close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

ఉల్లిగడ్డుకాలం

ఘాటెక్కుతున్న ఉల్లి ధరలు

ఇళ్లల్లో.. హోటళ్లలో వినియోగానికి వెనకడుగు

ఈనాడు, ఖమ్మం

ఉల్లిని కోస్తే కాదు చూస్తేనే నీళ్లొస్తున్నాయ్‌..

ఉల్లి దెబ్బకు తల్ల‘డిల్లి’న రోజులు

మళ్లీ గుర్తొస్తున్నాయ్‌..

నిన్నటిదాకా వంటింటి కుందేలు..

నేడు తాకాలంటే దిగాలు..

‘విందు’గలదందు లేదని సందేహం లేదొకప్పుడు..

ఎందెందు చూసినా కనిపించదే నేడిప్పుడు..

దోసెకు టాటా చెప్ఫి. బజ్జీలను బుజ్జగించి

మాంస ‘ప్రియహారం’ లోంచి మాయమై..

ఒక్కతే ఆకాశాన్నంటి.. ‘ఆ ఒక్కటీ అడగకు’ అనిపించుకుంటున్న ఉల్లితల్లీ.. నేలదిగిరా మళ్లీ..

హోటళ్లలో ఉల్లి దోశ ఊసేలేదు.. బజ్జీల బండి వద్ద ఉల్లిపాయల ముచ్చటే లేదు. రెస్టారెంట్లు, దాబాల వద్ద వెళ్లగానే నిమ్మకాయలతోపాటు అందించే ఉల్లిపాయల స్థానంలో దోసకాయ ముక్కలు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ప్రత్యామ్నాయంగా క్యాబేజీ, క్యారెట్‌ వంటివి వచ్చిచేరుతున్నాయి. ఇదీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు. ఉల్లిపాయల ధర రోజురోజుకూ ఆకాశం వైపు చూస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు వీటి జోలికి వెళ్లేందుకు సాహసించడం లేదు. హోటళ్లు, బజ్జీ బండ్ల వ్యాపారులు సైతం ప్రత్యామ్నాయాలపైనే దృష్టి సారించడం గమనార్హం.

‘ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదు’ అని నానుడి. నేడు అది అందని ద్రాక్షగానే మారుతోంది. శాకాహారులే కాదు మాంసాహారులకూ కష్టమొచ్చి పడింది. వారి జిహ్వాచాపల్యానికి ఉల్లి పరీక్ష పెడుతోంది. ఉల్లిపాయల దోశలు వేయాలని డిమాండ్‌ చేసినా హోటళ్లలో వేయడం లేదు. ఏదైనా అడగండి ‘ఆ ఒక్కటి(ఉల్లి)’ తప్ప అన్నట్లుగా స్పందిస్తున్నారు. ఎవరైనా ఉల్లిపాయలు కావాల్సిందే అని గట్టిగా పట్టుబడితే ప్రత్యేకంగా ఛార్జి వసూలు చేస్తున్నారు. రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా బిల్లు వేస్తున్నారు. ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు తదితర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, దాబాల్లో ఉల్లిపాయలు గతం మాదిరి కనిపించడం లేదు.

ధరల్లో వ్యత్యాసం.. ఉల్లి ధరలపై నియంత్రణ కొరవడటంతో వ్యాపారులు ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. ఉభయ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో రకంగా ధర పలుకుతోంది. ఖమ్మం నగరంలో అయితే ఏరియాకో ధరకు విక్రయిస్తుండటం గమనార్హం. ఖమ్మం నగరంలో మూడు రైతుబజార్‌లో ధరల వ్యత్యాసం కనిపిస్తోంది. ఖమ్మం ఆర్డీవో కార్యాలయం సమీపంలోని రైతు బజార్‌లో కిలో ఉల్లిగడ్డ రూ.60, రూ.70, రూ.80, రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. చిన్న గడ్డలు, పచ్చి గడ్డల ధరలు తక్కువగా ఉండగా.. నాణ్యత కలిగిన ఉల్లిగడ్డల ధర ఎక్కువగా ఉంది. డీఆర్‌డీవో కార్యాలయంలోని రైతుబజార్‌కు వెళ్తే కిలో ఉల్లిగడ్డ ధర రూ.120. రోటరీనగర్‌లోని రైతుబజార్‌కు వెళ్తే అక్కడ ఏకంగా రూ.140 పలుకుతోంది. ఉభయ జిల్లాల్లో తీసుకుంటే ఇల్లెందులోనే కిలో ఉల్లిగడ్డ రూ.110 పలుకుతోంది. మిగతా ఎక్కడ చూసినా ధరలు ఎక్కువగానే ఉన్నాయి.

సత్తుపల్లిలో కొరత.. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో ఉల్లిగడ్డలు కొనుగోలు చేద్దామంటే ఎక్కువ ధరకైనా అందుబాటులో ఉన్నాయి. సత్తుపల్లి పట్టణంతోపాటు పలు గ్రామాల్లో ఉల్లి మార్కెట్‌లో అరకొరగా అందుబాటులో ఉంటోంది. దిగుమతి తగ్గడంతో సరకు సత్తుపల్లి వరకు వెళ్లడం లేదు. వైరాలోనూ అరకొరగానే ఉల్లి మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.