close

బుధవారం, మార్చి 20, 2019

ప్రధానాంశాలు

బృహత్ప్రణాళికపై నజర్‌ 

లక్ష్యం..2040 
నగర, పురపాలికల్లో అభిప్రాయ సేకరణ

బృహత్ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) మారనుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గతంలో తలపెట్టిన ప్రక్రియలో కొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. 2000 సంవత్సరంలో రూపొందించిన ప్రణాళికను సవరించనున్నారు. నూతన ప్రణాళిక 2040 వరకు అమల్లో ఉండనుంది. గత పాలకవర్గ హయాంలో తెరపైకి వచ్చినా ప్రక్రియ కొన్నాళ్లుగా మరుగున పడింది. తాజాగా ప్రణాళికను చక్కదిద్దే పనిలో యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఇటీవల ఆయా పురపాలక సంఘాల్లో బృహత్ప్రణాళిక అమలుకు వివిధ పక్షాలు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. సమగ్ర అంశాలను క్రోడీకరించి నివేదికను పురపాలక శాఖకు నివేదించనున్నారు. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్‌ పురపాలికల్లో రూపురేఖలు మారనున్నాయి. 
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం: ఉభయ జిల్లాల్లో ఒక కార్పొరేషన్‌తో పాటు ఆరు పురపాలికలున్నాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 5.52 లక్షల జనాభా నివసిస్తోంది. దీనికి తోడు విలీన గ్రామాలను కలుపుకొని 6 లక్షల వరకు జనాభా పెరిగింది. ఏటా పట్టణాల పరిధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి ఉపాధి, చదువుల నిమిత్తం పట్టణాలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో నివాసాల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. పరిధి విస్తరణకు అనుగుణంగా సౌకర్యాల కల్పన అంతంతమాత్రంగానే ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పట్టుకొని పురపాలక శాఖ గతంలో ప్రణాళిక రూపకల్పన చేసింది. గతంలో హడావుడిగా అధికారులు రూపొందించి నివేదించిన ప్రణాళిక ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు. అమలుకు నేతల అడ్డు, కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. అధికారులు కఠిన చర్యలకు సాహసించినా అడుగడుగునా అవాంతరాలు ఎదురైన ఘటనలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. పరిధి విస్తరణకు అనుగుణంగా బృహత్ప్రణాళికలో మార్పులు అనివార్యమని తెలుస్తోంది. 

పారదర్శకంగా అమలు  చేస్తేనే... 
ప్రణాళికను పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరించారు. జిల్లాలో తమకు అనుకూలంగా ప్రణాళికలను మార్చేసిన ఉదంతాలు వెలుగు చూశాయి. కామారెడ్డిలో తమ నిర్మాణాలకు అడ్డు వస్తుందనే ఉద్దేశంతో భారీ డ్రైనేజీ నిర్మాణాలకు అడ్డు తగిలారు. పట్టణంలో యూఐడీఎస్‌ఎస్‌ఎంటీ పథకం కింద భారీ డ్రైనేజీ నిర్మాణాలు అమలు విషయంలో వివాదాస్పదమయ్యాయి. జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో ప్రణాళిక అమలు బెడిసికొడుతోంది. నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిన రోడ్లు కనుమరుగవుతున్నాయి. అధికారులు చేసేదేమీలేక తలలు పట్టుకుంటున్నారు. కామారెడ్డిలో సిరిసిల్లరోడ్డు, స్టేషన్‌రోడ్డు విస్తరణలో ఆదినుంచి మాస్టర్‌ప్లాన్‌ రగడ రాజుకుంటోంది. ఏళ్ల తరబడి సమస్య సద్దుమణగడం లేదు. ఇక ఖాళీ స్థలాల అభివృద్ధి, ఉద్యానాలు, పార్కింగ్‌జోన్లు, ఆటోనగర్‌ ఏర్పాటు, రోడ్ల వెడల్పు, తదితర సమస్యలు మాస్టర్‌ప్లాన్‌లో ‘కీ’లకం కాగా అమల్లో మాత్రం అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్‌ నగరం రోజురోజుకి విస్తరిస్తోంది. ఇక్కడ 10 కొత్త కూడళ్లు, 4 ఉద్యానాలు, 8 రోడ్లను విస్తరించాల్సి ఉంది. బోధన్‌లోనూ పరిధి విస్తరణకు అనుగుణంగా ప్రస్తుతం చర్యలు అవసరం. ఆటోనగర్‌ ఏర్పాటు ఆవశ్యకత ఉంది. ఆర్మూర్‌లో రోడ్లు, ఉద్యానాలు, ప్రణాళికలో మార్పులు అవసరం. కొత్త మున్సిపాలిటీల్లోనూ చర్యలుచేపట్టాల్సిన అవసరం ఉంది. 
అమలుపై సందిగ్ధత 
మాస్టర్‌ప్లాన్‌ అమలుకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించిన నేతలు కమిటీలో భాగస్వాములైతే ప్రక్రియలో పారదర్శకత లోపించే అవకాశాలున్నాయి. ప్లాన్‌ను తమకు అనుకూలంగా మార్చుకునే వెసులుబాటు కలుగనుంది. అయితే స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో జాప్యానికి కొత్త మార్గదర్శకాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో సందిగ్ధం నెలకొంది.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.