close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ...


గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: రైలు నుంచి కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన భువనగిరి శివారులో శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగిరి నుంచి భువనగిరి రైలుమార్గంలో హద్దురాయి 245/7/9 వద్ద రైలు పట్టాల పక్కన సుమారు 65 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉంది. ఘటనపై రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో శవ పంచానామా నిర్వహించారు. మృతదేహం పడి ఉన్న ఆనవాళ్లను బట్టి మృతుడు గుర్తు తెలియని రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి సంబంధించి ఆధారాలు లభ్యం కాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని శవగారానికి తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ కాంతారావు తెలిపారు.


భువనగిరి పట్టణంలో చోరీ

 


బాధితులు అడిగి వివరాలు నమోదు చేస్తున్న ఎస్సై నాగిరెడ్డి

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: భువనగిరి పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌లో తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి సొత్తును అపహరించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన చీటకొండు దుర్గలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లో ఉంటున్న సోదరి దగ్గరికి వెళ్లారు. ఇంజినీరింగ్‌ చదువుతున్న ఆమె కుమారుడు, కుమార్తెకు పరీక్షలు ఉండటంతో వారం రోజులు క్రితం ఇద్దరు హైదరాబాద్‌కు వెళ్లారు. తాళం వేసి ఉన్న ఇంటిని గమనించిన దుండుగులు శుక్రవారం రాత్రి ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా తాళం పగులగొట్టి అందులోని మూడున్నర తులాల బంగారం, రూ.25 వేల నగదు, 60 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించిన పాలు విక్రయించే వ్యక్తి బాధితులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఇన్‌స్పెక్టర్‌ కాశిరెడ్డి, ఎస్సై నాగిరెడ్డి ఆధ్వర్యంలో క్లూస్‌టీం బృందం ఆధారాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు.


నేరాలకు పాల్పడితే శిక్ష ఖాయం


మాట్లాడుతున్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రామకృష్ణారావు

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: ఏ నేరం చేసినా సాక్ష్యాలు తప్పకుండా ఉంటాయని వాటి ద్వారా నేరస్తులకు శిక్ష తప్పనిసరిగా పడుతుందని భువనగిరి కోర్టు సీనియర్‌ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రామకృష్ణారావు అన్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఆధ్వర్యంలో శనివారం సాంఘిక గురుకుల పాఠశాలలో నిర్వహించిన అవగాహన సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డితో కలిసి మాట్లాడారు. మహిళపై నేరాలు వాటి పర్యవసానాల గురించి వారు వివరించారు. ఐపీసీ సెక్షన్లు, ఇతర చట్టాలపై అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాల్లో నిరాధరణ వార్తలు, చిత్రాలు, వీడియోలను ఇతరులను కించపర్చుతూ పోస్టు చేస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారని ఆయన వివరించారు. డీసీపీ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలవైపు వెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్‌స్పెక్టర్‌ కాశిరెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు శశిధర్‌రెడ్డి, కేశవరెడ్డి, లీగల్‌ఎయిడ్‌ న్యాయవాది నాయకం రమేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.