close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

మేడారం

మగువలకే సహకారం

మహిళా సంఘాలకు మిరప ఉత్పత్తుల మార్కెటింగ్‌ బాధ్యతలు

పైలెట్‌ ప్రాజెక్టుగా జూలూరుపాడు, చంద్రుగొండ మండలాలు

జూలూరుపాడు, న్యూస్‌టుడే

గ్రామీణ మహిళలకు మరో అరుదైన అవకాశం దక్కనుంది. వాణిజ్య పంటల కొనుగోలు బాధ్యతను వారికి అప్పగిస్తున్నారు. కొనుగోలు చేసిన ఉత్పత్తిని ప్రాసెసింగ్‌ చేసే అవకాశాలనూ వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో వాణిజ్య పంటల్లో అతి ప్రధానమైన మిరప కొనుగోలు చేసే అవకాశం మహిళా సంఘాలు చేజిక్కుంచుకుంటున్నాయి. రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టుల్లో ఒక్కటైన భద్రాద్రి జిల్లాలోని జూలూరుపాడు, చంద్రుగొండ మండలాలు ఇందుకు వేదికగా మారనున్నాయి. ఆ మండలాల్లో మిరప పంట ఉత్పత్తుల కొనుగోలుతోపాటు నిల్వ, వినియోగం, మార్కెటింగ్‌ వంటి ప్రక్రియలన్నీ వీరే నిర్వహించనున్నారు. అందుకోసం ప్రభుత్వం సెర్ప్‌ ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తోంది. పంట ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసే పని మహిళా సంఘాలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలతో ఉత్పత్తిదారుల సంఘాలను(ఎఫ్‌.పి.జి) ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన మండలాల్లో ఈ ప్రక్రియ వేగం పుంజుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని జూలూరుపాడు, చంద్రుగొండ మండలాలను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు.

పంట ఉత్పత్తులపై సర్వే.. ఎంపిక చేసిన రెండు మండలాల్లో రెండు నెలల క్రితమే పంటలపై సర్వే నిర్వహించారు. రెండు మండలాల్లోని సీసీలు మండలాల వ్యాప్తంగా ఎంపిక చేసుకున్న పంట తాలూకు వివరాలు సేకరించారు. వీటిల్లో ప్రధానంగా వాణిజ్య పంటల్లో పత్తి తరువాత మిరప అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. దీని వివరాలను సేకరించారు. జూలూరుపాడు మండలంలో 566మంది రైతులు 1024 ఎకరాల్లో మిరప సాగుచేస్తుండగా, చంద్రుగొండ మండలంలో 843 మంది రైతులు 1754 ఎకరాల్లో మిరప వేశారు. ఈ ఏడాది ఆ పంటను మార్కెటింగ్‌ చేయాలని నిర్ణయించారు. అందుకుగాను ముందుగా మిరప సాగు చేస్తున్న రైతుల కుటుంబాలకు చెందిన మహిళలతో సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో సంఘంలో 15 మందికి తక్కువ కాకుండా ఉంటారు. వీరిలో ఇద్దరు చొప్పున నాయకులుంటారు. వీరి పేరున బ్యాంకు ఖాతా తెరవాలి. ఆ తరువాత సంఘం వాటా మూలధనం, సభ్యత్వ రుసుము చెల్లించాలి. అందుకు రూ.600 ఖాతా తెరచిన తరువాత జమ చేయాలి. ఇలా ఇప్పటికే చంద్రుగొండలో 15 సంఘాలు, జూలూరుపాడులో 12 సంఘాలు ఏర్పాటయ్యాయి.

రూ.కోటితో గోదాము నిర్మాణం.. పంట ఉత్పత్తులను నిల్వకు రూ.కోటితో గోదాము ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రతిపాదనలు కూడా అడిగారు. చంద్రుగొండలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది మార్కెట్‌ చేయాలనుకున్న మిరప పంటను గోదాములకు తరలించాల్సి ఉంటుంది. ఉత్పత్తులను మహిళలే కొనుగోలు చేశాక వీటిని ఏమి చేస్తే బాగుంటుందో కూడా వారే నిర్ణయిస్తారు. పంట వేసింది మొదలు చేతికందే వరకే కాకుండా ఉత్పత్తులను విక్రయించుకునే మార్గాలను అన్వేషిస్తారు. అవసరమైతే వీరి చేతుల మీదుగానే పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పనున్నారు.

ఆన్‌లైన్‌లో సమగ్ర సమాచారం.. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు సంబంధించిన సమస్త సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఇప్పటికే సీసీలకు శిక్షణ ఇచ్చారు. ఎంపిక చేసిన గ్రామాల్లో డేటాను తీసుకుని ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ ఈ నెల చివరి నాటికి పూర్తిచేయాలని అధికారులు సూచిస్తున్నారు.

సంఘాల పేరుతో ఖాతాలు తెరవాలి సునందన్‌, ఏపీఎం

మిరప సాగు రైతు కుటుంబాల మహిళలతో సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. వీరితో బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నాం. సర్వే వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఖాతాలు తెరపించే పనులు పూర్తిచేయాల్సి ఉంది. తదుపరి సెర్ప్‌ నుంచి వచ్చే సూచనల ఆధారంగా ముందుకు వెళ్లనున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.