close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

చూస్తూ.. తెలుసుకుంటూ..

జయశంకర్‌ జిల్లాలో ఉత్సాహంగా సాగిన గవర్నర్‌ పర్యటన

ఉత్సాహంగా సాగిన గవర్నర్‌ పర్యటన

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, (కాటారం, భూపాలపల్లి, కాళేశ్వరం, మహదేవ్‌పూర్‌, న్యూస్‌టుడే): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ పర్యటించారు. మొదటగా జిల్లా కేంద్రానికి చేరుకొని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరిక్‌ ఫార్మసీ కేంద్రాన్ని ప్రారంభించారు.

రాజ్‌భవన్‌కు రండి..

భూపాలపల్లి నుంచి గవర్నర్‌ కాటారం మండలం బోడగూడెం గిరిజన గ్రామానికి వెళ్లారు. సర్పంచి నిట్టూరి శేఖర్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎంపీటీసీ సభ్యురాలు జాడి మహేశ్వరి స్వాగతం పలికారు. గిరిజనులు తమ సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానించారు. ‘గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన మూడు మాసాలకు మీ గ్రామానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది..ఆచార వ్యవహారాలు తెలుసుకున్నా..ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలతో పాటు మీరు చూపించిన ఆదరణ, ఆతిథ్యం, స్వాగతం పలికిన తీరు ఎంతో నచ్చింది. మీరు కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించేందుకు రాజ్‌భవన్‌కు రావాలి’ అని గిరిజనులకు రాష్ట్ర ప్రథమ పౌరురాలు ఆహ్వానం పలికారు. అంతకు ముందు ఆమె అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. గర్భిణులు, బాలింతలకు, కిషోర బాలికలకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. పోషకాలతో కూడిన వంటకాలను పరిశీలించారు. సమీపంలో వేప మొక్కను నాటారు. గిరిజనుల ఆరాధ్యదైవమైన లక్ష్మీదేవర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బద్ది పోచయ్య, పోసక్క ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటి ఆవరణలో బిగించిన నల్లాను ప్రారంభించారు. అనంతరం ముఖాముఖి నిర్వహించారు.

గుంట భూమిలేదు.. ఉండేందుకు ఇళ్లు లేవు

‘ఉండేందుకు ఇళ్లు లేవు. సాగు చేసుకునేందుకు గుంట భూమిలేదు..చదువుకుందామంటే ఆర్థిక స్తోమత అంతకన్నా లేదు..ఉన్నత చదువులకు దూరమై దినసరి కూలీలుగా మారిన నిరుద్యోగులు దుర్భర జీవనం సాగించాల్సిన దుస్థితి దాపురించింది. వెంటనే మాకు పక్కా గృహాలతో పాటు జీవనోపాధి కోసం సాగు భూములు అందించాలి’ అని కాటారం మండలం నస్తూరుపల్లి పంచాయతీలోని బోడగూడెం గిరిజనులు గవర్నరు తమిళి సై సౌందర్‌రాజన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గావిడి మల్లక్క, గుర్సింగ రాజు, కాల్నేని వనిత తమ సమస్యలను వివరించారు.

సమస్యల పరిష్కారానికి వినతి

నస్తూరుపల్లి పంచాయతీ పరిధిలోని పలు సమస్యలను వివరిస్తూ సర్పంచి నిట్టూరి శేఖర్‌ గవర్నరుకు వినతి పత్రం అందజేశారు. పంచాయతీ పరిధిలోని జనాభాకు అనుగుణంగా సదుపాయాలు లేవని, వెంటనే గ్రామంలో రెండు కమిటీ హాళ్లు, సిమెంటు రహదారులు, మురుగు కాలువలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయడంతో పాటు బోడగూడెంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు.

ఉట్టిపడిన సంస్కృతీ సంప్రదాయాలు

గవర్నరు పర్యటన సందర్భంగా ఆదివాసీ గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. పోతరాజుల విన్యాసాలు, లక్ష్మీదేవర ఆటాపాట, శివసత్తుల పూనకాలు, యువకుల కేరింతలతో గూడెం సందడిగా మారింది.

