close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

ఇదే మెరుగు.. కాదు తరుగు

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం నిర్వాసితుల పట్టు

సాధ్యం కాదంటున్న అధికారులు

పీవీకాలనీ (మణుగూరు), న్యూస్‌టుడే

గ్రామ సభలు ఇలా..

రామానుజవరం: 4

ఇప్పలిసింగారం: 2

తీర్మానాలు: 0

రైలు మార్గం నిర్మాణం పట్టాలెక్కటంలో ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. పరిహారం విషయంలో అధికారులు ఇదే మెరుగు అంటున్నారు.. నిర్వాసితులు అదేంకాదు తరుగు అంటున్నారు.. బాధితులు ప్యాకేజీ కోసం పట్టుబడుతున్నారు. పాలకులు అది సాధ్యం కాదని చెబుతున్నారు.. ఆరుసార్లు గ్రామసభలు నిర్వహించినా ఎక్కడా తీర్మానం లేకుండాపోయింది. మణుగూరు నుంచి భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రానికి (బీటీపీఎస్‌) బొగ్గు రవాణా చేసేందుకు ఏర్పాటుచేస్తున్న రైలు మార్గం కోసం సేకరించే భూమికి ప్రభుత్వం ఇవ్వజూపే పరిహారంపై రైతులు, గ్రామస్థులు ఆసక్తి చూపటం లేదు. పెసా గ్రామసభల్లో మెరుగైన పరిహారం కోసం పట్టుబడుతున్నారు. అధికారులు మాత్రం నిబంధనలు అంగీకరించవంటూ స్పష్టమైన హామీ ఇవ్వటం లేదు. భూ సేకరణ ప్రక్రియ మందుకు సాగుతుందా? లేదా? అనుమానాలు ఏర్పడుతున్నాయి.

భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రానికి (బీటీపీఎస్‌) ప్రతిపాదిత రైలు మార్గంలో నిర్వాసిత పట్టా భూమికి ఎకరానికి రూ.8 లక్షలు, ప్రభుత్వ భూమికి మరోలా నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి స్థలం, నివాసం కోల్పోయేవారికి ఖరీదును బట్టి గిరిజనులకు, గిరిజనేతరులకు వేర్వేరుగా పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. కానీ రైతులు, గ్రామస్థులు.. బీటీపీఎస్‌ నిర్వాసితులకు చెల్లించిన పరిహారాన్ని ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలా అయితేనే భూములిస్తామంటున్నారు. ప్రభుత్వం మాత్రం రహదారులు, రైలుమార్గం కోసం నిర్వహించే భూ సేకరణ లీనియర్‌ ప్రాజెక్టుకు కిందకు వస్తుందని, ఆర్‌అండ్‌ ప్యాకేజీ సాధ్యపడదంటోంది.

స్వల్ప భూమి కోల్పోయే వారి సంఖ్యే ఎక్కువ.. రైలు మార్గం కోసం ప్రభుత్వం సేకరించే 120.39 ఎకరాల భూమిలో చిన్న మొత్తాల్లో భూమి కోల్పోయేవారి రైతుల సంఖ్య ఎక్కువ. పొడవుగా మార్గం ఉండటంతో ఎంత భూమి కావాలో అంతనే సేకరించేందుకు ప్రభుత్వం సర్వే చేసింది. ఎకరాల వారీగా కోల్పోయే వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంటే, కుంటల వారీగా కోల్పోయే వారు వందల్లో ఉన్నారు. రైలు మార్గం పంట భూముల మధ్యలో వెళ్తుందని, మిగిలిన భూమికి నీరు అందించటం కష్టం అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం చెల్లిస్తానన్న పరిహారం స్వల్పంగా భూమిని కోల్పోయే వారికి ఆమోదయోగ్యం కాదంటున్నారు.

ఇళ్లు తీసుకోవాలని పట్టు.. రైలు మార్గం ఏర్పాటుకోసం పూర్తి స్థాయిలో ఇళ్లను తీసుకోవాలని ఇప్పలసింగారం పంచాయతీలోని చెరువు ముందు సింగారం గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామం మధ్యలో నుంచి లైన్‌ పోతుంది. 40 ఇళ్లుండగా ప్రభుత్వం 13 ఇళ్లను మాత్రమే సేకరించనుంది. సమీపంలో నుంచి రైల్వే లైన్‌ వెళ్లనుండటంతో తాము ఎలా జీవించగలమని మిగిలిన 27 ఇళ్లను కూడా తీసుకుని పరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.

చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తాం: భవేశ్‌ మిశ్రా, సబ్‌ కలెక్టర్‌

రైలు మార్గం ఏర్పాటనేది లీనియర్‌ ప్రాజెక్టు కిందకు వస్తుంది. రైతుల డిమాండ్లను ఉన్నతాధికారులకు తెలియచేస్తా. చెరువుముందు సింగారం సమస్యను పరిష్కరించేందుకు మళ్లీ అధికారులు సర్వే చేస్తారు.

బీటీపీఎస్‌ రైల్వే మార్గం భూసేకరణకు ఆదిలోనే ఆటంకాలు

ప్రభుత్వ వాదనిలా..

పట్టా భూమికి ఎకరానికి రూ.8 లక్షలు

ప్రభుత్వ భూమికి ఎకరానికి మరో ధర.

నివాసం, ఇంటి స్థలం కోల్పోయే గిరిజనుడికి ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు నిర్మించుకునేందుకు పరిహారం.

నివాసం, ఇంటి స్థలం కోల్పోయే గిరిజనేతరుడికి ఇంటి నిర్మాణం కోసం పరిహారం.

ఇంటి ఆవరణలో ఉన్న చెట్లు, బావి లేదా బోరుకి విలువను బట్టి పరిహారం.

రైలు మార్గం వెళ్లే చెరువు ముందు సింగారం

నిర్వాసితుల డిమాండ్లు ఇలా..

బీటీపీఎస్‌ నిర్వాసితులకు చెల్లించినట్టు ప్యాకేజీ నష్ట పరిహారం చెల్లించాలి.

ఇళ్లు, భూమి కోల్పోయే వారిలో అర్హులకు ఉద్యోగం ఇవ్వాలి.

రైలు మార్గం ఏర్పాటుతో దెబ్బతిన్న రహదారులను, కల్వర్టులను పునర్‌ నిర్మించాలి.

చెరువుముందు సింగారంలో 13 ఇళ్లను కాకుండా మొత్తం 40 ఇళ్లను తీసుకోవాలి.

ఇళ్లు కోల్పోయే వారికి మెరుగైన నష్ట పరిహారం చెల్లించాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.