close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

ఇంటి బడ్జెట్‌ తలకిందులు!

ఒక్కోటిగా పెరుగుతున్న ధరలు
సామాన్య, మధ్య తరగతి వాసులు సతమతం
ఈనాడు, హైదరాబాద్‌

నగరవాసి ఇంటి బడ్జెట్‌ ధరల పెరుగుదలతో తారుమారవుతోంది.. వైద్య ఖర్చులు, రవాణా ఛార్జీలు, సరకుల ధరలు, వినోదం రుసుములు ఇలా ఒక్కోటిగా పెరుగుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి వాసుల నడ్డి విరుస్తున్నాయి. ఏడాది మారగానే పెరిగే ఇంటి అద్దె, పిల్లల బడి ఫీజులు తలుచుకుని.. మున్ముందు రైల్వే, విద్యుత్తు ఛార్జీలు పెరుగుతాయనే సంకేతాలు వీరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్థిక మంద గమనంలో ఆదాయాలు పెంచుకునేందుకు అందరూ ఒకరి వెనుక ఒకరు ధరలు పెంచడం.. మరోవైపు తమ కుటుంబ ఆదాయం పెరగక,  ఖర్చులు మాత్రమే పెరగడంతో ఎలా సర్దుబాటు చేయాలో తెలియక గృహిణులు సతమతమవుతున్నారు.

నగర జీవన శైలిలో సౌకర్యాలన్నీ అందుబాటులో ఉన్నా ప్రతిదానికి ఖర్చు చేయాల్సిందే. పర్సు నిండా సొమ్ములు ఉంటే తప్ప బతుకు బండి ముందుకు కదలదు. నెల తిరిగేసరికి ఇంటి అద్దె, పాల బిల్లు, పిల్లల ఫీజులు చెల్లించాలి. నిత్యావసర సరకులు కొనాలి. వచ్చే సంపాదనలో అధిక మొత్తం వీటికే ఖర్చవుతుంది. అత్యధిక శాతం మంది ఆదాయం మాత్రం అంతంత మాత్రమే. వస్తున్న ఆదాయాన్నే బడ్జెట్‌ వేసుకుని మరీ ఖర్చు చేయాల్సినపని. చాలా సార్లు తమ అవసరాలను వాయిదా వేస్తే తప్ప నెల గడవని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది. గత ఏడాది డిసెంబరుతో మొదలైన ధరల పెరుగుదల ఈ డిసెంబరుకు వచ్చేసరికి అన్నింటికీ విస్తరించి.. కుటుంబ బడ్జెట్‌ తలకిందులవుతోంది.

* ఇంధన ధరలు సైతం క్రమంగా రూపాయి రూపాయి పెరుగుతూ పెట్రోలు ధర రూ.80కి చేరువైంది. జులైలో లీటర్‌ పెట్రోలు రూ.74.88 ఉండేది. సిటీలో రోజూ లీటర్‌పైన పెట్రోలు పడుతుంది. నెలకు చూసుకుంటే రూ.150 వరకు భారం పెరిగింది.

వినోదం సైతం..
వినోదం కోసం నగరవాసులు ఎక్కువగా పార్కులను వెళుతుంటారు. హైటెక్‌సిటీలో గ్రామీణ వాతావరణం నేపథ్యంగా తీర్చిదిద్దిన శిల్పారామాన్ని సిటీవాసులు ఎక్కువ మంది సందర్శిస్తుంటారు. ఇదివరకు పెద్దలకు రూ.50 ప్రవేశ రుసుం ఉంటే ఈ నెల నుంచి రూ.60కి పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూపార్క్‌ ప్రవేశ ధరలు పెరిగాయి. సెలవు రోజుల్లో రూ.50గా ఉన్న ప్రవేశ రుసుము రూ.60కి పెరిగింది.

నిత్యావసరాలు భగ్గు..
నలుగురు ఉండే కుటుంబానికి గతంలో రూ.2వేల ఖర్చు చేస్తే నెలంతా సరిపోయే సరకులు వచ్చేవి. రూ.10 నుంచి రూ.20 మధ్యలో దొరికే ఉల్లి సైతం కొన్నాళ్లుగా కన్నీరు పెట్టిస్తోంది. రికార్డు స్థాయిలో ధర నూటయాబైకి చేరింది. ఈ ధరతో సంపన్నులు తప్ప సామాన్యులెవరూ కొనలేని పరిస్థితి. సబ్సిడీ ఉల్లి కోసం రైతుబజారులో బారులు తీరాల్సి వస్తోంది. ఈ ఏడాది కాలంలో వెల్లుల్లి, చింతపండు.. ఇలా పెరిగిన నిత్యావసరాల ధరల జాబితా పెద్దదిగానే ఉంది. దీంతో రూ.3వేలైనా అన్ని వస్తువులు కొనలేకపోతున్నారు. మధ్యమధ్యలో మండిపోయే కూరగాయల ధరలు దీనికి అదనం.