కాళేశ్వరం ఆలయంలో పూజలు..

కాళేశ్వర క్షేత్రంలో సౌందర్‌రాజన్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంథని శాసనసభ్యుడు శ్రీధర్‌బాబుతో కలిసి మంగళవారం క్షేత్ర రాజగోపురం వద్దకు చేరుకోగా ఆలయ పాలకమండలి, ఇన్‌ఛార్జి కార్యనిర్వహణాధికారి మారుతి ఆధ్వర్యంలో అర్చక స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కాళేశ్వరునికి ప్రత్యేక జలాభిషేకాలు చేశారు.

నది మాతకు పుష్పాంజలి

మేడిగడ్డలో గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ వాహన శ్రేణి ద్వారా బ్యారేజి రహదారిపై ప్రయాణించారు. బ్యారేజి మధ్య వరకు వెళ్లి నది మాతకు పుష్పాంజలి సమర్పించారు.

ఆసక్తిగా తిలకిస్తూ...

ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం లక్ష్మి పంపుహౌస్‌కు చేరుకున్నారు. అక్కడ విందు ముగించుకొని పంపుహౌస్‌ ప్రాంతం వెళ్లారు. ఇక్కడ మ్యాప్‌లను పరిశీలించారు. పంపుహౌస్‌లోని రెండో అంతస్తులోని కంట్రోలర్‌ గదికి వెళ్లి సాంకేతిక పరికరాలను చూశారు. ఈ సందర్భంగా ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపుల అమరిక, మోటార్ల ఆటోమేషన్‌ పద్ధతిని వివరించారు. పంపుహౌస్‌కు కిలోమీటరు దూరంలో ఉన్న డెలివరీ ఛానెల్‌ వద్దకు వెళ్లి 12 పైపుల ద్వారా గోదావరి జలాలు గ్రావిటీలో ఎత్తిపోస్తున్న దృశ్యాలను చూసి మురిసిపోయారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మొదటి, భారీ నిర్మాణం లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజిని పరిశీలించారు. కాళేశ్వరం నుంచి తిరుగు ప్రయాణంలో బ్యారేజి వద్దకు చేరుకొని వీక్షించారు. ప్రాజెక్టులోని తొలి, భారీ నిర్మాణం మేడిగడ్డ వద్ద ఎలా జరిగిందో ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు గవర్నర్‌కు వివరించారు.

అన్నారం బ్యారేజీ గ్రావీటీ కాలువ ముగింపు ప్రాంత ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వేరీ నైస్‌ అంటూ అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలను చూస్తూ పర్యాటకంగా వెలుగొందుతుందని గవర్నర్‌ పేర్కొన్నారు. బ్యారేజీ వంతెన నుంచి మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌ మీదుగా రామగుండం వెళ్లారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలో సుమారుగా 500 ఎకరాలు భూములు రైతులు కోల్పోయి నిరాశ్రయులుగా ఇబ్బంది పడుతున్నారని, వ్యవసాయ అనుబంధ రంగాల పై తీవ్ర ప్రభావం చూపిందని అంబట్‌పల్లి సర్పంచి ఎరవెల్లి విలాస్‌రావు వినతిపత్రం అందించారు.

భారీ బందోబస్తు

తమిళిసై సౌందర్‌రాజన్‌ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గవర్నర్‌ పర్యటన రహదారి మార్గంలో ఉండడంతో ఈ ప్రాంత పరిసరాలను పోలీసులు ముందస్తుగానే తమ అధీనంలోకి తీసుకున్నారు. బాంబు నిర్వీర్య, డాగ్‌ స్వ్కాడ్‌, ప్రత్యేక బృందాలతో రహదారులు, కల్వర్టులును తనిఖీలు చేయించారు. జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌, ములుగు ఏఎస్పీ సాయి చైతన్యతో పాటు జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు భద్రతను పర్యవేక్షించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.