close

శుక్రవారం, జనవరి 18, 2019

ప్రధానాంశాలు

పోలీసు ఎన్నికల్లో ఊహించని ఫలితాలు

ప్రధాన అభ్యర్థులు ఓటమిపాలు
అనూహ్యంగా విజయం సాధించిన నాయకులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : పోలీసు శాఖలో అధికారుల సంఘాలకు నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడం అందరినీ నివ్వెరపరిచింది. గురువారం జిల్లాలోని పోలీసుస్టేషన్‌లలో కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుళ్లకు ఎన్నికలు నిర్వహించారు. సీఐలు, ఎస్సైలు పర్యవేక్షణాధికారులుగా వ్యవహరించి సిబ్బందికి బ్యాలెట్‌ పేపర్లు అందించారు. ఉదయం నుంచి రాత్రి వరకు సిబ్బంది బ్యాలెట్‌ పెట్టెల్లో రహస్య ఓటింగ్‌ వేశారు. గురువారం రాత్రికి పర్యవేక్షణాధికారులు ఆయా ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు.

హోరాహోరీగా..
గుంటూరు అర్బన్‌ పరిధిలో 16, రూరల్‌ పరిధిలో 60 పోలీసుస్టేషన్‌లలో ఎన్నికల పర్వం హోరాహోరీగా కొనసాగింది. సభ్యులుగా నామినేషన్‌ వేసినప్పటి నుంచి అభ్యర్థుల మధ]్య తీవ్ర పోటీ నెలకొంది. బుజ్జగింపులు, తాయిలాల ఆశలు చూపి కొందమంది చేత బుధవారం రాత్రి తమ నామినేషన్‌లను ఉపసంహరించుకునేలా చేశారు. మిగిలిన అభ్యర్థులకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. మొదటి నుంచి అధ్యక్షుల పోటీలో ఉన్న అభ్యర్థులు కనీసం సభ్యుడిగా కూడా ఎన్నికకాలేక ఓటమి పాలుకావడం చర్చనీయాంశమైంది. జిల్లా స్థాయి సంఘానికి అధ్యక్షుడిగా ఎంపిక కావడానికి ముందు సభ్యుడుగా గెలవాల్సి ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికి అధ్యక్ష పోటీలో ఉన్నవారిలో కొందరు సభ్యుడిగా ఎంపిక కాలేకపోవడం ఆ వర్గంలోని వారిని నివ్వెరపోయేలా చేసింది. ఊహించని అభ్యర్థులు సభ్యులుగా నామినేషన్‌ వేయడం ఎన్నికల్లో గెలుపొందడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పోటీలో నిలబడినవారిని ఆర్మిడ్‌ రిజర్వు, సివిల్‌ పోలీసు అనే బేధం చూపిస్తూ సభ్యులు ప్రచారం చేసి తమ వర్గంవాళ్లు గెలుపొందడంలో సఫలీకృతులయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అధ్యక్ష పోటీలో ఉన్న శైలేంద్ర సభ్యుడిగా విజయం
అర్బన్‌లోని పోలీసు సిబ్బంది అధికంగా కానిస్టేబుల్‌ నుంచి హెడ్‌ కానిస్టేబుళ్ల శిక్షణ నిమిత్తం ప్రకాశం జిల్లాలోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఉన్నారు. వారిలో అర్బన్‌ అధ్యక్ష పోటీలో ఉన్న సీసీఎస్‌ కానిస్టేబుల్‌ శైౖలేంద్ర కూడా ఉన్నారు. ఆయన సభ్యుడిగా గెలుపొందారు.

పావులు కదిపారు
శైలేంద్ర శిక్షణ కేంద్రం నుంచి తమదైన శైలిలో పావులు కదిపారు. సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకొని 2009, 2013, 2014 బ్యాచ్‌ పోలీసులను ఆకట్టుకున్నారు. గతంలో వారికి చేసిన సేవలను గుర్తుచేసి వారిలో అభిమానం సంపాదించారు. ఆవిధంగా శిక్షణలో ఉన్న తాను గెలుపొందడమేకాకుండా అతని వర్గంవాళ్లు సభ్యులుగా గెలుపొందడానికి అన్నిరకాలుగా మంత్రాంగం నడిపించాడు. శిక్షణ కేంద్రంలో ఉన్నవాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌ ఓటింగ్‌ విధానంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నేడు...
శుక్రవారం ఏఎస్సైలు, ఎస్సైలకు సభ్యులుగా ఎంపికవ్వటానికి ఓటింగ్‌ జరగనుంది. ఇప్పటికే పలు పోలీసుస్టేషన్‌లలో ఏకగ్రీవంగా కొందరిని ఎంపిక చేసుకోటానికి సిద్ధ్దమయ్యారు. మరికొన్ని పోలీసుస్టేషన్‌లలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.