close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

మేడారం

ఆలస్యమే అపకారం

ట్రైబ్యునల్స్‌కు సకాలంలో అందని సమాచారం

కోర్టుల్లో కేసుల పెండింగ్‌తో పరిహారం చెల్లింపులో ఆలస్యం

నష్టపోతున్న రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలు

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే

రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి కోర్టులు- పోలీసులకు మధ్య సమన్వయ లోపం బాధితులకు శాపంగా మారుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత ‘పోలీసు రిపోర్టు’ త్వరగా ఇవ్వకపోవడంతో పరిహారం చెల్లింపు ఆలస్యమవుతోంది. గాయపడిన వారు లేదా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు పరిహారం కోసం కోర్టును ఆశ్రయిస్తే వాటి చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కోర్టుల్లో వందలాది కేసులు పెండింగ్‌లో ఉండటం దీనికి ఓ కారణమైతే.. సంబంధిత పోలీసుల నుంచి ట్రిబ్యునల్‌కు అందాల్సిన రిపోర్టు సకాలంలో అందకపోవడం మరో కారణం.

సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి లేదా గాయపడి ఆర్థికంగా నష్టపోయిన బాధితులు పరిహారం కోరుతూ మోటార్‌ యాక్సిడెంట్స్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయిస్తుంటారు. పోలీసులు ఇచ్చిన ప్రాథమిక సమాచారంతో కేసు విచారణకు వచ్చినా పూర్తి వివరాలు, ఆధారాలు లేకపోవడంతో అవి కోర్టుల్లో పెండింగ్‌లో పడిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రమాదం జరిగిన నెల రోజుల్లోగా ట్రిబ్యునల్స్‌కు కేసు వివరాలతో కూడిన రిపోర్టును స్థానిక పోలీసులు అందచేయాలి. ఉభయ జిల్లాల్లో పని ఒత్తిడి, ఇతర కారణాలతో నెలలు గడుస్తున్నా సకాలంలో రిపోర్టును అందచేయలేక పోతున్నారు. దీంతో బాధితులకు త్వరగా న్యాయం జరగటం లేదు.

ప్రమాద తీవ్రత ఆధారంగా..

ఘటనా స్థలం నుంచి వచ్చిన సమాచారం, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తారు. సదరు ఫిర్యాదును ఆధారంగా చేసుకుని బాధితులు పరిహారం కోరుతూ మోటార్‌ యాక్సిడెంట్స్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తారు. ప్రమాద తీవ్రత, నష్టం, వయస్సు, సంపాదన, బాధితుడిపై ఆధారపడిన కుటుంబ సభ్యులను పరిగణనలోకి తీసుకుని పరిహారాన్ని నిర్ణయించి, నిర్ణీత గడువులోగా ఆ డబ్బులను చెల్లించాలని ట్రిబ్యునల్‌ ఆదేశాలు ఇస్తుంది.

నానాటికీ తీవ్రమవుతున్న కేసులు

గత పది నెలల కాలంలో రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 4వేల మందికిపైగా చనిపోగా, 11వేల మందికిపైగా గాయపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ అధిక సంఖ్యలో వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పరిహారం దాఖలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అవసరమైన పత్రాలు సమర్పించకపోవడంతో ఇంకా దాఖలు చేయాల్సిన కేసులు సైతం ఉన్నాయి. బాధితులు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌

ట్రిబ్యునళ్లు- పోలీసుల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరిగేందుకు క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ రూపొందించడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం త్వరగా అందే అవకాశం ఉంటుంది.


‘‘ఖమ్మం గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2018, నవంబరు 2న రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీ వెనక కూర్చున్న నా స్నేహితురాలు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయింది. బండి నడుపుతున్న నాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నాను. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి వదిలేశారు. అవసరమైన పత్రాలు కోర్టులో సమర్పించలేదు. ఏడాదిపాటు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగాను. 15 రోజుల క్రితం కనికరించారు.’’

- మాధవి, రోడ్డు ప్రమాద బాధితురాలు, నేలకొండపల్లి


ఎంవీఐ రిపోర్టే కీలకం - గొల్లపూడి రామారావు, సీనియర్‌ న్యాయవాది, ఖమ్మం

వాహన ప్రమాద కేసుల్లో ఎంవీఐ ఇచ్చే రిపోర్టు కీలకం కానుంది. క్రైమ్‌ వెహికిల్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ప్రమాదానికి కారణాలను రిపోర్టులో రాస్తారు. ఈ రిపోర్టును పోలీసులు కోర్టులో దాఖలు చేస్తారు. అయితే.. మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ల పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల ఎంవీఐ రిపోర్టు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో కోర్టులో కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయి.

30 రోజుల్లోనే పంపిస్తున్నాం.. - కేఆర్‌కే ప్రసాద్‌రావు, డీఎస్పీ పాల్వంచ


ప్రమాదం జరిగిన సమయాల్లో బాధితులకు అందాల్సిన క్లెయిమ్‌లకు సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫారమ్‌-54ను 30 రోజుల్లోనే సంబంధిత ట్రిబ్యునల్‌కు పంపిస్తున్నాము. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగడం లేదు. ట్రిబ్యునల్‌, బీమా కంపెనీల మధ్య ఏవైనా సమాచార సేకరణలో ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.