close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కార్పొరేషన్‌కు బురిడీ

ముందు దానం... తర్వాత అక్రమ నిర్మాణం

విస్తరణకు అడ్డుగా వాణిజ్య సముదాయం

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

 

ఇంటి నిర్మాణానికి ప్లాను పొంది అక్రమంగా నిర్మిస్తున్న వాణిజ్య సముదాయం

అది రద్దీగా ఉండే బందరు రోడ్ఢు నిత్యం అధికారులు అటువైపు నుంచే కార్యాలయానికి వెళ్లి వస్తుంటారు. కరోనా వారిని కట్టడి చేసిందో..భవన నిర్మాణదారుడు కళ్లు కప్పాడో గానీ కేవలం 41.42 అడుగుల స్థల విస్తీర్ణంలో చిన్న ఇంటి నిర్మాణానికి ప్లాను పొంది.. భారీ వాణిజ్య సముదాయం నిర్మాణం చేపడుతూ నగరపాలక సంస్థకు బురిడీ కొట్టిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బందరు రోడ్డు విస్తరణకు రాసిచ్చిన స్థలాన్ని తిరిగి ఆక్రమించుకుని ప్రస్తుతం చేపడుతున్న అక్రమ వాణిజ్య నిర్మాణంతో అక్కడి రెండు రోడ్లు మాయం కాగా, నాలుగు వైపులా సెట్‌బ్యాక్‌ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్లయింది. పార్కింగ్‌ ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలు ఎదురు కానున్నాయి.

నిబంధనలకు తిలోదకాలు

విజయకృష్ణా సూపర్‌ బజార్‌ సమీపంలోని స్థల యజమాని ఇంటి నిర్మాణం చేసేందుకు ప్లాను కోసం దరఖాస్తు చేసుకోగా, విస్తరణలో కోల్పోయే స్థలాన్ని గిప్టుగా రాయించుకుని 41.42 అడుగులకు నగరపాలక సంస్థ అధికారులు ఇంటి నిర్మాణానికి ప్లాను మంజూరు చేశారు. చిన్న పడకగది, వంటగది, స్నానాల గదితో జీ+2 నిర్మాణానికి అనుమతి మంజూరైంది. ఇదే అదనుగా స్థల యజమాని లిఫ్టు సౌకర్యంతో భారీ వాణిజ్య సముదాయ నిర్మాణం అక్రమంగా సాగిస్తున్నారు. అనుమానంతో కొందరు కమిషనర్‌కు, పట్టణ ప్రణాళిక ముఖ్య అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ అక్రమ కట్టడం వివరాలు తెలుసుకుని సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చారు. ఈ నిర్మాణంతో నగరపాలక సంస్థ రుసుంల రూపంలో రూ.లక్షల్లో నష్టపోవడంతో పాటు విలువైన స్థలం చేజారింది.

అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తాం

ప్లానుకు భిన్నంగా చేపడుతున్న నిర్మాణ విషయం కమిషనర్‌ దృష్టికి వెళ్లింది. పలు ఫిర్యాదులు అందాయి. ఒకటి, రెండు రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తాం.

-లక్ష్మణరావు, సిటీ ప్లానర్‌

ఇదీ సంగతి

బందరు రోడ్డును 2000, 2002 సంవత్సరాల్లో ఉడా, నగరపాలక సంస్థ అధికారులు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం మూడు దశల్లో 120 అడుగులకు విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు. అప్పట్లో కొన్ని ప్రాంతాల్లో రోడ్డు 50, 58 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి విస్తరణకు అక్కడి స్థలాలు, భవన యజమానులకు ఎఫ్‌ఎఆర్‌ బాండ్లు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో 60, 80, 100 అడుగులకు విస్తరించి వదిలేశారు.

షరుతుల మేరకు ప్లాన్లు

నాటి నుంచి బందరు రోడ్డు వెంట నిర్మాణపు ప్లాన్లు మంజూరు కావాలంటే మాస్టర్‌ ప్లాను నిబంధనలు, సెట్‌బ్యాక్‌ షరుతులు పాటించాల్సిందే. ఇక విస్తరణలో కోల్పోయే స్థలం నగరపాలక సంస్థకు రాసివ్వాల్సిందే.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.