close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మంచు కురిసే వేళ.. 

మైదానంతో పోలిస్తే ఏజెన్సీలో పెరుగుతున్న ప్రమాదాలు

పొగమంచుకు నిద్రమత్తు, అతివేగం తోడు

రహదారులపై ఆగని ‘శీతాకాల’ ప్రమాదాలు

పాల్వంచ పట్టణం, మణుగూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే

గతేడాది పాల్వంచలో ఎదురుగా వస్తున్న లారీ కనిపించక ఢీ కొన్న రెండు లారీలు (దాచిన చిత్రం)

గతేడాది నవంబరు 12..

తెల్లవారుజామున విపరీతమైన మంచు కురుస్తుంది. పాత పాల్వంచ పరిధిలో ఓ లారీ డ్రైవర్‌ ఎదురుగా వస్తున్న మరో లారీని గమనించకుండా ఢీకొట్టాడు. అక్కడికక్కడే చనిపోయాడు. పొగమంచుకు నిద్ర మత్తు తోడవటమే ఈ ప్రమాదానికి కారణం.


అదే సంవత్సరం..

ఇల్లెందు పట్టణం జేకే కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థులు తమ స్నేహితుణ్ని గాంధీపురం రైల్వేస్టేషన్‌ వద్ద దింపేందుకు వచ్చారు. తిరిగి వస్తుండగా రహదారిని మంచు కప్పేసింది. ‘పగ’మంచుకు వీరి వేగం తోడవటంతో లారీని

తప్పించబోయి విద్యుత్తు స్తంభానికి ఢీకొట్టారు. ఇద్దరూ లోకం వీడారు.

భద్రాద్రి జిల్లాలో ఇలా..

శీతాకాలం నిశీధి వేళలు ప్రయాణికుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. తెల్లవారు జామునుంచే పొగమంచు రహదారులను కమ్మేస్తూ ప్రయాణికుల పాలిట పగమంచుగా మారుతోంది. సాయంత్రం 5.30 గంటలు దాటిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. మంచుకు చలిగాలులు తోడు కావటంతో చీకటి వేళల్లో ప్రయాణమంటే అప్రమత్తంగా ఉండక తప్పదు. ద్విచక్ర వాహనదారులైతే నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలతో ‘చలి’ కాచుకున్నట్టే. ప్రత్యేకించి తెల్లవారు జామున పది అడుగుల ముందు ఏమున్నదీ స్పష్టంగా కనిపించడం లేదు. ఉదయం తొమ్మిది గంటల వరకూ రోడ్డుపై మంచు దుప్పటి ఆవరించి ఉంటోంది. డిసెంబరు నేపథ్యంలో ఉభయ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో సూరీడు నెత్తికెక్కుతున్నా.. మంచు మాత్రం వీడటం లేదు. ప్రధానంగా ఏజెన్సీలో రహదారులను మంచుకప్పేస్తోంది. ప్రతికూల వాతావరణంలో వాహన చోదకులు ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ప్రమాదాల బారిన పడటం ఖాయమని గతానుభవాలు హెచ్చరిస్తున్నాయి.

మంచు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ అంటూ దేశంలోకానీ, రాష్ట్రంలో కానీ ఏమీ లేదు. వాహన చోదకులు జాగ్రత్తగా నడపడం ఒక్కటే పరిష్కారం. ఖమ్మం జిల్లా పరిధిలో శీతాకాల సమయంలో గత రెండేళ్లలో ప్రమాదాలు అంత క్రితం ఏడాదితో పోల్చిచూస్తే తగ్గినా ఆ సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. ఇక భద్రాద్రి జిల్లాలో అయితే ప్రమాదాలు పెరిగాయి. మంచు తీవ్రత, జాతీయ రహదారి విస్తీర్ణం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. చోదనలో నిబంధనలను పాటించేందుకు డ్రైవర్లు ఆసక్తి చూపడం లేదు. ఇష్టారీతిగా రహదారుల అంచుల వద్ద లారీలు, వ్యాన్లు, బస్సులు, కార్లు, ఇతర వాహనాలను నిలుపుతున్నారు. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక, ఆఖరి నిమిషంలో తప్పించబోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. నాలుగేళ్లుగా జరిగిన ప్రమాదాల్లో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవటం, రహదారుల వెంట వాహనాలు నిలపడం ద్వారా జరిగినవే అధికంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరోపక్క అధ్వాన రహదారులూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గుంతల వద్ద అకస్తాత్తుగా బ్రేక్‌ వేయటం, వెనకనుంచి వచ్చే వాహనాలు వాటిని ఢీకొనటంతో మరణాలు సంభవిస్తున్నాయి. జాతీయ రహదారులపై వాహనదారులు వేగంగా వస్తూ ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించే లోగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతుంది. ఉభయ జిల్లాల్లో రాత్రి సమయంలో వాహనాలను మితిమీరిన వేగంతో నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

నిద్రమత్తులోనే..:తెల్లవారుజామున డ్రైవర్లు నిద్రమత్తులో ఉంటారు. రాత్రిపూట నడిపి ఉదయం వచ్చే సరికి నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నిద్ర వస్తే సరైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని వాహనాన్ని పక్కనబెట్టి కునుకు తీయటం ఉత్తమం. కానీ ఈ జాగ్రత్తను పాటించటం లేదు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..

పొగ మంచుతో దారి కనిపించని పరిస్థితి ఉన్న సమయాల్లో హెడ్‌లైట్లతోపాటు ఫాగ్‌ల్యాంప్స్‌ వినియోగించాలి. అప్పుడు మరింత వెలుతురు ప్రసరించి రహదారి స్పష్టంగా కనిపిస్తుంది.

ఫాగ్‌ల్యాంప్స్‌ వినియోగించినా రహదారి స్పష్టంగా కనిపించకపోతే వాహనాన్ని నిలిపేసి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం.

వాహనాలను రహదారి అంచుల్లో నిలపడం.. నిలిపి ఉంచడం ప్రమాదకరం.

వాహన చోదకులు వేగాన్ని తగ్గించుకోవాలి. అప్పుడే చివరి నిమిషంలో ఏదైనా ప్రమాదాన్ని గుర్తించినా అప్రమత్తమై తప్పించుకునే అవకాశం ఉంటుంది.

పొగ మంచు కురిసే రోజుల్లో రహదారి నిబంధనలను పక్కాగా పాటించాలి. అపసవ్య దిశలో ప్రయాణం అసలుకే మోసం.

మితిమీరిన వేగం వద్దు

కేఆర్‌కే ప్రసాద్‌రావు, డీఎస్పీ పాల్వంచ

అవగాహన లేమి, మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చలికాలంలో రహదారి పక్కన ఏర్పాటు చేసిన బోర్డులను అనుసరించి ప్రయాణం చేస్తే మంచిది. మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులున్నాయి. వాటిని కూడా గమనించాలి. ఒక వాహనాన్ని దాటిపోవాలన్న ఆత్రుత డ్రైవర్లకు ఉండొద్ధు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.