close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

మేడారం

యంత్రం లేక సాగేదెలా?

‘వ్యవసాయ యాంత్రీకరణ’కు నిధుల గ్రహణం

సన్న, చిన్నకారు రైతులకు అందని సాయం

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

పెరిగిన పెట్టుబడులు.. కూలీల కొరత వెరసి యంత్రం లేనిదే పంటలకు సాగలేని పరిస్థితి తలెత్తుతోంది. ఈ దశలో రైతులకు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా సాగు చేసేందుకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందించాల్సి ఉంది. గత కొన్నేళ్ల నుంచి ‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవటంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. 2015-16 సంవత్సరం తర్వాత నల్లపట్టాలు తప్ప ఇంత వరకు ఒక్క పరికరం కూడా రైతులకు అందలేదు. ట్రాక్టర్లు, హార్వెస్టర్ల లాంటివి మినహా సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగపడే పరికరాలను మాత్రం మంజూరు చేయలేదు. సుమారు 6లక్షల విస్తీర్ణం కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, అపరాల పంటలను ఎక్కువ సాగు చేస్తారు.

2015-16లో ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా ట్రాక్టర్ల కోసం రూ.8.25కోట్లు మంజూరు చేసింది. ఆ తర్వాత అదనంగా మరో రూ.కోటి కూడా మంజూరు చేశారు. మొత్తం రూ.9.25కోట్లతో ఉమ్మడి జిల్లాలోని రైతులకు పెద్ద ఎత్తున ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

స్ప్రేయర్లు, ట్రాక్టర్‌ పరికరాలు, ట్రాక్టర్లు ఇతర ఎలాంటి పరికరాలను కూడా గత గత మూడేళ్ల నుంచి అందించలేదు. గతంలో 50శాతం రాయితీపై వ్యవసాయ యంత్రపరికరాలను అందజేసే వారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో తైవాన్‌ స్ప్రేయర్లు, బ్యాటరీతో నడిచే స్ప్రేయర్లు, రోటావేటర్లను బాగా వినియోగిస్తారు.

2016-17 సంవత్సరంలో జిల్లాకు 158 ట్రాక్టర్లు మంజూరయినా ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైన అనుమతి రానందున నిలుపుదల చేశారు. దరఖాస్తులు స్వీకరణ, స్క్రూటినీ చేసి తుది జాబితా తయారు చేయాల్సి ఉంది. భౌతిక కేటాయింపులు వచ్చినందున దరఖాస్తులను స్వీకరించి యాంత్రీకరణ ప్రక్రియను చేపట్టారు. ట్రాక్టర్లతో పాటు యంత్రపరికరాలకు కూడా దరఖాస్తులు స్వీకరించారు.

2017-18 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణకు రూ.17కోట్లు కేటాయించారు. నిధులు విడుదలైతే దరఖాస్తులు స్వీకరించాలని భావించారు. కేవలం రూ.64లక్షలు మాత్రమే మంజూరు చేశారు. ఈసంవత్సరం కూడా రూ.17కోట్లకు భౌతికపరమైన అనుమతులు వచ్చాయి. ఆర్థిక పరమైన అనుమతులు వచ్చిన తర్వాత యాంత్రీకరణ ప్రక్రియను చేపడతారు. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ కాస్త గడిచిపోయింది. కనీసం రబీలో నైనా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కూలీల కొరతతో ఇబ్బందులు

గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉంది. పత్తి, మిరప పంటలను తీసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను రైతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయంలో కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. యాంత్రీకరణ నేపధ్యంలో చిన్నచిన్న యంత్రాలు, పరికరాల ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చని రైతులు భావిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల కావటం లేదు. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నప్పటికీ వ్యవసాయ యాంత్రీకరణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. పొలాల్లో చేతికి వచ్చిన పంటను రక్షించుకోవాలంటే పెద్ద ఎత్తున నల్లపట్టాలు అందించాల్సిన అవసరం ఉంది. పురుగు మందుల పిచికారీకి, కలుపు నివారణకు, పంటలను నూర్పిడి చేసేందుకు, లేదా పంట తీసుకునేందుకు అవసరమైన వ్యవసాయ పరికరాలు ఉంటే ప్రయోజనం ఉంటుంది.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం

ఏ.ఝాన్సీలక్ష్మికుమారి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, ఖమ్మం

వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన నిధులు ప్రభుత్వం త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. అవి రాగానే పనులు ప్రారంభిస్తాం. సన్న, చిన్నకారు రైతులకు సంబంధించిన పరికరాల కొనుగోలు గురించి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని మంజూరు చేస్తాం. ట్రాక్టర్లు, హార్వెస్టర్లకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి కోట్లాది రూపాయలు మంజూరు చేసింది. దీని వల్ల జిల్లా వ్యవసాయరంగంలో పెను మార్పులు వచ్చాయి. వ్యవసాయం చాలా అభివృద్ధి చెందింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.