close

మంగళవారం, జనవరి 21, 2020

ప్రధానాంశాలు

ఎన్ఆర్ఐ

రూ. 1265 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

13న రానున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
న్యూస్‌టుడే, వన్‌టౌన్, కార్పొరేషన్‌

కైలాసగిరిపై రైలులో ప్రయాణిస్తున్న కలెక్టర్‌, కమిషనర్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న విశాఖ రానున్నారు. కైలాసగిరిపై జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ. 1265 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆ రోజు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ వినయ్‌చంద్‌ సమావేశమయ్యారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నామని, లోపాలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. అదే రోజు ఏయూ కన్వెన్షన్‌ కేంద్రంలో నిర్వహించనున్న ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీఎం ప్రసంగిస్తారని చెప్పారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ సృజన, వీఎంఆర్‌డీఏ కార్యదర్శి శ్రీనివాసరావు, ఇతర అధికారులు వెంకటేశ్వరరావు, పెంచల కిషోర్, ఏయూ రిజిస్ట్రార్‌ తదితరులు పాల్గొన్నారు.
సీఎం శంకుస్థాపన చేయనున్న కార్యక్రమాల వివరాలను కలెక్టరు వినయ్‌చంద్, జీవీఎంసీ కమిషనర్‌ సృజన వేర్వేరుగా విలేకరుల సమావేశాల్లో వివరించారు. 
* ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల స్పందన కార్యక్రమం (ఏపీడీఆర్‌పీ) నిధులు రూ.109 కోట్లతో ఆర్కేబీచ్‌ అభివృద్ధి. బీచ్‌ కోత నివారణ చర్యలు, కోస్టల్‌ బ్యాటరీ నుంచి పార్కు హోటల్‌ వరకు అభివృద్ధి పనులు.  
* నాడు-నేడు కింద రూ. 52 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన. జీవీఎంసీ పాఠశాలల అభివృద్ధికి రూ. 60 కోట్ల రుణం ఇవ్వడానికి ఇటీవల అనుమతులొచ్చాయి.
* స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద రూ. 145 కోట్లతో సౌర దీపాలు, రహదార్లు, స్కాడా పనులు. ఇందులో రూ. 40 కోట్లతో ఆకర్షణీయ ప్రాంత పరిధిలో నీటి సరఫరాలో లోపాల్లేకుండా స్కాడా విధానం ప్రవేశపెడతారు. 
* రూ. 9.50 కోట్లతో ముడసర్లోవ జలాశయ అభివృద్ధి.  
* అమృత్‌ పథకం కింద రూ.157 కోట్లతో పార్కులు, నీటి సరఫరా వ్యవస్థ. పద్మనాభాపురం నుంచి హనుమంతువాక వరకు, అగనంపూడి నుంచి అనకాపల్లి, అగనంపూడి నుంచి నరవ వరకు రూ. 90 కోట్ల వ్యయంతో పైపులైన్లు నిర్మిస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌కల్లా పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. నగరంలో జీవీఎంసీకి చెందిన వెయ్యి ఖాళీ స్థలాల్లో ఎకరం దాటి విస్తీర్ణం ఉన్నచోట ఉద్యానవనాల అభివృద్ధి. అంతకంటే తక్కువ స్థలం ఉంటే పచ్చదనం అభివృద్ధి. వీటికి రూ. 67 కోట్లు.
* నగరంలో రూ.338 కోట్లతో రహదారులు, సుందరీకరణ, కొత్తపైపులైన్ల ఏర్పాటు, క్రీడల అభివృద్ధి. శివారు ప్రాంతాల్లో రహదారులు, కాల్వల నిర్మాణానికి ప్రాధాన్యం. ఒక్కో జోన్‌కు రూ. 15 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తారు. సుందరీకరణ, ఇండోర్‌ స్టేడియాల నిర్మాణం, ప్రతి నియోజకవర్గానికో స్విమ్మింగ్‌పూల్‌ వంటివి చేపడతారు. రూ. 153 కోట్ల వ్యయంతో 40 వేల గృహాలకు ఇచ్చిన మంచినీటి కనెక్షన్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 
* కాపులుప్పాడలో రూ.45కోట్లతో బయో మైనింగ్‌ ప్రాజెక్టు.. 25 ఎకరాలలో ఏర్పాటు చేస్తారు. చీమలాపల్లిలో రూ. 11 కోట్లతో క్లోజ్డ్‌ కాంపేక్షన్‌ వ్యవస్థ రూపకల్పన, 120 ఇ-రిక్షాల కొనుగోలు చేస్తారు. 


టెక్‌ కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం..
నగరంలో ఈ నెల 11, 12 తేదీల్లో టెక్‌ కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు రావాలని నిర్వాహకులు సీఎంను ఆహ్వానించారు. సీఎం 12న విశాఖ వచ్చి టెక్‌ కాన్ఫరెన్సులో పాల్గొని రాత్రికి ఇక్కడే బస చేస్తారని, 13న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెబుతున్నారు. ఒకవేళ 12న రాకపోతే 13న రావొచ్చని చెబుతున్నారు.  


ప్రతిపాదన దశలోనే పోలవరం పైపులైను 
పోలవరం ప్రాజెక్టు నుంచి విశాఖ నగరం వరకు మంచినీటి పైపులైను నిర్మాణం ప్రతిపాదన దశలోనే ఉందని జీవీఎంసీ కమిషనర్‌ సృజన చెప్పారు. జల్‌శక్తి ప్రాజెక్టులోనే దీన్ని చేపడితే 60 శాతం నిధులను కేంద్రం ఇస్తుందని చెప్పారు. అన్ని వార్డులకు సమానంగా జనాభా ఉండాలన్న డిమాండ్‌ ఆధారంగా వార్డుల పునర్విభజన జరగొచ్చని వెల్లడించారు. భీమిలి వైపు ఉన్న ఐదు పంచాయితీలు జీవీఎంసీలో విలీనానికి అనుకూలంగా తీర్మానించాయని, ప్రభుత్వానికి నివేదించామన్నారు. 


కైలాసగిరిని సందర్శించిన అధికారులు
ఎం.వి.పి.కాలనీ,: ఈ నెల 13న కైలాసగిరిపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సృజనతో కలిసి కైలాసగిరిని శనివారం సందర్శించారు. సర్క్యులర్‌ రైలులో ముఖ్యమంత్రి నగరాన్ని వీక్షిస్తారని కలెక్టర్‌ తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యదర్శి శ్రీనివాసరావు, జీవీఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.