close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

తెలుగు మాధుర్యం.. ప్రపంచానికి చాటేలా..!

వికీపీడియా బలోపేతానికి ట్రిపుల్‌ ఐటీలో ప్రత్యేక కార్యశాల
విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
ఈనాడు, హైదరాబాద్‌

తెలుగు వికీపీడియా బలోపేతానికి గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ ముందుకు సాగుతోంది. ప్రాజెక్టు ముఖ్య పరిశోధకులు, ట్రిపుల్‌ఐటీ ఆచార్యుడు ప్రొ.వాసుదేవవర్మ నేతృత్వంలో ఇప్పటికే వివిధ దఫాలుగా కార్యశాలలు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా శనివారం వర్సిటీలో వికీపీడియాను అభివృద్ధి చేసే దిశగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యశాల నిర్వహించారు. దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది విద్యార్థులు, ఔత్సాహికులు హాజరయ్యారు. ప్రాజెక్టుకు కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయి. తెలంగాణ డిజిటల్‌ మీడియా హెడ్‌ దిలీప్‌ కొణతం హాజరై ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహకారాన్ని వివరించారు.

* తెలుగు భాషలో వికీపిడియా 2001లో తొలిసారిగా ప్రారంభం కాగా.. 2003లో అందుబాటులోకి వచ్చింది. అయితే.. ప్రజలు, రచయితల్లో అంతగా అవగాహన లేకపోవడంతో ఎక్కువగా వ్యాసాలు అందుబాటులోకి రాలేదు. ఆంగ్లంలో 70లక్షలకుపైగా వ్యాసాలు ఉండగా.. తెలుగులో కేవలం 75వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గూగుల్‌ ఇటీవల చేపట్టిన ఓ సర్వేలో భారతీయలు ఎక్కువగా తమ సొంత భాషల్లోనే వికీపీడియాలో వ్యాసాలు చదివేందుకు ఆసక్తి చూపుతున్నారని తేలింది. తెలుగు పాఠకులు సైతం ఎక్కువగా మాతృభాషలోనే వ్యాసాలు కోరుకుంటున్నారు. వారి అవసరాలకు తగ్గట్టుగా అంతర్జాలంలో అందుబాటులో లేకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగు వికీపీడియాను అభివృద్ధి చేసేందుకు ట్రిపుల్‌ఐటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది.    ‘ఈ నెలలో ప్రారంభం కానున్న హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో ప్రత్యేకంగా స్టాల్‌ ఏర్పాటు చేసి తెలుగు వికీపీడియాపై ప్రాజెక్టు బృందం ప్రచారం చేయనుంది. వ్యాసరచన మొదలుకొని.. అన్ని అంశాలపై ప్రచారం చేసి సందర్శకుల్లో అవగాహన కల్పిస్తాం.’ అని ప్రొఫెసర్‌ వాసుదేవవర్మ ‘ఈనాడు’కు వివరించారు.

జనవరి 1 నుంచి ప్రత్యేక కార్యశాలలు
కార్యశాలకు హాజరైన వారు వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి వికీపీడియా బలోపేతంపై పలు సూచనలు చేశారు. కంటెంట్‌, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌, ప్రచారం, సాంకేతిక విభాగాలుగా ఏర్పడి సలహాలు స్వీకరించారు. వీటిని క్రోడీకరించి ముందుకు సాగనున్నారు. జనవరి 1 నుంచి ప్రత్యేకంగా ప్రతివారం తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతంలో కార్యశాల నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో వికీపీడియాలో వ్యాసాలు ఎలా రాయాలనే విషయంపై శిక్షణ ఇవ్వనున్నారు.

వ్యాసరచన ఎలా..?
* వికీపీడియా అనేది విజ్ఞాన సర్వస్వంగా ఉండాలి. సమాజానికి శాశ్వతంగా పనికొచ్చే అంశాలను మాత్రమే రాయాలి.
* వ్యాసాల్లో ఎక్కడా పక్షపాతం, అతిశయోక్తి ఉండకూడదు. వాస్తవిక దృక్పథం మాత్రమే ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదు.
* వ్యాసాలు అప్‌డేట్‌/ఎడిట్‌ చేసే అవకాశం ఉంది. కాపీరైట్‌ విషయాలకు అవకాశం లేదు.
* ఏ రకంగానూ ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకోరాదు. పరస్పరం గౌరవించుకుంటూ రచన సాగాలి.
* వికీపీడియా పరంగా ఎలాంటి ప్రత్యేక నిబంధనలు లేవు.

ప్రత్యేక విభాగం ప్రారంభం
భారతీయ భాషల వికీపీడియాపై పరిశోధన, అవగాహన కల్పించేందుకు ట్రిపుల్‌ఐటీలో ప్రత్యేక కార్యాలయం ప్రారంభమైంది. సంస్థ సంచాలకుడు ప్రొ.పీజే.నారాయణన్‌ దీన్ని ఆరంభించారు. ఇక్కడ పది మంది తెలుగు వికీపీడియా బలోపేతంపై పరిశోధనలు సాగిస్తారు. ముందుగా అనుమతి తీసుకొని ఇక్కడ నిర్వాహకులతో మాట్లాడి వ్యాసాల రచన, ఇతర అంశాలను తెలుసుకోవచ్చు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.