close

శుక్రవారం, జనవరి 18, 2019

ప్రధానాంశాలు

ప్యాకేజీల పేరిట పెట్టుబడుల వల

ముందు ఉచిత సలహాలతో ఎర.. తర్వాత మోసాల పరంపర
ఇండోర్‌ బోగస్‌ సంస్థల కేసులో సైబర్‌క్రైమ్‌ దర్యాప్తు వేగవంతం
వారం రోజులపాటు నిందితుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి
ఈనాడు, హైదరాబాద్‌

షేర్‌మార్కెట్‌లో లాభదాయక పెట్టుబడుల కోసం విలువైన సూచనలు ఇస్తామంటూ మదుపరుల్ని బుట్టలో వేసుకొని మోసాలకు పాల్పడిన అక్రమ సలహా సంస్థల కేసు దర్యాప్తులో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ నుంచి నలుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేసి బ్యాంకు ఖాతాల్లోని రూ.3.63 కోట్లను స్తంభింపజేసిన పోలీసులు.. తదుపరి దర్యాప్తుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా న్యాయస్థానం అనుమతితో నిందితుల్ని గురువారం తమ కస్టడీకి తీసుకున్నారు. వారం రోజులపాటు వారిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈక్రమంలో నిందితుల్ని ఇండోర్‌కు తీసుకెళ్లి కేసుల మూలాలపై శోధించేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. మరోవైపు బాధితుల్ని బోగస్‌ సంస్థలు ఎలా బుట్టలో వేసుకున్నాయనే అంశాలపై పోలీసులు లోతైన పరిశీలన చేస్తుండటంతో విస్మయకర కోణాలు వెలుగుచూస్తున్నాయి. రెండుమూడేళ్లుగా హైదరాబాద్‌లోని పలువురిని ఇలాగే ముంచేసినట్లు బాధితుల తాజా ఫిర్యాదులతో వెల్లడవుతోంది.

ఫోన్లు చేసి.. ఉచితం పేరుతో వలేసి..
మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ కేంద్రంగా పెట్టుబడుల సలహా సంస్థలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. సెబీ అనుమతి పొందిన సంస్థలు 161 ఉండగా.. మరో 450 వరకు సంస్థలు అనధికారికంగానే మనుగడలో ఉన్నాయి ప్రతీ సంస్థకు ప్రత్యేకంగా ఉన్న కాల్‌సెంటర్ల ద్వారా మదుపరులకు ఫోన్లు చేసి ఉచ్చులోకి లాగడమే వీటి పని. షేర్‌మార్కెట్‌ లావాదేవీలకు సంబంధించి డీమ్యాట్‌ ఖాతాలున్న మదుపరుల వివరాలను సేకరించి వలేస్తున్నారు. అలాంటి ఖాతాలు లేని వారినీ ఫోన్లు చేసి ముగ్గులోకి దించుతున్నారు. తొలుత భారీ లాభాలొచ్చే సంస్థల గురించి ఉచిత సలహాలిస్తాంటూ ఎర వేస్తున్నారు. అలా ఒకట్రెండు దఫాలుగా లాభసాటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టించి నమ్మకాన్ని చూరగొంటున్నారు. అనంతరం అసలు కథకు తెర లేపుతున్నారు. మీ తరఫున మేమే పెట్టుబడులు పెట్టి కేవలం రోజుల వ్యవధిలోనే పెట్టుబడి రెట్టింపయ్యేలా చూస్తామని ఆశపెడుతున్నారు. అలా ఒక్కసారి వారి చేతికి చిక్కిన తర్వాత ప్యాకేజీల పేరు చెప్పి వసూళ్ల పరంపరతో ముంచెత్తుతున్నారు.

డివైన్‌.. డిజైర్‌.. రేడియంట్‌.. బౌన్స్‌
మొదట బాధితుడి వద్ద ఎంత డబ్బు ఉందో వాకబు చేసి అంత మొత్తాన్ని లాగేస్తున్నారు. తర్వాత పలు ప్యాకేజీల్లో పెట్టుబడి పెడితేనే లాభం చేకూరుతుందని మభ్యపెడుతున్నారు. ఇందులో భాగంగా డివైన్‌ ఎంసీఎక్స్‌ ప్యాకేజీ.. డిజైర్‌ ఆప్షన్స్‌ ప్యాకేజీ.. రేడియంట్‌ ఆప్షన్స్‌ ప్యాకేజీ.. బౌన్స్‌ క్యాష్‌ ప్యాకేజీల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. అలా కాజేసిన సొమ్ముకు దర్జాగా రశీదులు పంపుతున్నారు. ఫలానా షేర్లలో పెట్టుబడులు పెట్టినట్లు బాండ్లు మాత్రం జారీ చేయడం లేదు. మంచి సంస్థల్లో పెట్టుబడి పెట్టేందుకు టెక్నికల్‌ ప్రాజెక్టు రిపోర్టులు అవసరమవుతాయని నమ్మించి.. వాటి కోసం పదులసార్లు రూ.4వేల చొప్పున వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన బాధితుల్నీ ఇలాగే పిండేశారు. సైబర్‌క్రైమ్‌ నేరగాళ్ల మాదిరిగానే బాధితులకు ఆశ చూపి వీలైనంత మేర దోచుకొని మొహం చాటేస్తున్నారు.

