close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

విలువలు నేర్పాల్సిన సమయం..

నైతిక విద్యను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు

గతంలో ఫలితమిచ్చిన వినూత్న కార్యక్రమాల నిర్వహణ

న్యూస్‌టుడే, వీరన్నపేట (మహబూబ్‌నగర్‌)

మహబూబ్‌నగర్‌ కస్తూర్బాగాంధీ విద్యాలయంలో నీతి కథల పుస్తకాలు చదువుతున్న విద్యార్థులు

పై మూడు కార్యక్రమాలు మహబూబ్‌నగర్‌ జిల్లాలో సత్ఫలితాలనిచ్చాయి. జిల్లా అధికారులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా.. సమ భావన పెరిగేలా విద్యాలయాల్లో శిక్షణలు ఇప్పించగా విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం దిశ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి నైతిక విలువల విద్యను ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది.. వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌.. వాయిస్‌ ఫర్‌ బాయ్స్‌.. బాలికా సాధికారత క్లబ్‌ల వంటి కార్యక్రమాలతో విద్యాలయాల్లో చాలా మార్పులు వచ్చాయని క్షేత్రస్థాయిలో గుర్తించారు. నైతిక విలువల విద్యను సరిగా అమలు చేయడంతోపాటు తల్లిదండ్రులు సైతం పిల్లల నడవడికపై దృష్టి సారిస్తే వారు మంచి పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది.

దిశ హత్య కేసు తరవాత రాష్ట్ర ప్రభుత్వం నైతిక విద్యను ప్రవేశ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నా.. ఇంకా పాఠ్యాంశాలపై స్పష్టత రాలేదు. ప్రధానంగా మంచి పౌరులుగా ఎదిగేందుకు కావాల్సిన అంశాలతో కూడిన విధంగా పాఠ్యాంశాలు ఉంటాయని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఇతరులతో ఎలా వ్యవహరించాలి? మహిళలు.. సహ విద్యార్థినులతో ఎలా ఉండాలి? కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలనే అంశాలే ప్రధానాంశంగా పాఠ్యాంశాలుంటాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. పాఠ్యాంశాలు, కార్యక్రమాలతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే నేటి చిన్నారులు మంచి పౌరులుగా ఎదిగే అవకాశముంది.●

తల్లిదండ్రులూ ఇలా చేయండి..

* తల్లిదండ్రులు ఎంత తీరిక లేకుండా ఉన్నా రోజూ కొంత సమయం పిల్లలకు కేటాయించాలి.

* ఇంటి వద్ద విద్యార్థుల్లో విలువలు పెంచే విషయాలు, మహిళలు, బాలికలతో గౌరవంగా వ్యవహరించాలని వివరించాలి.

* ఇంట్లో మగ, ఆడ పిల్లల మధ్య భేదం చూపకూడదు. ఇద్దరినీ ఒకేలా చూడాలి.

* నీతి, నిజాయితీల గొప్పదనం, పక్కవారిని గౌరవించాల్సిన అవసరం వివరించాలి.

* పిల్లల స్నేహాలు ఎలా ఉన్నాయో గమనిస్తుండాలి. ఏమాత్రం తేడా కనిపించినా వారు అలాంటి స్నేహాల నుంచి బయటకు వచ్చేలా చూడాలి.

* పిల్లలు అప్రమత్తంగా ఎలా ఉండాలో.. సమాజంలో వ్యక్తులను గమనిస్తూ ఎలా వ్యవహరించాలో వివరించాలి.

ఉపాధ్యాయులు అనుసరించదగినవి..●

* పాఠశాలల్లో అమలు చేసే కార్యక్రమాలు, పాఠ్యాంశాలతోపాటు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా గమనిస్తుండాలి.

* విద్యార్థుల ప్రవర్తన సాధారణానికి భిన్నంగా కనిపిస్తే వెంటనే కౌన్సెలింగ్‌ నిర్వహించి వారిలో మార్పు వచ్చేలా చూడాలి.

