close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

సొంతిల్లా.. మేం ఇప్పిస్తాం!

మహా నగరంలో మాయగాళ్ల వసూళ్ల పర్వం
ఈనాడు, హైదరాబాద్‌

ముషీరాబాద్‌కు చెందిన ఓ మహిళ.. ఇరవైఏళ్లపాటు కూలీనాలీ చేసుకుని కొంత మొత్తం కూడబెట్టుకుంది. గతంలో ప్రభుత్వం నిర్మించిన నివాస సముదాయాల్లో ఓ ప్లాట్‌ను రూ.3 లక్షలకు కొనుగోలు చేసింది. రెండేళ్లుగా యాజమాన్య హక్కును తన పేరిట బదిలీ చేయమంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఆమె నిస్సహాయతను అవకాశం చేసుకుని రంగంలోకి దిగిన దళారులు రూ.లక్ష వరకు గుంజారు. తనకు రూ.40 వేలు ఇస్తే పనిపూర్తిచేస్తానంటూ ఓ ఉద్యోగి వారంరోజులుగా తిప్పించుకుంటున్నాడు. ఇప్పుడు రూ.60 వేలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడంటూ బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

షేక్‌పేట్‌లోని వివాదాస్పద స్థలంలో ప్రభుత్వం రెండు పడకగదుల నిర్మాణం చేపట్టబోతుందనే ఓ దళారి ప్రచారం ప్రారంభించాడు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా తన కనుసన్నల్లోనే సాగుతుందంటూ ప్రచారం చేసుకున్నాడు. దీనికయ్యే ఖర్చుల పేరిట ఒక్కొకరి నుంచి రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకూ వసూలు చేశాడు. నెలల గడుస్తున్నా ఇల్లు సంగతి  కొలిక్కిరాకపోవటంతో బాధితులు అతడిని నిలదీశారు. దీంతో అతడు అక్కడ నుంచి మకాం మార్చాడు. ఎలాగైనా పోయిన సొమ్ములు రాబట్టుకునేందుకు బాధితులు ఓ చోటానేతను ఆశ్రయించినట్లు సమాచారం. ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, వెంగళరావునగర్‌ బస్తీల్లో ఓ దళారి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇప్పిస్తానంటూ రాయబేరాలు సాగిస్తుంది. గతంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లల్లో కొన్ని ఖాళీగా ఉన్నాయంటూ నమ్మిస్తోంది.  ఇటీవల ఇద్దరు మహిళలు తాము లబ్ధిదారుల సొమ్ము స్వయంగా చెల్లిస్తామంటూ చెప్పటంతో వారితో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఈ ఘటనతో తాము మోసపోయినట్టు బాధితులు గ్రహించారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సుమారు 2.5 లక్షల మంది రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉండే కాలనీలు, బస్తీల్లో తిరుగుతూ దరఖాస్తుదారుల వివరాలు తెలుసుకుంటున్నారు.

రూ.వెయ్యిస్తే దరఖాస్తు చేస్తాం.. 2018 ఎన్నికల తరువాత రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణం మళ్లీ తెరమీదకు వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి లబ్ధిదారులు దరఖాస్తులతో వరుసకట్టారు. కొన్ని మీ-సేవ కేంద్రాలు ఒక్కో దరఖాస్తుకు రూ.100-200 వరకూ వసూలు చేశాయి. కలెక్టరేట్‌ వద్ద కొందరు దళారులు తాము ఇళ్లు ఇప్పిస్తామంటూ దరఖాస్తుదారుల నుంచి కొంతమేర సొమ్ములు వసూలు చేశారు. ఇప్పుడు మరోసారి బస్తీల్లో కూలీనాలీ చేసుకునే మహిళలు, చిరు వ్యాపారాలతో కుటుంబాన్ని పోషించే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహాలో సొమ్ములు వసూలు చేస్తున్నారు. సొంతింటికి అవసరమైన దరఖాస్తులు పూర్తిచేసి అధికారులకు అందజేస్తామంటూ కొందరు కొత్త డ్రామా ప్రారంభించారు. ప్రతి దరఖాస్తుదారుడు రూ.1000 ఇస్తే రెండుపడకగదుల ఇంటికి దరఖాస్తు తామే చేస్తామంటూ నమ్మిస్తున్నారు. అదనంగా మరో రూ.20,000 ఇస్తే తామే దగ్గరుండి ఇంటిని మంజూరు చేయిస్తామంటున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.