close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మబ్బుల కాలం.. జబ్బులు కాయం!

● సీజనల్‌ వ్యాధుల ముప్పు

● వర్షాల రాకతో పెరగనున్న డెంగీ, మలేరియా

● పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహిస్తేనే కట్టడి

జిల్లాలో కొవిడ్‌ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతోపాటు మరణాలు సంఖ్యా ఎక్కువవుతోంది. మరోవైపు వర్షాలు ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. గతేడాది వర్షాల కారణంగా దోమల వ్యాప్తి పెరిగి.. 327 మంది డెంగీ, ఎనిమిది మంది మలేరియా బారిన పడ్డారు. అధికారులు లెక్క చూపక పోయినా.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు.

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ముందుగానే వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 11 మందికి డెంగీ సోకింది. జ్వరాల బారిన పడిన వారిలో కొందరు స్థానిక ఆర్‌ఎంపీలు, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు. జ్వరంతో బాధపడుతూ మదనపల్లె జిల్లా ఆసుపత్రికి రోజుకు 15- 20 మంది వస్తున్నారు. వీరిలో అధిక శాతం మంది టైఫాయిడ్‌ ఉన్నవారే. ప్రస్తుతం కురిసిన వర్షాలకు నీరు కలుషితం కావడంతోనే వ్యాధులకు కారణమైంది. గతేడాది కొన్ని మండలాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టకపోవడం, నీటి ఎద్దడి కారణంగా పశ్చిమ ప్రాంతాల్లోని ప్రజలు ట్యాంకర్లతో సరఫరా చేసిన నీటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడంతో దోమలు వాటిని స్థిర నివాసాలుగా మార్చుకున్నాయి. దీంతో డెంగీ తీవ్రమైంది. ప్రధానంగా సత్యవేడు నియోజకవర్గంలో డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయి. అనంతరం గంగాధరనెల్లూరు, పీలేరు నియోజకవర్గాల్లో కేసులు ఎక్కువగా వచ్చాయి.

పారిశుద్ధ్యలేమితోనే సమస్య

ఈ ఏడాది మార్చి నుంచి జిల్లాలో కొవిడ్‌ కేసులు నమోదవుతుండటంతో అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. దీనికితోడు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో పంచాయతీల్లో నిధుల కొరత తీరనుంది. ఈనేపథ్యంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి జులై మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కంటైన్మెంట్‌ ప్రాంతాలపై చూపిన శ్రద్ధ ఇతరచోట్ల చూపడంలేదనే విమర్శలున్నాయి. ఈవిషయంలో నిర్లక్ష్యం వహిస్తే గతేడాది పరిస్థితే పునరావృతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలతో ఆసుపత్రులకు వచ్చేవారికి కొవిడ్‌ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పారిశుద్ధ్యలేమితో దోమల మూలంగా జ్వరాలు ప్రబలితే.. వీరందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. ఇది వైద్య ఆరోగ్యశాఖకు తలకు మించిన భారమవుతోంది. వీటన్నంటినీ పరిగణనలోకి తీసుకొని పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టడంతోపాటు దోమల నివారణకు ఫాగింగ్‌ చేస్తే వ్యాధులు విస్తరించే అవకాశం ఉండదు.

ప్రత్యేక డ్రైవ్‌ చేపడతాం

గత మూడేళ్లలో అత్యధిక డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌ చేపడతాం. ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూస్తాం. జిల్లావ్యాప్తంగా ఫాగింగ్‌తోపాటు మలాథీన్‌ను పిచికారీ చేయిస్తాం. డెంగీ కేసులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. - సాంబశివారెడ్డి, డీపీవో

 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.