close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

మేడారం

మత్స్య సహకార సమరంపై కసరత్

జిల్లాలో 30 సంఘాలకు కొత్త పాలకవర్గాల ఎన్నిక
ఓటరు జాబితాల రూపకల్పనలో జిల్లా యంత్రాంగం
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

మత్స్య సహకార సంఘాల ఎన్నికలకు నగారా మోగనుంది. పదవీ కాలం పూర్తయిన సంఘాలకు కొత్త పాలకవర్గాల ఎన్నికకు కసరత్తు మొదలైంది. జిల్లాలో 30 సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు జాబితాలకు మెరుగులు దిద్దుతున్నారు. సంఘం సభ్యుల్లో ఎవరైనా మృతి చెందారా? ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా? బోగస్‌ సభ్యులున్నారా? తదితర వివరాలపై ఆరా తీస్తున్నారు.

ఓటరు జాబితా వడపోతపై క్షేత్ర స్థాయిలో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు తుది ఓటరు జాబితా రూపొందించే పనిలో అధికారులు తలమునకలయ్యారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ఉచిత చేప పిల్లలు, వాహనాలు, ఇతర వనరులు సమకూర్చేందుకు భారీగా  నిధులు కేటాయిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాల్లో సంఘాల భాగస్వామ్యం కీలకం కానుంది. దీంతో కొత్తగా సంఘాల్లో పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా తమ అనుచరులకే పదవీ పీఠం దక్కించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడంతో సందడి నెలకొంది.

సంఘాల తీరుతెన్నులు
మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. మత్స్యకార కుటుంబాలున్న చోట సంఘంగా ఏర్పడాలంటే కమాండ్‌ ఏరియాలో 21 ఎకరాల చెరువు విస్తీర్ణం, నాన్‌ కమాండ్‌ ఏరియాలో 42 ఎకరాల విస్తీర్ణం చెరువులు ఉండాలని నిబంధనలు విధించారు. ప్రతి సభ్యుడికీ కనీసం ఎకరం చొప్పున చెరువు విస్తీర్ణం అవసరం ఉంది. ఈ లెక్కన చెరువుల విస్తీర్ణం ఆధారంగా సంఘాల్లో సభ్యలు నియామకం ఉంటుంది. ఈ ప్రాతిపదికన సంఘాల లబ్ధిదారులకు రాయితీ వర్తించనుంది. ప్రతి సంఘంలో కనీసం 21 సభ్యులుండటం తప్పనిసరి. అంతకన్నా ఎక్కువ ఉన్నా ఫరవాలేదు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 160 సంఘాలుండగా 9862 మంది సభ్యులు కొనసాగుతున్నారు.

చేయెత్తే పద్ధతిలో ఎన్నిక
జిల్లాలో 30 సంఘాల పదవీ కాలం పూర్తయింది. రామగుండంలో 15, అంతర్గాంలో 4, పాలకుర్తిలో 3, ధర్మారంలో 3, ఓదెలలో 2, కమాన్‌పూర్‌లో 2 సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి సంఘానికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ఆరుగురు సభ్యులుగా ఎన్నికోనున్నారు. ఆయా పదవులకు పోటీ ఉంటే చేయి ఎత్తే విధానాన్ని పాటించనున్నారు. ప్రస్తుతం సంఘాల్లోని ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. కాగా ఆ జాబితాలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల ఉద్యోగులు, బినామీలకు సభ్యత్వం ఉన్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జాబితాలో పొరపాట్లున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు. బోగస్‌ సభ్యులను తొలగించి పారదర్శక జాబితా రూపొందిస్తున్నారు.

పదవుల పందేరం
మత్స్యకారుల ఆదాయాభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తోంది. ఉచితంగా చేప పిల్లల పంపిణీ, చేపలను తరలించేందుకు ద్విచక్ర, ఇతర వాహనాలు అందిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1.30 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేశారు. రూ.16.62 కోట్లతో 1830 ద్విచక్ర, ఇతర వాహనాలు పంపిణీ చేశారు. దీంతో సంఘాల పదవులకు డిమాండ్‌ పెరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నది పొడవునా జల కళ సంతరించుకోవడంతో సమీప పాంతాల్లోని సంఘాల పాలకవర్గం ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.