close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

ముదిమిలో తోడుగా.. మేమున్నామని!

శారీరక, మానసిక సమస్యలతో వృద్ధుల ఇబ్బందులు
కుటుంబ సభ్యుల నిర్లక్ష్యంతో పస్తుల జీవనం
పండుటాకులకు ‘ది ఎల్డర్‌ స్ప్రింగ్‌’ చేయూత
ఈనాడు, హైదరాబాద్‌

‘‘ముగ్గురు కూతుళ్లు.. ఇద్దరు కుమారులు. ఇంత పెద్ద కుటుంబాన్ని చక్కదిద్దేందుకు పగలూ రేయి తేడాలేకుండా కష్టపడ్డాను. బాధ్యతలు తీర్చుకునేందుకు ఆస్తిపాస్తులు పంచేశాను. అదే నేను చేసిన పొరపాటు.. అని ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా వారిదగ్గర చేతులు చాపాల్సి వస్తోంది. కొన్నిసార్లు చీదరించుకుంటున్నారు. మరికొన్ని సమయాల్లో మా ఇంటివైపు రావద్దంటూ మనుమలు, మనుమరాళ్లతో ముఖానే చెప్పిస్తున్నారు.. ఈ వయసులో మాకు సాయం చేసేదెవరు..’’

-ఏడుపదులు దాటిన దంపతుల నైరాశ్యం

 

 

‘‘ముప్పై ఐదేళ్లు వివిధ హోదాల్లో పనిచేశాను. ఆరోగ్యం చక్కగా ఉన్నంత వరకూ కుటుంబసభ్యులు గౌరవంగానే మెలిగారు. వయసు మీదపడే కొద్దీ తగ్గుతున్న శక్తితోపాటు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సాయం చేసేందుకు పిల్లలకు సమయం ఉండదు. వీలున్నా చేతిలో సెల్‌ఫోన్లతో కాలక్షేపం. పది నిమిషాలు మాట్లాడేందుకు సమయం కేటాయించరు. నెలకోసారి వైద్యపరీక్షలకు ఆసుపత్రికి వెళ్లడం కూడా కష్టంగా ఉంది. అందుకే వృద్ధాశ్రమంలో చేర్చమని పిల్లల్ని ప్రాధేయపడుతున్నా. అలా చేస్తే తమ పరువు పోతుందంటున్నారు. మా కష్టం ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు..’’ అరవైఐదేళ్ల ఓ పెద్దాయన మనో వేదనకు నిలువెత్తు సాక్ష్యం

ఎంతో జీవితాన్ని చవిచూసిన ఆ కళ్లలో దైన్యం ఎవరికీ కనిపించదు.. మనసులో వేదన అయినవారికీ వినిపించదు. ఒంట్లో శక్తి ఉన్నంతకాలం ప్రేమగా దగ్గరకు వచ్చిన బంధుగణం.. ఇప్పుడు వారు కనిపిస్తే చాలు ముఖం చాటేస్తుంటారు. వీరంతా.. అలసిన వేళ కాస్త ఓదార్పు కోరుకుంటున్నారు. ఇదీ హైదరాబాద్‌ మహా నగరంలో అధిక శాతం వృద్ధుల పరిస్థితి. రెక్కలొచ్చి బిడ్డలు ఎగిరిపోయిన కుటుంబాల్లో తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకే ప్రాధాన్యమిస్తున్నారు. కూతుళ్లు, కుమారులు పక్కనే ఉన్నా అనాథలుగా బతుకెళ్లదీస్తున్న వృద్ధ జంటలు వేలల్లో ఉన్నారు. మలి సంధ్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇలాంటి ఎందరో పండుటాకులకు ‘ఎల్డర్‌ స్ప్రింగ్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌’ అండగా నిలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, విజయవాహిని ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో టాటా ట్రస్ట్‌ ఈ సంస్థను ఏర్పాటుచేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిస్సహాయస్థితిలో ఉన్న వృద్ధులకు ఇది చేయూతనిస్తోంది.

ఎలా పనిచేస్తుందంటే..?
ఎల్డర్‌ స్ప్రింగ్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ టోల్‌ఫ్రీ నెంబరు 14567. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తుంది. గ్రేటర్‌ పరిధిలోని వృద్ధులకు అవసరమైన తోడ్పాటును అందిస్తుంది. బాధితులు టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలను నిరభ్యంతరంగా వివరించవచ్చు. తగిన రీతిలో ఎల్డర్‌ స్ప్రింగ్‌ నిర్వాహకులు స్పందిస్తారు. ఆవేదనతో ఫోన్‌చేసిన వృద్ధులకు కొండంత ధైర్యాన్నిస్తారు. పోలీసు, న్యాయ, వైద్య, పునరావాసం తదితర అంశాలకు సంబంధించిన అంశాల్లో సాయపడతారు. మనో వేదనతో బాధపడేవారికి తమ మాటలతో సాంత్వన కలిగించేందుకు ప్రయత్నిస్తారు.

నిస్సహాయులకు చేయూత
టోల్‌ఫ్రీ నెంబరుకు ప్రతి రోజూ 50-70 ఫోన్‌కాల్స్‌ వస్తుంటాయని అంచనా. తమ మనసులో బాధ పంచుకునేందుకు కుటుంబ సభ్యులు కొంత సమయం కేటాయిస్తే చాలని అడుగుతుండేవారే ఎక్కువ మంది ఉండటం విశేషం. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న బాధితుల్లో వైద్యం, పునరావాసం కోరుతుంటారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులను గ్రేటర్‌ పరిధిలోని వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం కల్పిస్తారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే ప్రత్యేక వాహనంలో ఆసుపత్రులకు చేరవేస్తారు. పూర్తిగా కోలుకునేంత వరకు అవసరమైన సహాయం అందిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 100 మందికి పైగా వృద్ధులను ఆశ్రమాల్లో పునరావాసం కల్పించారు. తప్పిపోయిన ఎందరినో గూటికి చేర్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వృద్ధులు ఎవరైనా ఈ ఉచిత నెంబరు 14567 కు ఫోన్‌ చేయవచ్చని నిర్వాహకులు సూచించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.