close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

గోదారి గట్టులో బాసరకు మెట్టు

శ్రీరాంసాగర్‌లో బోటింగ్‌

సరస్వతీమాత చెంతకు జలమార్గం

పూర్తయిన ట్రయల్‌రన్‌

న్యూస్‌టుడే, కమ్మర్‌పల్లి

బాసరకు జలమార్గం సిద్ధమవుతోంది.. అమ్మవారి చెంతకు గోదావరిలో పయనించొచ్ఛు.. సరస్వతీ మాత దర్శనానికి రెండున్నర గంటల్లో వెళ్లొచ్ఛు.. ఇందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ట్రయల్‌రన్‌ పూర్తయ్యింది. జలవిహారం మరికొన్ని రోజుల్లో కార్యరూపం దాల్చనుంది.

శ్రీరాంసాగర్‌(ఎస్సారెస్పీ)జలాశయం నుంచి బాసరకు బోటు నడపాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. తాజాగా ముందడుగు పడింది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి సీఎం కేసీఆర్‌ 2017 ఆగస్టు 10న శంకుస్థాపన చేశారు. ఈ సమయంలో బస్సాపూర్‌- నాగాపూర్‌ గ్రామాల శివారులోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాలొస్తే బాసరకు బోటు నడిపించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ సీజన్‌లో శ్రీరాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు రావడంతోపాటు ఎగువ నుంచి వచ్చిన వరదతో కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో బాసరకు జలవిహారం తెరపైకి వచ్చింది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యాటక శాఖ అధికారులతో సమీక్షించారు.

ట్రయల్‌ రన్‌ పూర్తి

ఎస్సారెస్పీ నుంచి బాసరకు బోటు ప్రయాణంపై అధికారులు ఈ నెల 6న ప్రయోగాత్మకంగా పరిశీలించారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్‌-నాగాపూర్‌ శివారు నుంచి బాసరకు బోటు బయలుదేరింది. ట్రయల్‌రన్‌ విజయవంతం కావడంతో ప్రభుత్వ ఆమోదం కోసం నివేదించారు. ఆమోదం రాగానే జలయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

66 ఎకరాల్లో అభివృద్ధి పనులు

బస్సాపూర్‌-నాగాపూర్‌ శివారులో ఎస్సారెస్పీ జలాశయానికి ఆనుకొని 66 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఈ ప్రాంతంలో పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించొచ్చని పర్యాటకశాఖ అధికారులు గుర్తించారు. మూడు దశల్లో సర్వే నిర్వహించారు. పోచంపాడ్‌ నుంచి బాసరకు రోడ్డు మార్గంలో 80 కి.మీ దూరం కాగా.. బోటులో వెళ్తే 20 కి.మీ దూరం తగ్గనుంది.

వీరికి అనుకూలం

బోటింగ్‌ ప్రయాణం అందుబాటులోకి వస్తే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లావాసులు మాత దర్శనాన్ని జలవిహారంతో ఆస్వాదించే ఆస్కారం ఉంది. బాల్కొండ వరకు చేరుకోవడానికి నిర్మల్‌ వైపు వెళ్లే బస్సులు నిజామాబాద్‌ డిపో నుంచి అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి బోటింగ్‌ పాయింట్‌కు ఆటోల ద్వారా చేరుకోవచ్ఛు అంతేకాక భక్తులతో పాటు పర్యాటకుల సంఖ్య పెరిగి, ప్రభుత్వానికి పర్యాటకంగా ఆదాయం సైతం వచ్చే ఆస్కారం ఉంది.

ప్రభుత్వ ప్లీడర్‌గా సీనియర్‌ న్యాయవాది ఈగ గంగారెడ్డి

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్లీడర్‌గా సీనియర్‌ న్యాయవాది ఈగ గంగారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ న్యాయవ్యవహారాల కార్యదర్శి సంతోష్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. మంగళవారం గంగారెడ్డి నియామక పత్రాలను అందుకున్నారు. ఈయనిది సిరికొండ మండలం పోతునూరు గ్రామం. బీడి కార్మిక సంఘాలకు న్యాయ సలహాదారుగా, 2003లో నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.

జలాశయం గుట్టపైకి రోప్‌

స్సాపూర్‌ ఒడ్డు నుంచి 800 మీటర్ల దూరంలో జలాశయంలో ఎత్తయిన కొండ ఉంది. అక్కడ ఆలయం ఉండటంతో రోప్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. గుట్టపైన స్థలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.

మార్గ మధ్యలో నందిపేట్‌ మండలం వద్ద కుస్తాపూర్‌లోని రామలింగేశ్వరాలయం, ఉమ్మెడలోని ఉమామహేశ్వరాలయం, నవీపేట మండలం తుంగిని వద్ద హనుమాన్‌ ఆలయాన్ని దర్శించుకోవచ్ఛు

శ్రీరాంసాగర్‌ జలాశయం నీటిమట్టం 1060 అడుగులుంటే బోటు వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. కాళేశ్వరం జలాల రాక వల్ల ఏడాది పొడవునా నిండుకుండను తలపించనుంది బాల్కొండ మండలం బస్సాపూర్‌లో బోటింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.