close

బుధవారం, మార్చి 20, 2019

ప్రధానాంశాలు

ముక్కోటి దేవతలకు దేవుడొక్కడే

మామిడిపల్లి (మాక్లూర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: ముక్కోటి దేవతలున్నా దేవుడు మాత్రం ఒక్కరే ఉంటారని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌ స్వామి అన్నారు. గురువారం మామిడిపల్లి శివారులోని అపురూప ఆలయ సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీయర్‌ మాట్లాడుతూ... ప్రపంచంలో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు ఉన్నా అన్ని ఒకటేనని .. భాషలు వేరైనా భావం ఒక్కటేనన్నారు. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన తప్పనిసరిగా ఉండాలని, రోజులో ఒక గంటైనా స్వామి వారి కోసం కేటాయించాలన్నారు.అపురూప ఆలయాన్ని చూస్తే చాలా ప్రశాంత కలుగుతుందని,  నిజామాబాద్‌ జిల్లాలో ఇటువంటి ఆలయం ఉండటం ప్రజలకు.. దేవునితో దగ్గరి సంబంధం ఉన్నట్లేనని అన్నారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టు ఛైర్మన్‌ అమృతలత, సర్పంచి మల్లారెడ్డి, రాజారెడ్డి, రమాదేవి, ప్రభాదేవి, పరంపర సంస్థ సభ్యురాలు ఇందిరా, మామిడిపల్లి వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 
ఆకట్టుకున్న గుడి సంబరాల నృత్యలు 
అపురూప ఆలయంలో సంప్రదాయం ఉట్టిపడేలా గుడి సంబరాల కళాకారులు నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. దేవస్థానంలో గురువారం రాత్రి పరంపర సంస్థ ఆధ్వర్యంలో గుడి సంబరాలు కార్యక్రమాలలో బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారులు వేంకటేశ్వర చరిత గురించి నాటక, నృత్య రూపకం ద్వారా ప్రదర్శించారు. గ్రామీణ ప్రాంతాల సంప్రదాయాలను తిరిగి నాటక రూపంలో గుర్తు చేశారు. గంటన్నర పాటు కమనీయంగా సాగిన నృత్యాభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిన జీయర్‌ స్వామి కళాకారులను అభినందించారు.
మామిడిపల్లి (మాక్లూర్‌ గ్రామీణం): మాక్లూర్‌ మండలం మామిడిపల్లి శివారులో ఉన్న అపురూప వేంకటేశ్వర ఆలయంలో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు జాతర జరగనుంది. వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి ఏడు సంవత్సరాలు పూర్తవుతుండడంతో ఈ ఉత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అర్చకులు వెంకటకుమారస్వామి, త్రిపాఠి, రమాకాంత్‌శుక్లా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు శ్రీవారికి సుప్రభాతసేవ, తోమాలసేవ, తిరువారాధనము, సేవాకాలము, ఆరగింపు, బలిహరణము, శాత్తుమురై, శ్రీవారు యాగశాల ప్రవేశం, ద్వారతోరణ ధ్వజ కుంభారాధనము, మూర్తికుంభారాధన, అగ్నిప్రతిష్ఠ, శాంతి పాఠము, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమము, వైనతేయ ప్రతిష్ఠ, పంచసూక్త హవనము, పరివార ప్రాయశ్చిత హోమము, పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు ధ్వజారోహణము, గరుడప్రసాద వితరణ, తీర్థప్రసాద గోష్ఠి, సాయంత్రం 6 గంటలకు శ్రీవిష్ణు సహస్రనామ పారాయణము, భేరితాడనము, దేవతాహ్వనము, శ్రీవారికి శేషవాహన సేవ, ఎదుర్కోలోత్సవం కార్యక్రమాలను  నిర్వహించారు. గరుడ ప్రసాదం తిన్న వారికి సంతానం కలుగుతుందని అర్చకులు తెలిపారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.