close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

మేడారం

వైఫల్యం.. విజయానికి మెట్టు

అదనపు డీసీపీ శ్రీనివాస్‌
చదువు-కొలువు అవగాహన సదస్సుకు స్పందన
న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం

విద్యార్థులు లక్ష్యంతో చదివితే జీవితంలో స్థిరపడేందుకు అనేక అవకాశాలున్నాయని, వాటిని సాధించే క్రమంలో పొందే వైఫల్యాన్ని విజయానికి ఒక మెట్టుగా భావించి ముందుకు సాగాలని అదనపు డీసీపీ ఎస్‌.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని టీఎన్‌జీవో వేడుక మందిరంలో ఈనాడు, ఐసీఎఫ్‌ఏఐ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ యూనివర్సిటీ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ‘చదువు-కొలువు’ అంశంపై శుక్రవారం విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సుకు పలు జూనియర్‌, డిగ్రీ కళాశాలల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ‘ఈనాడు-కరీంనగర్‌’ యూనిట్‌ మేనేజర్‌ టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని అదనపు డీసీపీ శ్రీనివాస్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పరంగా రాష్ట్ర, కేంద్ర స్థాయిలో పలు ఉద్యోగాలున్నాయని, వీటిని సాధించాలనే తపన విద్యార్థుల్లో బలపడాలని సూచించారు. పరిపూర్ణమైన విజ్ఞానాన్ని సాధించేందుకు మూడున్నరేళ్లలో 10 వేల గంటలు మనసును కేంద్రీకరించి చదవాలని సామాజిక శాస్త్రవేత్తలు నిర్ధారించారని పేర్కొన్నారు. టీనేజీలో కేరీర్‌పై దృష్టి నిలిపి అడ్డంకులను అధిగమిస్తూ కుటుంబ మూలాలు, నేపథ్యంపై ఆలోచన చేస్తూ భవిష్యత్తులో ఏం సాధించాలన్నదానిపై విద్యార్థులు దృష్టినిలిపి కన్నవారి ఆశలను నెరవేర్చాలన్నారు. విద్యార్థులకు విశ్లేషణతో కూడిన లక్ష్యం ఉండాలని, ఇంజినీరింగ్‌ చదివిన యువకులు కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం వస్తున్నారని చెప్పారు. ‘ఈనాడు-కరీంనగర్‌’ యూనిట్‌ మేనేజర్‌ టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఇంటర్‌ టర్నింగ్‌ పాయింట్‌ అని, ఉన్నత చదువులు చదివి స్థిరపడేందుకు విద్యార్థులు పట్టుదలతో శ్రమించాలన్నారు. విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా చదువుల్లో రాణించి ఉన్నతస్థాయికి ఎదిగి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని తెలిపారు.డాక్టర్‌ టి.శ్రీనివాస్‌రావు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఐసీఎఫ్‌ఏఐ,  పి.వి.సుబ్బారావు, కన్సల్టెంట్‌, ఐసీఎఫ్‌ఏఐ మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు అందించారు.  సదస్సుకు హాజరైన విద్యార్థుల్లో ముగ్గురిని లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేసి వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.

ఆసక్తి ఉంటే ఏశక్తీ ఆపలేదు
-డి.జ్యోతిరెడ్డి, సీఈవో, కీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు
ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో నిలవాలనే ఆసక్తి నేటి విద్యార్థుల్లో ఉంటే ఏశక్తీ ఆపలేదు.. అందరిలా నేను లేననే ఆత్మన్యూనత భావాన్ని విద్యార్థులు వీడాలి.. నేను కూడ అదే చేశాను. పదో తరగతి వరకు చదివిన నేను వివాహామైన అనంతరం మైలారంలో రూ.5లకు వ్యవసాయ కూలీగా పనిచేశా.. 2000ల సంవత్సరం వరకు తనకు గల ఇద్దరు పిల్లలను సాదలేక, ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఆయోమయంలో ఉన్నా.. ఇది కాదు జీవితం అనుకున్నాను. ఆ రోజుల్లో రూ.120 వేతనంతో చేసిన అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ఉద్యోగం జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌.. ప్రస్తుతం అమెరికాలో ఏడాదికి 18 మిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ గల కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నా.. తెలివికి పేదరికం అడ్డుకాదు.. సాధించాలనుకునే లక్ష్యం కోసం రాజీపడకుండా, పరిస్థితులకు అనుగుణంగా మార్పులను తెచ్చుకుంటే.. సాధ్యం కానిది ఏదీ లేదు.

విద్యార్థులు లక్ష్యాలపై దృష్టి నిలపాలి
- డాక్టర్‌ మాధురి ఇరాని, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఐసీఎఫ్‌ఏఐ
ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఆలోచన విధానాలను మార్చుకుని లక్ష్యాలను సాధించే దిశగా దృష్టి నిలపాలి. ఐసీఎఫ్‌ఏఐ డీమ్డ్‌ యూనివర్సిటీ లా కోర్సులను అమలు చేస్తోంది. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సులను చదవవచ్చు. ఇంటర్‌ మార్కులు, ఆపై కోర్సులోని మెరిట్‌ను బట్టి ఉపకార వేతనాలను విద్యార్థులకు అందిస్తున్నాం. యూనివర్సిటీలో అందరికీ ఒకే రకమైన రుసుంలుంటాయి. మెరిట్‌ ప్రాతిపదికనే ప్రవేశాలు ఉంటాయి. డే స్కాలర్స్‌కూ ప్రవేశాలుంటాయి. లా కోర్సును పూర్తి చేసిన విద్యార్థులు కార్పొరేట్‌, ప్రముఖ కంపెనీలు, బోధన, న్యాయ రంగంలో స్థిరపడవచ్చు. వర్సిటీలో బీఏ, బీబీఏ కోర్సులతో లా పూర్తిచేసే అవకాశం ఉంది. యూనివర్సిటీలో ప్రవేశం పొందే విద్యార్థులు ఎడ్యుకేషన్‌ రుణం పొందవచ్చు.

ఇంజినీరింగ్‌ కోర్సులపై అవగాహన అవసరం
-డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
ఇంజినీరింగ్‌ కోర్సులు చేసే విద్యార్థులకు వాటిపై అవగాహన అవసరంతో పాటు వారికి లక్ష్యం ఉండాలి. ఇంజినీరింగ్‌లో దేన్ని ఎంపిక చేసుకోవాలనే స్పష్టత కల్గి ఉండాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతలోనూ మార్పులు వస్తున్నాయి. వాటికి అనుగుణంగా తమ వర్సిటీలో ఇంజినీరింగ్‌ కోర్సులను కొత్తగా ప్రవేశపెడుతున్నాం. ఇంజినీరింగ్‌ చేసే ప్రతి విద్యార్థిని పలు కంపెనీల్లో ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేయాలి. కొత్త ఆవిష్కరణలు చేసే ఇంజినీరింగ్‌ కోర్సుల్లోని విద్యార్థులకు యూనివర్సిటీలోనే ఇంకుబేషన్‌ సెంటర్‌ను కేటాయిస్తూ ప్రోత్సహిస్తున్నాం. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంచుతున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.