ఒత్తిడి చేస్తే బెదిరింపులు..
రోజులు గడుస్తున్నా లాభాల మాట దేవుడెరుగు.. అసలు షేర్లు ఎక్కడ పెట్టారో తెలియక సతమతమవుతున్న బాధితులు తేరుకునే సరికే పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది. నిందితులకు చెల్లింపులు ఆపేసి తమ పెట్టుబడి సొమ్ము తిరిగివ్వాలని అడిగితే రివర్స్‌ టార్చర్‌ మొదలుపెడుతున్నారు. తొలుత ఇంకొంత పెట్టుబడి పెడితే తప్ప లాభాల రాబడి రాదని బుకాయిస్తున్నారు. అప్పటికే నమ్మకం కోల్పోతున్న బాధితులు.. డబ్బు ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆయా బోగస్‌ సంస్థలకు చెందిన మహిళా ప్రతినిధులు రంగంలోకి దిగుతున్నారు. తమను వేధించారని కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు హైబ్రో సంస్థలో తాను పెట్టుబడులు పెట్టి మోసపోయిన తీరు గురించి యూట్యూబ్‌లో వీడియో పోస్ట్‌ చేశారు. వెంటనే యూట్యూబ్‌లో ఆ పోస్ట్‌ తీసేయకుంటే కేసు పెడతామని హెచ్చరికలు మొదలయ్యాయి.

24 దఫాలుగా రూ.16.2 లక్షలు హాంఫట్‌
కూకట్‌పల్లి నవోదయ కాలనీవాసి బండి కిరణ్‌కుమార్‌ ఇలాగే మోసపోయారు. 2017జులై 21న తొలుత రూ.5,999 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కిరణ్‌.. తర్వాత మోసగాళ్ల మాటలు నమ్మి డబ్బు చెల్లిస్తూ పోయారు. అలా 2017 నవంబరు 16 వరకు ఏకంగా రూ.16.2లక్షలు సమర్పించుకున్నారు. ప్యాకేజీల పేరుతో కిరణ్‌ను ప్రలోభాలకు గురి చేసిన మోసగాళ్లు.. చివరి దశలో రూ.21.76 లక్షల చెక్కు ఇస్తున్నామని నమ్మించి ఏడు దఫాలుగా డబ్బులు వసూలు చేశారు. చివరకు జీఎస్టీ చెల్లిస్తే డబ్బు సొంతమవుతుందంటూ రూ.1.8లక్షలు కాజేసి మొహం చాటేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించారు.

రూ.59 వేలతో మొదలు.. రూ.2.54 లక్షలు టోకరా
చిత్రంలో కనిపిస్తున్న యువకుడు జీడిమెట్లకు చెందిన మహ్మద్‌ జహంగీర్‌. ఆక్ట్‌ ఫైబర్‌నెట్‌లో పనిచేసే ఇతడికి 2017 నవంబరులో ఇండోర్‌ హైబ్రో సంస్థ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. లాభాలొచ్చే పెట్టుబడి అంటూ మభ్యపెట్టడంతో తన దగ్గర ఉన్న రూ.59 వేలను ఆన్‌లైన్‌లో పంపించారు. అంతే అలా మొదలైంది వసూళ్ల పరంపర. రిజిస్ట్రేషన్‌ రుసుం పేరిట రూ.5వేలు, సెక్యూరిటీ డిపాజిట్‌ అంటూ రూ.94వేలు, టెక్నికల్‌ రిపోర్టులు అంటూ రూ.4వేల చొప్పున రూ 84వేలు.. ఇలా కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే రూ.2.54లక్షలు నొక్కేశారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తే వేధింపు కేసు పెడతామని బెదిరించారు. చివరకు బాధితుడు అప్పట్లోనే సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ మోసం గుట్టు రట్టు కావడంతో మరోసారి పోలీసుల్ని కలిసి గోడు వెళ్లబోసుకుంటూ ‘ఈనాడు’కు కనిపించారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.