఓటర్లు తారుమారు కావడం, సరిహద్దుల్లో ఏవైనా భారీగా సమస్యలు వస్తే మార్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో డివిజన్‌లో కనిష్ఠంగా 3868, గరిష్ఠంగా 4725 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 5 నుంచి 10 శాతానికి పరిగణలోకి తీసుకుంటే ఆ ఓటర్లు సుమారు 4100 నుంచి 4500 మంది ఉండనున్నారు.

సవరణలు నామమాత్రమేనా?
డివిజన్ల హద్దులు, ఓటర్లు, ఇళ్ల సంఖ్య తారుమారు చేశారని, మొట్ట మొదటి జాబితానే బాగుండేదని, ప్రస్తుతం జారీ చేసిన జాబితా సక్రమంగా లేదంటూ పలు డివిజన్ల నుంచి ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిలో అధికంగా ఒక డివిజన్‌ నుంచి మరో డివిజన్‌ల్లోకి ఓటర్లు మార్చారని, డివిజన్ల సరిహద్దులు సరిగా లేవనే ఫిర్యాదులు వస్తున్నాయి. శనివారం నాటికి అందిన అభ్యంతరాల లెక్కను పరిగణలోకి తీసుకుంటే అందులో ఎన్ని సవరణలు చేస్తారో తెలియకుండా మారింది. పైగా వీటిలో అధికంగా వ్యక్తిగతంగా మార్పులు చేయాలని అంటున్నారని, భౌగోళికంగా వచ్చే ఇబ్బందులపై వచ్చే అభ్యంతరాలు ఎక్కువగా లేకపోవడంతో అవన్నీ నామమాత్రంగానే పరిశీలించే అవకాశం ఉంది.

ఆశావహుల్లో ఉత్కంఠ
పురపోరు బరిలోకి దిగాలనే ఆలోచనతో ఉన్న పలువురు ఆశావహులు అభ్యంతరాలు, సవరణలపై దృష్టిసారించారు. డివిజన్‌ సంఖ్య, ఏ వీధులు వస్తున్నాయి, విభజన ప్రకారం సామాజిక ఓటర్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు పాత డివిజన్లు పూర్తిగా మారిపోగా, కొత్త డివిజన్‌లో ఉన్న ఓటర్లు తమకు అనుకూలంగా ఉన్నారా లేరా అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటూ జాబితాలు పరిశీలిస్తున్నారు. అయితే పలు డివిజన్ల నుంచి వస్తున్న అభ్యంతరాలు, ఫిర్యాదులతో మళ్లీ మార్పులు ఏవిధంగా ఉంటాయనే ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది. ఇప్పుడున్న ఓటర్లు అటూ ఇటూ మారుతారనే ప్రచారం జరుగుతుండటంతో అసలు ఏం జరుగుతందోననే ఆసక్తి లేకపోలేదు.

రేపటితో ముగియనున్న గడువు
వార్డులు, డివిజన్ల పునర్విభజనపై ఈ నెల 9లోగా అభ్యంతరాలు స్వీకరించడానికి సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. మరుసటి రోజు నుంచి ఈ నెల 16 వరకు వచ్చిన అభ్యంతరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. సవరించిన అభ్యంతరాలను ప్రత్యేకాధికారి, కౌన్సిల్‌ ఆమోదించనున్నారు. 17న పురపాలక శాఖకు పంపించి డివిజన్ల పునర్విభజనపై తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.
* ఇం.నం.6-6-566 నుంచి ఇం.నం 6-6-656 వరకు, ఇం.నం.6-6-746 నుంచి ఇం.నం 6-6-756/1 వరకు అంబేడ్కర్‌నగర్‌ నుంచి తొలగించి ప్రసుత 3వ డివిజన్‌లో కలిపారు. దాంతో ఎస్టీ ఓటర్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడిందని వీటిని సవరించాలని కోరుతూ కిసాన్‌నగర్‌ను చెందిన కుర్ర తిరుపతి ఫిర్యాదు చేశారు.

* ఓటర్ల గణన సక్రమంగా జరగలేదని, ప్రస్తుతం ఇచ్చిన ఆధారాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా ఓటర్ల జాబితాను తయారు చేయాలని హౌసింగ్‌బోర్డుకాలనీకి చెందిన వి.వెంకట్‌రెడ్డి కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు.

* కరీంనగర్‌లో పునర్విభజన పేరుతో నాలుగు సార్లు మార్పులు, చేర్పులు చేయగా అన్ని డివిజన్ల సరిహద్దులు, జనాభా మారుతోంది.. కానీ, అంబేడ్కర్‌నగర్‌కు భౌగోళికంగా సంబంధం లేని ఇం.నం.10-5-161 నుంచి ఇం.నం 10-5-228/2/6, ఇం.నం.10-5-282 నుంచి ఇం.నం 10-5-360/2 ప్రాంతాన్ని మాత్రం తొలగించడం లేదని ఆ ప్రాంతానికి చెందిన యనమల మంజుల 50 మంది సంతకాలతో ఫిర్యాదు చేశారు.

* పాత 14వ డివిజన్‌లోని ఎస్సీ ఓటర్లను పాత 1వ డివిజన్‌లో కలిపారు. ఆదర్శనగర్‌లోని బీసీ, ఓసీ ఓటర్లను ఎస్సీ రిజర్వ్‌ అయ్యే డివిజన్‌లో కలపడం ద్వారా రిజర్వేషన్‌కే ముప్పు కలగనుందని మాజీ కార్పొరేటర్‌ లంక రవీందర్‌ జిల్లా పాలనాధికారి, కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.