close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

మేడారం

ఆలయ నగరి... అశ్వారావుపేట దరి!

కొలువుదీరిన కాకతీయుల కళా వైభవం

న్యూస్‌టుడే - అశ్వారావుపేట

అశ్వారావుపేట ప్రాంతం ఆలయాల నగరిగా భాసిల్లుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం తరువాత అత్యధికంగా ఆలయాలు, దేవస్థాన భూములున్న ప్రాంతం అశ్వారావుపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కాకతీయుల కాలం నాటి అనేక కట్టడాలు నేటికీ ఈ ప్రాంత చరిత్రకు అద్దం పడుతున్నాయి. వన దేవతలు కొలువుదీరిన మన్యం నియోజకవర్గ స్వంతం. ఏటా ఉత్సవాల సమయాల్లో వేలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. నవంబరు నుంచి జూన్‌ మొదటి వారం వరకూ ఆలయాల ప్రాంగణాలన్నీ భక్తులతో కిట కిటలాడుతుంటాయి.

కాకతీయుల కట్టడాలకు పురాతన శివాలయాలు ఈ ప్రాంత ఆధ్యాత్మికతకు కొత్త శోభనిస్తున్నాయి. శివరాత్రి వచ్చిందంటే చాలు నియోజకవర్గంలోని అనేక ఆలయాలకు వేలసంఖ్యలో భక్తులతో ఆధ్యాత్మిక సందడికి నిలయంగా మారుతాయి. భద్రాచలం నియోజకవర్గంలో సీతారాములు కొలువై ఉంటే.. అశ్వారావుపేట నియోజకవర్గం బాలాజీ వేంకటేశ్వర స్వామి, బ్రమరాం సమేత మల్లికార్జున స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి, విశ్వేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, యంత్రరాజసహిత కాళేశ్వర స్వామి, దుర్గామల్లేశ్వర స్వామి ఆలయాలు అనేకం ఈ ప్రాంతంలో భక్తులకు ఆధ్యాత్మికతను పంచుతున్నాయి. మండలాల వారీగా ఆలయాలను పరిశీలిస్తే..

అన్నపురెడ్డిపల్లిలోని బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం

అన్నపురెడ్డిపల్లిలో..

అన్నపురెడ్డిపల్లిలోని బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా ఫిబ్రవరి మాసాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్నా ఈ దేవాలయాలు ఉత్సవాల సమయంలో జనారణ్యాన్ని తలపిస్తాయి. అక్కడే ఉన్న బ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు.

చంద్రుగొండలో..

చంద్రుగొండ మండలం బెండాలపాడులో కనకాద్రి గుట్టలు వద్ద కాకతీయుల కాలం నాటి కట్టడాలు నేటికీ దర్శనమిస్తాయి. ఇక్కడ కొలువైన శివుడిని దర్శించుకునేందుకు శివరాత్రి ఉత్సవాల సమయాల్లో భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఇలా పలు ఆలయాలతో అశ్వారావుపేట నియోజకవర్గం జిల్లాలోనే ఆధ్యాత్మిక ప్రత్యేకతను సంతరించుకుంది.
 

భక్తులతో కిటకిటలాడుతున్న గుబ్బలమంగమ్మ ఆలయం

అశ్వారావుపేటలో..

అశ్వారావుపేట మండలంలో ప్రధాన ఆలయాల్లో వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ, గుబ్బలమంగమ్మ ఆలయాలు ప్రసిద్ధి గాంచాయి. ఏటా ముత్యాలమ్మ ఆలయం వద్ద అయిదు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. గుబ్బలమంగమ్మ తల్లి ఆలయం ప్రతి ఆదివారం జాతరను తలపిస్తోంది. వేలాది వాహనాలు బారులు తీరుతున్నాయి. కాకతీయుల కాలం నాటి కోనేటివీధిలోని పురాతన శివాలయం శివరాత్రికి భక్తజనంతో నిండిపోతుంది. శివరాత్రి సమయాల్లో మామిళ్లవారిగూడెం మల్లికార్జున స్వామి ఆలయం, వినాయకపురం యంత్రరాజసహిత కాళేశ్వర ఆలయం, భక్తులతో కిటకిటలాడతాయి.

దమ్మపేటలో..

దమ్మపేటలోని వేణుగోపాల స్వామి ఆలయం, విశ్వేశ్వర స్వామి ఆలయం, అయ్యప్ప గుడి, తెలంగాణ ఏపీ సరిహద్దులో వడ్లగూడెం వద్ద కొలువైన దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం, నాచారం జై లింగేశ్వర స్వామి గుడి, నాగుపల్లి నాగలక్షేశ్వర స్వామి ఆలయం, ప్రసిద్ది చెందాయి. దుర్గం గొల్లగూడెం వద్ద దుర్గం గట్టు వద్ద శివరాత్రికి వనం అంతా జాతరే..

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.