close

మంగళవారం, జనవరి 21, 2020

ప్రధానాంశాలు

కాకతీయుల కళా వైభవం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం: కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని పాతబజారు గౌరీశంకర ఆలయం చక్కటి శిల్ప కళతో అపర కైలాసంగా కనిపిస్తుంది. దాదాపు 800 ఏళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం పూర్తయినట్లు పురావస్తు శాఖ పరిశోధనల్లో తేలింది. ఆలయ నిర్మాణ పద్ధతి, లోపల వాస్తు కళాతోరణంలో(గర్భాలయం గది) గణపతిని, శైవాగమానికి దగ్గరగా శాస్త్రీయంగా ఉన్న రుజువులను బట్టి కాకతీయుల కాలం నాటిదని తెలుస్తోంది. క్రీ.శ.1295 నుంచి 1323 లోపు శ్రీ ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఇటీవల ఆలయాన్ని ఆగమశాస్త్రం ప్రకారం తిరిగి కొత్త శోభతో నిర్మాణం చేపట్టారు. కాశీ, నేపాల్‌ ప్రాంతాల శైవ క్షేత్రాలను తలపించేలా ఈ ఆలయం ఉండటం ప్రత్యేకత సంతరించుకుంది. ఆగ్నేయంలో అయ్యప్పస్వామి, వీరభద్రుడు, దక్షిణాన కాల భైరవుడు, సప్తమాతృకలు, నైరుతిలో బ్రహ్మ, పశ్చిమాన సరస్వతీ, వాయువ్యంలో సుబ్రమణ్యస్వామి, ఉత్తరంలో నారాయణమూర్తి, ఉత్తర ఈశాన్యంలో నవగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీమహావిష్ణువుకు అవతారాలున్నట్లే, శివునికి అవతారాలు ఉంటాయనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు. ఈ ఆలయంలో శంకరుని అవతారాలు ఒక్కో స్తంభంపై దర్శనమివడం విశేషం. కాకతీయ కాలంలో నిర్మించిన స్తంభాలపైనే చెక్కిన శివుని అవతారాలు దర్శనమిస్తాయి. జలంధహర, వీరభద్ర, సంధ్యతాండవ, దక్షిణమూర్తి, హరిహర అవతారాలను స్తంభాలపై చెక్కించారు. గర్భాలయం చుట్టూ కూర్చొని అభిషేకాలు చేసుకోవచ్చు. గర్భాలయం, అంతర్గర్భాలయం బయట శాడశ స్తంభ మంటపం.. ఇవన్నీ రాతి కట్టడాలే. పూర్వకాలంలో శివాలయానికి చుట్టూ విశాలమైన ప్రాకారం కొలను ఉన్నట్లు చెబుతారు.

ప్రత్యేక పూజలు ఇవీ..
నగరంలోని పాత బజారు గౌరీశంకరాలయంలో మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున 3.30 గంటలకు సుప్రభాత సేవ, ప్రాతఃకాల అభిషేకాలు, 4 గంటల నుంచి సర్వదర్శనాలు విశేష ద్రవ్య దాతలకు(ఆలయ పునర్నిర్మాణ దాతలకు) 7 గంటల వరకు అభిషేకాలు, ఉదయం 7 గంటల నుంచి సార్వజనిక అభిషేకాలు, సాయంత్రం 6 గంటలకు ప్రదోష కాల పూజలు, రాత్రి 9 గంటలకు పల్లకి సేవ, రాత్రి 10 గంటల నుంచి మహాన్యాస రుద్రాభిషేకాలు, ఫల పంచామృతాభిషేకాలతో విశేష పూజలు నిర్వహిస్తారు. పూజానంతరం దర్శనం, జాగారం ఉంటుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.