ఇంటి నిర్మాణ ఖర్చులు..
రూపాయి రూపాయి దాచుకుని స్థలం కొనుక్కుని వాటిలో ఇల్లు కట్టుకుందామంటే నిర్మాణ ధరలు మధ్యతరగతి వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలే సిమెంట్‌ ధరలు పెరిగాయి. ఈనెల నుంచి నిర్మాణ కూలీల ధరలు పెంచుతున్నట్లు భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రకటించింది. రోజువారీ కూలి రూ.600 నుంచి రూ.800 పెంచారు.


మొబైల్‌ సేవలు

మొబైల్‌ సేవలు ఇన్నాళ్లు చౌక కాగా.. ఈనెల నుంచి డాటా, కాల్‌ ఛార్జీలు పెరిగాయి. ఇన్నాళ్లు రూ.149 ప్లాన్‌తో సరిపెట్టుకునేవారు సైతం రూ.199 ప్లాన్‌ వేసుకుంటే తప్ప ఫోన్‌ పనిచేయని పరిస్థితులు. నెల ఖర్చు 33 శాతంపైనే పెరిగింది. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి స్మార్ట్‌ఫోన్‌.  ఆ రకంగా నెలవారీ మొబైల్‌ రీఛార్జీ ఖర్చులు తక్కువలో తక్కువ రూ.500 ఉంటే ఇప్పుడు వెయ్యి వరకు చెల్లించాల్సి వస్తోంది.


రవాణా ఛార్జీలు

నగరంలో ఎక్కువమంది ఆధారపడేది ఆర్టీసీ బస్సులపైనే. ఇటీవల ఆ ఛార్జీలు పాతికశాతం పెరిగాయి. దాదాపు అన్ని బస్సు పాస్‌ ధరలు రూ.200 వరకు పెంచారు. రూ.880 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ ధర ప్రస్తుతం రూ.1070కి పెరిగింది. రోజువారీ పాస్‌ ధర రూ.80 నుంచి వందకు పెరిగింది. ఇంటివరకు బస్సు సౌకర్యాలు లేని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వీరందరూ గమ్య స్థానం చేరుకునేందుకు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. బస్సుల సమ్మె కాలంలో పెంచిన ఆటోల ధరలే ఇప్పుడు వసూలుచేస్తున్నారు. మీటర్లు అసలు వేయడం లేదు. ఇవన్నీ కలిసి సామాన్య, మధ్యతరగతి వాసిపై నెలకు తక్కువలో తక్కువ రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అదనపు భారం పడుతోంది.


కేబుల్‌ ఖర్చులు..

గత డిసెంబరు నుంచి కేబుల్‌ టీవీ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చూసే ఛానళ్లకే ఛార్జీలు చెల్లించాలనే ట్రాయ్‌ నిబంధన వినియోగదారులకు మేలు చేయకపోగా భారంగా మారింది. అప్పటివరకు రూ.150 నుంచి రూ.300 వరకు చెల్లించే కేబుల్‌ ఛార్జీలు మూడొందల నుంచి ఆరువందలకు పెరిగాయి. ధరల్లో పెరుగుదల.. వాడకాన్ని బట్టి 50 నుంచి వందశాతానికి పెరిగింది. గతంలో ఏడాదికి రూ.1800 వరకు చెల్లించే కేబుల్‌ వినియోగదారు ఈ ఏడాది రూ.3500 వరకు చెల్లించారు.


వైద్య ఖర్చులు..

నగరంలో ఇటీవల ఎక్కువ మంది జ్వరం బారిన పడుతున్నారు. డెంగీ, స్వైన్‌ఫ్లూ భయపెడుతున్నాయి. గతంలో.. ఇంటికి దగ్గరలో ఉన్న వైద్యుడికి చూపించేవారు. వందల్లో ఖర్చు అయ్యేది. ఇప్పుడు డెంగీ భయంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. టెస్ట్‌లు అవిఇవీ కలిసి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పైగా ఈ ఏడాది వైద్య చికిత్స ఫీజులు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చాలా వరకు ఇరవై శాతంపైగా పెంచాయి.


మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.