close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

కలప కట్టడి.. బొగ్గు విచ్చలవిడి

పక్కదారి పడుతున్న నల్లబంగారం

ఇటుక బట్టీల తయారీలో వినియోగం

ఈనాడు, ఖమ్మం

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం పోచారంరోడ్డులో డంప్‌ చేసిన బొగ్గు ఇదీ. కొద్ది నెలల క్రితం స్థానికంగా రెండు టిప్పర్ల బొగ్గును గుర్తించారు. ఒక్కో టిప్పరు బొగ్గు విలువ రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. ఈ బొగ్గును గుర్తించిన రోజు ఎలాంటి రసీదులు లేవు. రెండో రోజు వాటిని సృష్టించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ తంతు వెనుక ఓ ముఠా ఉందన్న విమర్శలు నెలకొన్నాయి. ఇలా ఎక్కడపడితే అక్కడ సింగరేణి బొగ్గు ఇల్లెందు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా దర్శనమిస్తోంది.

సింగరేణి బొగ్గు వక్రమార్గంలో పయనిస్తోంది.. ఇటుక బట్టీల తయారీకి అక్రమంగా తరలించేస్తున్నారు. సింగరేణి విజిలెన్సు విభాగం ఉదాసీనతతో ఎక్కడ పడితే అక్కడ బొగ్గుట్టలు దర్శనమిస్తున్నాయి. అడవుల్లో కర్రను కొట్టడం, తీసుకురావడం కష్టంగా మారిన నేపథ్యంలో ఇటుక బట్టీ వ్యాపారుల కన్ను నల్లబంగారంపై పడింది. ఇల్లెందు ప్రాంతంలో బొగ్గు బట్టీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఎలాంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి.

 

 

నిఘా పెంచడంతో

గతంలో ఎన్నడూలేని విధంగా అటవీశాఖ అధికారులు నిఘా పెంచి కలప అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ నిఘా పెరగడంతో అటవీ ప్రాంతం నుంచి పూచికపుల్ల కూడా కదలడం లేదు. దుంగలను కొట్టి తీసుకువద్దామన్నా కుదరని పరిస్థితి నెలకొంది. అధికారులు, సిబ్బంది నిఘా పెంచడం, హరితహారం పేరుతో కార్యక్రమాలు నిర్వహించడంతో చెట్ల జోలికి ఎవరూ వెళ్లడంలేదు. కలపతో పట్టుబడితే కేసుల విషయంలో కఠినంగా ఉండటంతో ప్రస్తుతం ఇటుక వ్యాపారుల దృష్టి సింగరేణి బొగ్గుపై పడింది. కలప స్థానంలో బొగ్గును వినియోగించుకొనేందుకు సిద్ధం అవుతున్నారు. గత ఏడాది కూడా ఇష్టానుసారంగా బొగ్గును ఇటుక బట్టీల తయారీకి ఉపయోగించారు. నేటికీ ఆ ఆనవాళ్లు ఇల్లెందు మండలం మొండితోగు, నెహ్రూనగర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లితే తెలిసిపోతుంది. ఇప్పటికీ ఇల్లెందు ప్రాంతంలోని పలు ఇటుక బట్టీల వద్ద బొగ్గు నిక్షేపాలు దర్శనమిస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు: మల్లయ్య, కోయగూడెం ప్రాజెక్టు ఆఫీసర్‌

గుత్తేదారులు ఆన్‌లైన్‌లో బొగ్గును కొనుగోలు చేసుకుంటారు. ఆ బొగ్గును సరఫరా చేయాల్సిన పరిశ్రమలకు సింగరేణి నుంచి తీసుకువెళ్లే క్రమంలో మా పరిధిలోని ప్రతి చెక్‌పోస్టులో తనిఖీ చేస్తాం. చెక్‌పోస్టు దాటి వెళ్లిపోయిన తర్వాత మాకు సంబంధంలేదు. పర్మిటు ఒక వైపు ఉంటే ఇంకొక వైపు బొగ్గు సరఫరా జరిగితే సంబంధిత అధికారులే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇటుక బట్టీలకు సంబంధించిన విషయంలో అదే వర్తిస్తుంది.

ఇల్లెందు, టేకులపల్లి, ఖమ్మం జిల్లా కామేపల్లి, మహబూబాబాద్‌ జిల్లా గార్ల, బయ్యారం మండలాల్లో ఇటుకల తయారీ ఎక్కువ. వీటికోసం ఏర్పాటు చేస్తున్న బట్టీలకు ప్రభుత్వపరంగా ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఏటేటా నడిపించేస్తున్నారు. వర్షాకాలం ముగియడంతో ఇటుకల తయారీకి మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలాచోట్ల మట్టితో ఇటుకల తయారీలో నిమగ్నమయ్యారు. బొగ్గును తీసుకువచ్చి కాల్చడమే తరువాయి. ఇదిలా ఉంటే ఇటుక బట్టీల వద్ద యథేచ్ఛగా విద్యుత్తును వాడేస్తున్నారు. అయినా పట్టించుకొనే నాథుడే కరవయ్యారు.

నిబంధనలు ఏమిటీ?

* ఆన్‌లైన్‌లో క్రయ విక్రయాలు జరగాలి.

* గని నుంచి వెళ్లే ప్రతి వాహనం చెక్‌పోస్టు ద్వారానే వెళ్లాలి. విధిగా తనిఖీ చేయాలి.

* లారీ సామర్ధ్యం ప్రకారమే బొగ్గు నింపాలి. ఎక్కువ వేయరాదు.

* ఎలాంటి అనుమతులు లేకుండా బొగ్గు బయటకు వెళ్లడానికి వీలులేదు.

* సింగరేణి చెక్‌పోస్టు దాటిన బొగ్గు అక్రమ మార్గంలో వెళ్తే విజిలెన్సు విభాగం గుర్తించి పట్టుకోవాలి.

* పర్మిటు ప్రకారం వెళ్తుందా? లేదా? గమనించాలి.

ఏం చేస్తున్నారు?

* ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసినా విక్రయాలు పక్కదారి పడుతున్నాయి.

* సింగరేణి చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నామమాత్రంగా మారాయి.

* పరిమితికి మించి బొగ్గును టిప్పర్లలో వేస్తున్నారు. ఓవర్‌ లోడింగ్‌తో వెళ్తున్నా పట్టించుకోవడం లేదు.

* విజిలెన్సు విభాగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.

* పర్మిటు ఒక వైపు, తరలింపు మరో వైపు ఉంటుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.