close

మంగళవారం, జులై 16, 2019

ప్రధానాంశాలు

కుడిఎడమైతే టిక్కెట్‌ గల్లంతే!

ఆశావాదులకు చేజారిన సీట్లు

 

ఈనాడు, విజయవాడ: జనసేన పార్టీ పోటీపడటంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. జిల్లాలో కొందరు నాయకుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ‘మీరు పార్టీలో చేరితే బాగుంటుంది.. మీకు భవిష్యత్తు ఉంటుంది. మీసేవలు పార్టీకి అవసరం.. !’ అని చెప్పేందుకు జనసేన పార్టీ కార్యాలయం నుంచి యలమంచిలి రవికుమార్‌కు ఫోన్‌ వచ్చింది. జనసేన అధినేత పవన్‌ మాట్లాడతారని చెప్పారు. తాను పూజలో ఉన్నానని, తర్వాత మాట్లాడతానని చెప్పారు. అంతే విజయవాడ తూర్పు టిక్కెట్‌ మరుసటి జాబితాలో వేరే వ్యక్తి పేరు వచ్చింది. బత్తిన రాముకు కేటాయించారు. మొదట మాజీ ఎమ్మెల్యే యలమంచిలిరవికి ఇవ్వాలనేది నిర్ణయంగా తెలిసింది. కానీ ఒక్క రోజులో మారిపోయింది. యలమంచిలి రవి కూడా ఊగిసలాటలో ఉండటంతో అవకాశం చేజారింది. ప్రస్తుతం ఆయన తూర్పు నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసే అంశం పరిశీలనలో ఉంది. నేతల నుంచి బుజ్జగింపులు జరుగుతున్నాయి. యలమంచిలి రవికుమార్‌ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆయనకు నాడు తూర్పు టిక్కెట్‌ దక్కింది. అక్కడి నుంచి శాసనసభకు వెళ్లారు. వాస్తవానికి ఇదే స్థానాన్ని 2009లో బొప్పన భవకుమార్‌, బత్తిన రాములు ఆశించారు. కానీ ప్రరాపా టిక్కెట్‌ యలమంచిలికి దక్కింది. బత్తిన రాము గన్నవరం నుంచి ప్రరాపా తరపున పోటీ చేశారు. దాదాపు 24వేల ఓట్లు సాధించారు. తర్వాత పరిణామాల్లో యలమంచిలి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం.. అక్కడి నుంచి తెదేపాలో చేరడం జరిగిపోయాయి. వైకాపాలో బొప్పన భవకుమార్‌ చేరారు. తూర్పు ఇంఛార్జిగా ఉన్నారు. యలమంచిలికి తెదేపాలో అంత ప్రాధాన్యం రాకపోవడంతో వంగవీటి రాధా ద్వారా టిక్కెట్‌ హామీతో వైకాపాలో చేరారు. కానీ అనూహ్యంగా బొప్పన భవకుమార్‌కు టిక్కెట్‌ దక్కింది. ఎంపీ అభ్యర్థి పొట్లూరి వి. ప్రసాద్‌ ఒత్తిడి పనిచేసినట్లు చెబుతున్నారు. గతంలో ప్రరాపా తరపున గెలిచిన చరిత్ర ఉండటంతో పవన్‌ పార్టీ జనసేనలో చేరాలని రవి అనుచరులు వత్తిడి చేశారు. కానీ ఒక్క రోజులోనే సీనుమారిపోయింది.

 

డీవైదాస్‌ పరిస్థితి..!

పామర్రు నియోకవర్గం మాజీ ఎమ్మెల్యే డివైదాస్‌ పరిస్థితి విచిత్రంగా తయారైంది. ఆయన ఆఖరి నిమిషంలో జనసేనలో చేరినా పార్టీ టిక్కెట్‌ దక్కకపోవడంతో చేరిన మూడో రోజే రాజీనామా చేసినట్లు ప్రకటించారు. డీవైదాస్‌ మొదట కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. ఆయన 2009లో కాంగ్రెస్‌ తరపున పామర్రుకు పోటీ చేసి గెలిచారు. నాడు ఉప్పులేటి కల్పన తెదేపా తరపున పోటీ చేశారు. 6,500 మెజార్టీలో గెలుపొందారు. 2014 నాటికి కాంగ్రెస్‌ పరిస్థితి తల్లకిందులైంది. 2014లో ఉప్పులేటి కల్పన వైకాపాలో చేరారు. తెదేపా తరపున వర్ల రామయ్య పోటీ చేశారు. కాంగ్రెస్‌ నుంచి డీవై దాస్‌ పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 8,237 ఓట్లు వచ్చాయి. వైకాపా నుంచి ఉప్పులేటి కల్పన కేవలం 980 ఓట్లతో వర్లరామయ్యపై విజయం సాధించారు. తర్వాత ఆమె తెదేపాలో చేరారు. కాంగ్రెస్‌లో ఉన్న డీవైదాస్‌ మౌనంగా ఉన్నారు. అయితే ఇటీవల రెండు పార్టీలతరపున టిక్కెట్‌ ఆశించారు. వైకాపా నుంచి గానీ, తెదేపా నుంచి గానీ టిక్కెట్‌ వస్తుందని ఆశించారు. తరువాత జనసేన పార్టీలో చేరారు. పొత్తులో బీఎస్పీకి ఆ స్థానం కేటాయించడంతో ఆయన జనసేనకు రాజీనామా చేశారు.

 

● విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ టిక్కెట్‌ కొరడా విజయకుమార్‌ ఆశించారు. అక్కడ ఇంచార్జి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు వైకాపా టిక్కెట్‌ ఇచ్చారు. జనసేన తరపున ఆశించారు. కానీ అప్పటికే పొతినవెంకట మహేష్‌కు కేటాయించారు. దీంతో కొరడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ● రెండు పార్టీల్లో కాలుపెట్టి అటుఇటుకాకపోయిన అభ్యర్ధులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. పెడన నియోజకవర్గంలో వైకాపా టిక్కెట్‌ను ఉప్పాల రాంప్రసాద్‌ ఆశించారు. కానీ అక్కడ జోగి రమేష్‌కు టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో జనసేన తరపున పోటీ చేయాలని ఉప్పాలపై ఒత్తిడి వచ్చింది. కానీ ఈలోగా అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌కు టిక్కెట్‌ తన్నుకుపోయారు. దీంతో ఆయన రెబల్‌గా దిగుతారా లేదా అనేది తేలాల్సి ఉంది.

● కాంగ్రెస్‌ పార్టీలో మరీ విచిత్ర పరిస్థితి ఉంది. ఇచ్చిన టిక్కెట్‌ను వద్దనే అభ్యర్థులు ఉన్నారు. వచ్చిన అవకాశం కూడా జారవిడుచుకుంటున్నారు. కారణం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ డీలాపడిన విషయం తెలిసిందే. మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ కోసం గన్నవరం సీటు కేటాయించారు. ఆమె తనకు విజయవాడ పార్లమెంట్‌ స్థానం కావాలని పట్టుబట్టారు. కానీ విజయవాడ నరహరిశెట్టి నర్సింహారావుకు కేటాయించారు. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గానికి సుంకర వీరభద్ర ప్రసాద్‌కు కేటాయించారు. ప్రస్తుతం ఆమె ఎక్కడా పోటీ చేయడం లేదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.