close

బుధవారం, మార్చి 20, 2019

ప్రధానాంశాలు

అప్పనంగా కాజేశారు 

మరుగుదొడ్ల నిర్మాణాల్లో అక్రమాలు 
చర్యలకు అధికారుల వెనుకడుగు

స్వచ్ఛతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పల్లెల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల బాధ్యతలను గ్రామీణ పారిశుద్ధ్య కమిటీలకు అప్పగించింది. లక్ష్యాన్ని వేగంగా చేరుకొనేందుకు కమిటీల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేసి నిర్మాణాలు చేపట్టాలని నిర్దేశించింది. అక్కడే అక్రమాలకు తెరలేచింది. కమిటీలకు ప్రాతినిధ]్యం వహించిన మాజీ సర్పంచులు మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయకుండానే రూ.లక్షల నిధులను అప్పనంగా కాజేశారు. 
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి : మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని బాధ్యులపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరినా చర్యలు చేపట్టేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. దీని వెనుకగల ఆంతర్యమేమిటనేది అంతుచిక్కని ప్రశ్నే. మామూళ్లు ముట్టాయనే ఆరోపణలు లేకపోలేదు. 
పథకాలు ఏవంటే.. 
ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను తీసుకొచ్చాయి.  ఇందులో భాగంగా జిల్లాలో నిర్మల్‌ అభియాన్‌, స్వచ్ఛభారత్‌ మిషన్‌, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టారు. 
గంపగుత్తగా.. 
త్వరగా లక్ష్యం చేరుకొనేందుకు ఉపాధి హామీ ద్వారా గ్రూప్‌ ఎస్టిమేషన్‌ కింద గంపగుత్తగా మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్రామస్థాయిలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీలను ఏర్పాటు చేశారు. సర్పంచి, పంచాయతీ కార్యదర్శిలతో పాటు గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలిని సభ్యులుగా ఈ కమిటీలను మనుగడలోకి తీసుకొచ్చారు. వీటికి మొదట నిధులు విడుదల చేసి నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయనే వివరాలు అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. 
పునాది దశలోనే.. 
జిల్లాలో 1,555 యూనిట్లను గుర్తించారు. ఒక్కోదాని కింద ఐదు నుంచి అరవై మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. మొదటే నిధులు విడుదల చేయడంతో పారిశుద్ధ్య కమిటీలకు ప్రాతినిధ్యం వహించిన ఆనాటి సర్పంచులు నిర్మాణాలను ప్రారంభించామని చెప్పి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారు. అయితే ఏళ్లు గడిచినా ఈ నిర్మాణాలు పునాదుల దశల్లోనే ఉంటున్నాయి. సర్పంచుల పదవీకాలం ముగిసి నూతన సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ కొన్ని పల్లెల్లో మరుగుదొడ్లు నిర్మాణ దశలోనే ఉండటం గమనార్హం. 
కాంట్రిబూషన్‌ నిధులను కాజేశారు 
మరుగుదొడ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసేందుకు కాంట్రిబూషన్‌ కింద లబ్ధిదారుల నుంచి రూ.900 వసూలు చేశారు. ప్రభుత్వం బాధ్యతలను స్వచ్ఛభారత్‌ అభియాన్‌ మిషన్‌కు అప్పగించడంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచింది. దీంతో లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన కాంట్రిభూషన్‌ నిధులను వారికే అందజేయాలని జిల్లా అధికారులు ఆదేశించినా ఇప్పటి వరకు సగం మందికి కూడా ఆ డబ్బులు అందకపోవడం గమనార్హం. 
గోప్యత ఎందుకో.. 
కాంట్రిబూషన్‌ డబ్బులను వెంటనే లబ్ధిదారులకు అందజేసి ఆ వివరాలను గ్రామపంచాయతీల నోటీస్‌ బోర్డులో పొందుపరచాలని గత నెల కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా గ్రామైఖ్య సంఘాల ద్వారా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కొంత మంది లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించినట్లు చెబుతున్నారు. కానీ ఎంతమంది లబ్ధిదారులకు చెల్లింపులు చేశారనే విషయంలో గోప్యత పాటిస్తున్నారు. 
జిల్లా అంతటా.. 
ఉపాధి హామీ కింద వ్యక్తిగతంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో సైతం అవినీతి చోటుచేసుకొందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిర్మించిన వాటిని సైతం నూతనంగా నిర్మాణం చేసుకున్నట్లు చూపి నిధులను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. 
మాచారెడ్డి మండలంలోని మరుగుదొడ్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగినట్లు కనపడుతున్నా అందుకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో డీఆర్‌డీఎ అధికారులు వెనుకాడుతున్నారు. 
నిజాంసాగర్‌, మద్నూర్‌, మాచారెడ్డి, జుక్కల్‌, పిట్లం, రామారెడ్డి, బీబీపేట మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండానే నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.