close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

భవన నిర్మాణ వ్యర్థాలకు.. అర్థం

వారం రోజుల్లో ప్రారంభం కానున్న జీడిమెట్ల సీఅండ్‌డీ ప్లాంట్‌
రోజుకు 800 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం
రోడ్లు, ప్రహరీల నిర్మాణాలకు ఇక్కడి ఉత్పత్తుల వినియోగం
న్యూస్‌టుడే, కుత్బుల్లాపూర్‌

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలో వెలువడే భవన నిర్మాణ వ్యర్థాల సమస్యకు మరో వారం రోజుల్లో పరిష్కారం లభించనుంది. నగర వ్యాప్తంగా వెలువడే భవన నిర్మాణ వ్యర్థాలను పునర్వినియోగించేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రెండున్నర సంవత్సరాల క్రితం నగర శివారుల్లోని జీడిమెట్ల, ఫతుల్లాగూడలో కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డిమాలిషింగ్‌(సీఅండ్‌డీ) ప్లాంటుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రూ.12 కోట్లతో జీడిమెట్ల పారిశ్రామిక వాడలో సీఅండ్‌డీ ప్లాంటు నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. వారం రోజుల్లో ఉత్పత్తులు ప్రారంభించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.

12న లేదా 16న ప్రారంభించే అవకాశం?
గాజులరామారం 79 సర్వే నంబరు టీఎస్‌ఐఐసీకి చెందిన 22 ఎకరాల్లో ప్లాంటును ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలను రాంకీ సంస్థకు అప్పగించారు. దేశంలోనే మొదటిసారిగా ప్రారంభమవుతున్న ఈ ప్లాంటు నిర్వహణకు అవసరమైన యంత్రాలను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ నెల 1న మంత్రి కేటీఆర్‌తో ప్లాంటును ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ వాయిదా పడింది. ఈ నెల 12, 16లలో ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ః నగర వ్యాప్తంగా ఏటా సుమారు 5.14 లక్షల మెట్రిక్‌ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వెలువడుతున్నట్లు అధికార వర్గాల సమాచారం.  దీనికి శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో సీఅండ్‌డీ ప్లాంట్ల ఏర్పాటునకు శ్రీకారం చుట్టారు. నగరంలో వెలువడుతున్న వ్యర్థాలను ప్రస్తుతం సర్కిళ్ల వారీగా ఏర్పాటు చేసిన డంపింగ్‌ పాయింట్ల వద్ద పోగు చేసి అక్కడి నుంచి ప్లాంట్లకు తరలిస్తున్నారు. చార్మినార్‌, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌ జోన్ల పరిధిలో వెలువడుతున్న వ్యర్థాలను ఫత్లుల్లాగూడకు.. శేరిలింగపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌ జోన్ల పరిధిలోని వ్యర్థాలను జీడిమెట్లకు తరలిస్తున్నారు. గత వార్షిక సంవత్సరంలో మొత్తం 4,48,575 టన్నుల వ్యర్థాలను తరలించిన అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నవంబర్‌ 30 వరకు 2,75,154 టన్నుల వ్యర్థాలను తరలించారు. వ్యర్థాల నిర్వాహకుల నుంచి టన్నుకు రూ.256 చొప్పున రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పునరుత్పత్తులు ప్రారంభమైతే టన్నుకు రూ.342 వసూలు చేస్తారని చెబుతున్నారు. జీడిమెట్లలో రూపుదిద్దుకున్న సీఅండ్‌డీ ప్లాంటులో రోజుకు సుమారు 800 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలతో పునరుత్పత్తులు తయారు చేస్తారని చెబుతున్నారు. ఆ ఉత్పత్తులతో ఇటుకలు తయారు చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇసుక, 8 ఎంఎం, 10 ఎంఎం, 20 ఎంఎం సైజు కంకర ఉత్పత్తి చేసి.. రహదారులు, భవన నిర్మాణదారులకు సరఫరా చేయనున్నారు.

ఆక్రమణలను తొలగించాలని డిమాండ్‌
సీఅండ్‌డీ ప్లాంటుకు అధికారికంగా 22 ఎకరాలు కేటాయించినా.. ఆక్రమణలతో ప్రస్తుతం 14 ఎకరాలు మాత్రమే మిగిలింది. గతంలో ఓ వ్యక్తి కొంత భూమిని లీజుకు లీసుకుని ఇక్కడ క్వారీ పరిశ్రమ నిర్వహించారు. లీజు కాలం పూర్తయినా సంబంధిత యంత్రాలను ఇప్పటికీ తొలగించలేదు. ఆక్రమణలను తొలగించి కేటాయించిన స్థలాన్ని పూర్తిగా తమకు స్వాధీనం చేయాలని ప్లాంటు నిర్వాహకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.