close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

అయినవారిని కోల్పోయినా.. అందరి వారయ్యారు!

అంతులేని విషాదంలోనూ అవయవ దానం
పలువురికి కొత్త జీవితాలు
న్యూస్‌టుడే, రవీంద్రభారతి

కళ్లముందే అయినవారిని కోల్పోతున్నామన్న దుఃఖం గుండెల్ని బద్దలు చేస్తున్నా.. మరికొందరి జీవితాల్లో వెలుగు ప్రసాదించేందుకు ముందుకు రావడం అంత సులువు కాదు. కానీ, వారు ముందుకొచ్చారు. ఎందరో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇతరులకు కొత్త జీవితాన్ని బహుమతిగా ఇచ్చేందుకు తమ సంబంధీకుల అవయవాల దానానికి అంగీకరించారు. ఆదర్శంగా నిలిచారు. అలాంటి వారికి రవీంద్రభారతిలో మంగళవారం ‘జీవన్‌దాన్‌’ ఆధ్వర్యంలో పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు దాతలు, సహాయం పొందినవారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


దాతలూ.. ముందుకు రండి

నాపేరు సుప్రియ. మాది సనత్‌నగర్‌. మూడేళ్ల బాబు ఉన్నాడు. కుటుంబానికి పెద్దదిక్కు నేనే. పెళ్లైన కొన్ని రోజులకే మూత్రపిండాల సమస్య ఉందని తెలిసింది. జీవన్‌దాన్‌ ద్వారా ఇటీవల  కిడ్నీ మార్పిడి చేశారు. నాలాంటి వారెందరో అవయవదాతల కోసం ఎదురు చూస్తుంటారు. కుటుంబానికి ఆసరాగా ఉన్నవారిని కోల్పోతే ఆ బాధ అనుభవించినవారికే తెలుస్తుంది. దాతలు ముందుకు వచ్చి అలాంటివారిని ఆదుకోవాలి.


పెళ్లైన వారం రోజులకే...

నా పేరు భవాని. మేము నలుగురం అక్కాచెల్లెళ్లం. మా చెల్లి పావని పీజీ చేసింది. ఆమెకు జూన్‌ 12న వివాహమైంది. వారం రోజుల తరువాత పిల్లలతో ఆడుకుంటూ.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆసుపత్రికి తీసుకెళితే బ్రెయిన్‌డెడ్‌ అన్నారు. మాలో శక్తి ఉన్నంత వరకు వైద్యుల ద్వారా ప్రయత్నం చేశాం. లాభం లేకపోయింది. జీవన్‌దాన్‌ వారు మమ్మల్ని సంప్రదించి అవయవదానంపై అవగాహన కల్పించారు. అలా చెల్లి పావని చనిపోతూ అయిదుగురు జీవితాల్లో వెలుగులు నింపింది.


నలుగురికి ప్రాణదానం

నా పేరు కిరణ్‌. మా నాన్న అనారోగ్యంతో చనిపోయారు. ఆయన బతికున్నంత వరకు ‘నలుగురితో మంచిగా ఉండాలి.. నలుగురితో కలిసి ఉండాలి’ అని మాకు పదే పదే చెప్పేవారు. మా నాన్న భౌతికంగా మాకు దూరమైనా.. మరో నలుగురికి ప్రాణదానం చేశారు. ఆయన కల నెరవేరినట్లయింది. అది మాకెంతో గర్వంగా ఉంది. కచ్చితంగా ప్రతి ఒక్కరూ అవయవదానం చేయాలి. ప్రాణాలతో పోరాడుతున్నవారికి ఆయువు పోయాలి.


ఆమె ఇంకా బతికే ఉంది

నా పేరు రాజారెడ్డి. మాది కరీంనగర్‌. పదో తరగతి వరకు చదువుకున్నాను. పెళ్లైన తరువాత నా భార్య, నేను ఎన్నో కలలు కన్నాం. దురదృష్టం వెంటాడింది. ద్విచక్ర వాహనంపై వస్తుండగా జరిగిన ప్రమాదంలో నా భార్య బ్రెయిన్‌డెడ్‌ అయ్యింది. జీవన్‌దాన్‌ వారు మమ్మల్ని సంప్రదించారు. అవయవదానం గురించి చెప్పారు. మరో ఆలోచన లేకుండా సరే అన్నాను. ఎప్పుడైతే ఆమె అవయవాలు మరొకరి శరీరంలో ఇమిడిపోయాయో.. అప్పుడే నా భార్య చిరంజీవి అయ్యింది. ఆమె ఇంకా బతికే ఉందనే భావనతోనే బతుకుతున్నా.


అమెరికా పంపించారు

నా పేరు శ్రీదివ్య. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. నాన్న అనారోగ్యం బారిన పడిన తరువాత మా ఇంట్లో కుటుంబపరంగా సమస్యలు ఉండేవి. ఆయన పరిస్థితి చూస్తే మా అందరికీ ఏడుపొచ్చేది. నీళ్లు తాగడానికి కూడా భయపడేవారు. జీవన్‌దాన్‌ ద్వారా మూత్రపిండ మార్పిడి జరిగింది. ఇప్పుడు తన కాళ్ల మీద తాను నిలబడటమే కాదు.. నన్ను బాగా చదివించి అమెరికా కూడా పంపించారు.


మా కుటుంబంలో ఆనందం విరిసింది

నా పేరు రవూఫ్‌. ముగ్గురు పిల్లలు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సమయంలో మా కుటుంబమంతా బాధల్లో ఉండేది. వారం రోజుల్లో రెండు మూడు సార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సి వచ్చేది. ఉస్మానియాకు వెళ్లినప్పుడు జీవన్‌దాన్‌ గురించి తెలిసింది. అదృష్టం కొద్ది సకాలంలో కిడ్నీ ఇవ్వడానికి దాత ముందుకు వచ్చారు. ఉస్మానియా వైద్యులు నయాపైసా తీసుకోకుండా శస్త్రచికిత్స చేసి ప్రాణదానం చేశారు. ఇప్పుడు నాకు ఆరోగ్యమే కాదు.. మా కుటుంబంలో ఆనందమూ విరిసింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.