close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

నగర భద్రతకు ప్రత్యేక మండలి

హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌కు శ్రీకారం

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులు కొత్తగా నగర భద్రతకు ప్రత్యేక మండలిని ప్రారంభించనున్నారు. ప్రజలు, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యంతో ‘హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేయనున్నారు. ఐటీ కారిడార్‌లో భద్రతను పర్యవేక్షిస్తున్న సొసైటీ ఆఫ్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ తరహాలోనే సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ విధి విధానాలను రూపొందించారు. ఇది ప్రారంభమై సజావుగా కార్యకలాపాలు కొనసాగించేంత వరకూ సొసైటీ ఆఫ్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధులు భరణి, కృష్ణ సహాయ సహకారాలను అందించనున్నారు. ఈ భద్రత మండలిలో నగరంలోని వాణిజ్య సంస్థలు, కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రులు, పంచతార హోటళ్లు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, ఫార్మాకంపెనీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరిని నాలుగు విభాగాలుగా  ఏర్పాటు చేసి ఒక్కో దానిలో ఆయా ప్రతినిధులు, పోలీసులతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

నేరాలపై అవగాహన
హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి కేంద్రీకరించనుంది. శాంతిభద్రతలు, సైబర్‌ నేరాలపై అవగాహన, ఆపద సమయాల్లో చిన్నారులు, మహిళలకు అండదండగా ఉండడం, రహదారులపై ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా ప్రయాణం కొనసాగించడం. ఈ నాలుగు అంశాలు నగరంలోని అన్ని పోలీస్‌ ఠాణాల్లో ఏకకాలంలో అమలయ్యేలా సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రణాళికలను రూపొందిస్తుంది. వీటిని పోలీసులు అమలు చేయనున్నారు. భద్రతపై మురికివాడలు, జనసమ్మర్థం లేని ప్రాంతాలు, శివారు కాలనీలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, మహిళల వసతి గృహాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను పోలీసులు పరిశీలించనున్నారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారితో మాట్లాడి భద్రత మండలి సభ్యుల సహకారంతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు, ప్రార్థన మందిరాలు, ఆలయాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలోనూ సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వాణిజ్య, జాతీయ బ్యాంకుల్లో వారం లేదా పదిహేను రోజులకోసారి ఖాతాదారులు, వినియోగదారులకు ఓటీపీ మోసాలు, పిన్‌ నంబర్ల మోసాలను వివరించనున్నారు.

చిన్నారులు..మహిళలకు అండదండలు..
ఈ మండలిలోని చిన్నారులు, మహిళల భద్రత విభాగం కీలకంగా వ్యవహరించనుంది. ఇది వివిధ స్థాయిల్లో నెలకు కనీసం 15 కార్యక్రమాలను నిర్వహించనుంది. ఠాణాల వారీగా ఉన్న విద్యాసంస్థలు, కమ్యూనిటీ కేంద్రాలు, మహిళలు ఎక్కువగా ఉంటున్న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు భద్రత మండలి సభ్యులు వెళ్లి చిన్నారులు, మహిళలకు పోలీసులు సహకరించే తీరును వివరించనున్నారు. ‘షి’ బృందాలకు ఎలా ఫిర్యాదు చేయాలి? హాక్‌ ఐ మొబైల్‌ యాప్‌ను ఎలా డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి? డయల్‌ 100కు ఫోన్‌ చేసినప్పుడు ఎలాంటి వివరాలు తెలపాలి? అన్న అంశాలను వారికి అర్థమయ్యేలా చెప్పనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులను ఎవరైనా లైంగికంగా వేధిస్తే ఆ సమాచారం భద్రత మండలి సభ్యులకు వెంటనే చేరేవిధంగా అన్ని స్థాయిల్లోనూ ఏర్పాట్లు చేయనున్నారు. హైదరాబాద్‌ రహదారులపై ట్రాఫిక్‌ చిక్కులను పరిష్కరించేందుకు ఆచరణాత్మక చర్యలను కమిటీ సభ్యులు అన్వేషించనున్నారు. ఆయా ప్రాంతాల్లో రాకపోకలు కొనసాగిస్తున్న వాహనచోదకులు, ట్రాఫిక్‌ రద్దీ ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి వెంటనే ఆయా చర్యలు చేపట్టనున్నారు. నగర భద్రత మండలి కార్యకలాపాలు కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయని పోలీస్‌ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.