close

గురువారం, జులై 09, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిత్తూరు కోర్టుకు గొప్ప చరిత్ర

●సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

●నూతన జిల్లా కోర్టు సముదాయ శిలాఫలకం ఆవిష్కరణ

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి

రవీంద్రబాబు, భౌతిక దూరం పాటిస్తూ

సమావేశంలో పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు - న్యూస్‌టుడే, చిత్తూరు(న్యాయవిభాగం): చిత్తూరు కోర్టుకు గొప్ప చరిత్ర ఉందని.. ఇక్కడి నుంచి ఎందరో స్వాతంత్య్ర పోరాటాల్లో పాల్గొనడంతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ రాజకీయ నాయకులుగా రాణించారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. చిత్తూరు హైరోడ్డులోని పాత జిల్లా కోర్టు ప్రాంగణంలో రూ.40.30 కోట్లతో నిర్మించదలచిన నూతన బహుళ అంతస్తుల కోర్టు సముదాయానికి శుక్రవారం డిజిటల్‌ విధానంలో భూమిపూజ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు దిల్లీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్నారు. అమరావతి నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్‌ఫోలియో న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథరాయ్‌ ఆన్‌లైన్‌ విధానంలో పాల్గొని ప్రసంగించారు. జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రసంగిస్తూ.. 2011, 2013లో చిత్తూరు జిల్లా కోర్టు సముదాయాన్ని సందర్శించానని, అప్పటి నుంచి ఇక్కడ నూతన భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఈ పనులు కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందని, కోర్టు భవనాలు క్రమబద్ధంగా ఉండాలన్నారు. జస్టిస్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిందని, తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం పుణ్యక్షేత్రాలు ఇక్కడ కొలువుదీరాయన్నారు. 1920లో ఇక్కడ జిల్లా కోర్టు నెలకొల్పారని, సరిగ్గా వందేళ్లకు.. 2020లో మెరుగైన మౌలిక సదుపాయాలతో కోర్టు నిర్మాణానికి అంకురార్పణ జరగడం చిత్తూరు వాసులకు ఆనందదాయకమన్నారు. కొత్త సముదాయానికి ఆన్‌లైన్‌ ద్వారా శిలాఫలకం ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. అమెరికా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్‌ రాబర్ట్స్‌ 2005లో సమాజంలో జడ్జిల పాత్ర అంపైర్ల లాంటిదంటూ పేర్కొన్న విషయాన్ని న్యాయమూర్తులు గుర్తుచేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు జిల్లా కోర్టు చరిత్రను వివరించారు.

 

శాస్త్రోక్తంగా భూమిపూజ

జిల్లా కోర్టు నూతన బహుళ అంతస్తుల సముదాయానికి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని డిజిటల్‌ పద్ధతిలో ఆవిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌తో పరీక్షించి లోపలకు అనుమతించారు. నిబంధనల మేరకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అధికారులు మాస్కులు ధరించి.. భౌతికదూరం పాటించారు. మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వెంకట హరినాథ్‌, శాశ్వత లోక్‌ అదాలత్‌ ఛైర్మన్‌ లక్ష్మీనారాయణ, న్యాయసేవా సదన్‌ జిల్లా కార్యదర్శి నాగశైలజ, న్యాయవాదుల క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లారి ద్వారకానాథరెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహన్‌ రామిరెడ్డి, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, అసోసియేషన్‌ కార్యదర్శి భానుశేఖరరెడ్డి, కోశాధికారి విశ్వనాథ్‌, సంయుక్త కార్యదర్శి మోహన్‌, న్యాయవాదులు, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.