* తోటి విద్యార్థులతో వారు వ్యవహరిస్తున్నతీరు, ముఖ్యంగా బాలికల విషయంలో వారి ప్రవర్తన ఎలా ఉందో గమనిస్తూ మొగ్గ దశలోనే సరిచేయాలి.

* పోలీసుశాఖకు సంబంధించిన నంబర్లతోపాటు ఆపద సమయంలో వెంటనే ఎలా స్పందించాలనే విషయాలు వివరించాలి.

* సాధారణ పాఠ్యాంశాల బోధన సమయంలోనూ మధ్య మధ్యలో నైతిక అంశాలకు సంబంధించిన విషయాలు చెబితే విద్యార్థులు గుర్తుంచుకునే అవకాశం ఉంది.

ఆత్మవిశ్వాసం పెంచేలా..

జిల్లాలోని గురుకుల విద్యాలయాలు.. పాఠశాలలు.. కస్తూర్బాలు, డిగ్రీ కళాశాలల్లో చేపట్టిన వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. ఎదిగే క్రమంలో వచ్చే శారీరక, మానసిక మార్పులు, ఆరోగ్య పరిస్థితులు, భద్రత, చట్టాలు, భవిష్యత్తుపై కల్పించిన అవగాహనతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని విద్యార్థినులు పేర్కొన్నారు. ఎవరైనా వేధిస్తే ఫిర్యాదు చేయడంతోపాటు ఆరోగ్య విషయాలపైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

బాలురలోనూ మార్పు తెచ్చేలా..

విద్యార్థినులపై వేధింపులు, ఇతర ఘటనలు చోటు చేసుకోకుండా వాయిస్‌ ఫర్‌ బాయ్స్‌ ద్వారా బాలురకు కూడా అవగాహన కల్పించారు. గురుకుల విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యుక్త వయసులో వచ్చే మార్పులు.. ఆకర్షణ వంటి విషయాలను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలి.. విద్యార్థినులతో గౌరవభావంతో ఎలా ఉండాలి? బాలికల రక్షణ కోసం ఉన్న చట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంతో చాలా మంది బాలురలో మార్పులు గమనించినట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

మనసు విప్పి చెప్పుకొన్నారు..

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అధికారులు బాలిక సాధికారత క్లబ్‌లు ఏర్పాటు చేశారు. నవాబుపేట మండలం ఎన్మన్‌గండ్ల, మరికల్‌, నారాయణపేటతోపాటు కొన్ని పాఠశాలల్లో కార్యక్రమం అమలు చేశారు. తరచూ పోలీసు అధికారులతో అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులతో చిన్నపాటి సమావేశలు నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వారి ఆరోగ్య విషయాలతోపాటు తమను ఎవరైనా ఇబ్బంది పెడితే వారి వివరాలను చెప్పుకొన్నారు. దీంతో ఉపాధ్యాయులు వారి స్థాయిలో పరిష్కరించేవి పరిష్కరించి మిగతావి పోలీసుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూశారు.

నైతిక పాఠం మంచి పరిణామం : నైతిక విలువలు పాఠ్యాంశాలుగా చేయాలనుకోవడం మంచి పరిణామం. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నైతిక అంశాలను గుర్తు చేసినట్లు అవుతుంది. చట్టపరమైన అంశాలను కూడా చేర్చేందుకు నిపుణులు ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాలల్లో తరచుగా విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు ఈ విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పరీక్షల్లో నైతిక అంశాలపై ఇచ్చే ప్రశ్నలకు కచ్చితంగా సమాధానాలు రాసే విధంగా పరీక్ష విధానం మార్చాలి. ఇంట్లో తల్లిదండ్రులు మగ, ఆడ పిల్లలను ఒకేలా చూడాలి.

- ఆచార్య శ్రీనాథాచారి, వ్యక్తిత్వ వికాస నిపుణులు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.