close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

మేడారం

ఆరోగ్యంపై ‘చిరు’ సంతకం

జిల్లా వ్యాప్తంగా తృణ ధాన్యాల పంటలు

మొదటిసారిగా కొర్రలు, సామలు, వరిగలు సాగు..

మణుగూరు, న్యూస్‌టుడే

జీవనశైలిలో మార్పులు వచ్చాయి. సమాజంలో ఆరోగ్యంపై మక్కువ పెరిగింది. తీసుకునే ఆహారంలో జాగ్రత్త కనబరుస్తున్నారు. ఇదే క్రమంలో తృణధాన్యాలపై దృష్టిసారించారు. ప్రజల అభిరుచికి అనుగుణంగా ఆయా పంటల సాగుకు అన్నదాతలు కూడా సిద్ధమయ్యారు. తమ పొలాల్లో పంటలను మార్పు చేస్తున్నారు. తృణ ధాన్యాలను కనీవినీ ఎరుగని రీతిలో సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో వేసిన పంటలు చేతికందాయి. టన్నులకొద్ది ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువమంది రైతులు ఇదే తీరును అనుసరిస్తున్నారు. పంటల్లో వచ్చిన ఈ మార్పుపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

సాగు వివరాలు..

జిల్లాలో రాగులు, కొర్రలు, సామలు, అరికలు, సజ్జలు, వరిగలు, జొన్నల సాగు అపారంగా ఉంది. గతంలో కందులు, మినుములు, పెసర్లు, మిర్చి, వరి పండించిన రైతులు ఈసారి తృణ ధాన్యాలను పండిస్తున్నారు. ఇల్లెందులో జొన్నపంటను, కొర్రలను సుజాతనగర్‌, ఆళ్లపల్లి, టేకులపల్లి, అశ్వారావుపేట, రాగులను ఆళ్లపల్లి, కరకగూడెం, పినపాక, టేకులపల్లి, సామలను కరకగూడెం, ముల్కలపల్లి, వరిగెలను కరకగూడెంలో పండిస్తున్నారు. తృణ ధాన్యాలను సుమారు 1250 ఎకరాల్లో రైతులు పండిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జొన్నపంటను మాత్రం 16మండలాల్లో ప్రధానంగా పండిస్తున్నారు. కొందరు రైతులకు ఇప్పటికే పంటచేతికి రాగా మరికొందరు ఈ వారంరోజుల్లో పంట తీసేందుకు సిద్ధపడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో సరఫరాకు ఒప్పందాలు

ఆహారంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్రతీ దుకాణంలో తృణ ధాన్యాలను విక్రయిస్తున్నారు. దీంతో మధ్యవర్తులు నేరుగా రైతులవద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సూపర్‌మార్కెట్లు, కిరణా దుకాణాలాకు ఈ ధాన్యాన్ని సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. కొందరు రైతులను నేరుగా ఆయా దుకాణాదారులు సంప్రదిస్తున్నారు. దీంతో రైతులు పంటచేతికి వచ్చిన వెంటనే విక్రయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రైతులకు తగిన లాభాలు సమకూరుతున్నాయి. ఈ విషయాన్ని రైతులతోపాటు వ్యవసాయశాఖ అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు.

పది ఎకరాల్లో పండించా..

పోలవరపు రామకృష్ణ, జానంపేట, రైతు

నేను 10ఎకరాల్లో అండుకొర్రలు పండించాను. ఎకరాకు 10క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో వీటికి మంచి గిరాకీ ఉండటంతో పండించాను. వీటిగడ్డి పశువులకు మేతగా పనిచేస్తుంది. వీటిని తీసుకునేందుకు ఆయా దుకాణదారులు ముందుకు వస్తున్నారు. మొదటిసారిగా అండుకొర్రలను మా కుటుంబ సభ్యులందరికీ అందించాను. అన్నం వండుకొని తింటున్నాం. భవిష్యత్తులో కూడా వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని పంటలను వేస్తాను.

మార్పు మంచిదే: తాతారావు, వ్యవసాయ సహాయ సంచాలకుడు, మణుగూరు

సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు ముందుకు వెళ్లడం శుభపరిణామం. ఆరోగ్యంపై వస్తున్న మార్పులను ఆధారం చేసుకొని కొర్రలు, సామలు, వరిగల విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. వర్షాధార పంటలుగా వీటిని గుర్తించాలి. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాం. ఈ పంటల మూలంగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. భవిష్యత్తులో తృణ ధాన్యాలకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ మార్పును సర్వత్రా స్వాగతించాలి.

జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసిన విత్తనాలు: సుమారు 16 క్వింటాళ్లు

సుమారు 1250 ఎకరాల్లో వీటిని పండిస్తున్నారు.

విత్తనాలు.. ఇతర సమాచారం

జాతీయ ఆహార భద్రత మండలి ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు వచ్చాయి.

కేంద్రం ఈసారి కొత్తగా కొర్రలు, సామలు, వరిగల విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

65శాతం రాయితీతో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వీటిని ప్రవేశపెట్టింది.

ఆళ్లపల్లి, టేకులపల్లి, కరకగూడెం, ఇల్లెందు, ముల్కలపల్లి మండలాల్లో ఎక్కువమంది రైతులు పండిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.