close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

15ఏళ్ల లోపే...అధిక ఒత్తిడి

 చిన్నారులను స్వేచ్ఛగా ఎదిగేందుకు అవకాశం కల్పించాలి
 మెదడుపై ప్రభావం పడి మానసికంగా సమస్యలొస్తున్నాయ్‌
 శ్రీరామకృష్ణ పరమహంస రీసెర్చ్‌ గ్రాంట్‌ గ్రహీత ప్రొఫెసర్‌ విదిత వైద్య

దేశంలో చిన్నారులపైనే అత్యధికంగా ఒత్తిడి ఉంటోందని, అందువల్లే మొదటి 15 ఏళ్ల వయసులోనే వారి మెదడుపై ప్రభావం పడుతోందని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చి ప్రొఫెసర్‌ విదిత వైద్య పేర్కొన్నారు. వారిని స్వేచ్ఛగా ఎదిగేందుకు, చదువుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. విజయవాడకు చెందిన శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్‌ అందించే శ్రీరామకృష్ణ పరమహంస రీసెర్చ్‌ గ్రాంట్‌ ప్రోగ్రామ్‌కు ఆమె ఎంపికయ్యారు. చిన్న తనంలోనే తీవ్ర ఒత్తిడి వల్ల మెదడుపై ప్రభావం పడి మానసికంగా, శారీరకంగా ఎలా అనారోగ్యం బారిన పడుతున్నారనే విషయంపై గత 20ఏళ్లుగా విదిత వైద్య పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధనకు ఏటా రూ.కోటి చొప్పున మూడేళ్లకు రూ.మూడు కోట్లను శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్‌ అందించనుంది. మొదటి ఏడాదికి సంబంధించిన చెక్‌ను విజయవాడలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా నగరానికి వచ్చిన ఆమె ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.

దేశంలో మానసిక, నరాల సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న వారు పెరుగుతున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి ?, అసలు ఎందుకు చిన్న వయసులోనే మెదడుపై ప్రభావం పడుతోందనే విషయాలను గుర్తించేందుకు మా పరిశోధన సాగిస్తున్నాం. ఈ పరిశోధన ద్వారా బ్రెయిన్‌ సర్క్యూట్‌లో జరుగుతున్న లోపాలను అరికట్టడం ద్వారా.. మానసిక, నరాల సంబంధిత అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుంది. బ్రెయిన్‌ ట్యూమర్‌ లాంటి ప్రమాదకర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ముందస్తుగా కాపాడుకునేందుకు వీలుంటుంది.

ప్రొఫెసర్‌ విదిత వైద్య
పిల్లలకు మొదటి 15 ఏళ్ల వయసు చాలా ప్రధానమైనది. ఆ సమయంలోనే వారిపై ఒత్తిడి లేకుండా చేయగలగాలి. వారికి ఆ వయసులో పాఠశాలలోనే ఎక్కువ సమయం ఉంటుంది. కానీ.. ఒత్తిడితో కూడిన విద్యావిధానం అనేది వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే.. ఇంటిలోని తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతయ్య అందరూ వారికి స్వేచ్ఛగా చదువుకుంటూ పెరిగే అవకాశం కల్పించాలి. నిత్యం వారికి కనీసం కొంత సమయమైనా ఆడుకునేందుకు అవకాశం కల్పించాలి. పాఠశాలకు వెళ్లాలంటే.. వారిలో ఒకరకమైన ఆసక్తిని పెంచాలి. అంతే తప్ప పాఠశాల అనగానే ఒత్తిడి భావన వారిలో రాకూడదు. యోగా, పుస్తకాలు చదివించడం, ఆడించడం, ఈత లాంటివి చేయించడం వంటివి ఉత్తమ మార్గాలు. టెక్నాలజీ పరంగా మంచి, చెడు రెండూ ఉన్నాయి. మనం వినియోగించే విధానంపై ఆధారపడి ఉంటుందనేది గ్రహించాలి.

నేరాలు పెరిగేందుకూ కారణమే..
ఒత్తిడి అనేది మరీ పెరిగిపోవడంతో.. సమాజంపై దాని ప్రభావం పడుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబాల సహకారం అనేది చాలా ముఖ్యం. ఒత్తిడి ప్రభావం నేరాలు పెరిగేందుకు సైతం కారణమవుతోంది. అయితే.. ప్రతి నేరం వారి వ్యక్తిగత మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. తాజాగా జరిగిన దిశ సంఘటనలాంటివి జరగకుండా ఉండాలంటే.. చిన్నతనంలోనే విలువలను నేర్పించాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఉన్న తల్లి, తోబుట్టువుల విషయంలో చాలా విలువలతో ఉంటూ.. బయట కొచ్చాక ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే అంశంపై దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలనే ప్రాథమిక అంశాన్ని చిన్నప్పుడే అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ నేర్పించాల్సి ఉంది. లేదంటే.. ప్రతిసారీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిని పూర్తిగా అరికట్టడం కష్టం. ఇదో సామాజిక సమస్య అనే విషయం మనం గుర్తించాలి.

జీవన విధానంలోనే ఎంతో ఒత్తిడి..
గతంలో ఉండే జీవన విధానంతో పోలిస్తే ప్రస్తుతం సమాజంలో అనేక రకాల ఒత్తిళ్లు.. సవాళ్లు నేటి వారిపై పెరిగాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, పర్యావరణం పరంగా, పని, మానసికంగా.. అనేక రకాలుగా ఒత్తిడి పడుతోంది. వీటన్నింటి ప్రభావం మెదడుపై ఎలా పడుతోంది, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయనేది.. ప్రధానంగా నేను పరిశోధన చేస్తున్నాను. అదికూడా నేటి యువతపై అనేక రకాలుగా మెదడుపై ఒత్తిడి పడుతోంది. దానిపై ప్రధానంగా పరిశోధన చేస్తున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.