close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

విజయం దిశగా పాల కేంద్రం

జిల్లాలో ఆదరణ పొందుతున్న ఉత్పత్తులు

త్వరలో మరిన్ని శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరం


రాజమహేంద్రవరంలోని పాలకేంద్రం

 

ఉభయ గోదావరి జిల్లాల్లో ఇదవరకు విజయ పాలకు విశేష ఆదరణ ఉండేది. కారణాలేవైనా.. కొంత కాలంగా ఉత్పత్తిని నిలిపివేశారు. ఆ తరువాత పరిస్థితులు మారడంతో క్రమంగా ఉత్పత్తులు ప్రారంభించారు. వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పాలతోపాటు, పాల సంబంధిత పదార్థాలను అందుబాటులోకి తెచ్చి ప్రైవేటు సంస్థలతో పోటీపడుతోంది.. రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ పాలకేంద్రం.

పాల సేకరణ ఇలా..

జిల్లాలో ఏడు శీతలీకరణ కేంద్రాలున్నాయి. కరప, పెదపూడి, రాయవరం, కడియం, రావులపాలెం, అయినవిల్లి, శంఖవరం నుంచి రోజుకు నాలుగు వేల లీటర్లకుపైగా పాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సుమారు నాలుగు వేల లీటర్లతో పాల ప్యాకెట్లు తయారు చేస్తున్నామన్నారు. కోవా తయారు చేస్తున్నారు. పాల సేకరణను మరింత పెంచేందుకు త్వరలో కిర్లంపూడి, తొండంగి, డి.పోలవరాల్లో శీతలీకరణ కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 

విజయ సంస్థ ఉత్పత్తులు

ఆకర్షిస్తున్న పార్లర్‌..

క్రమంగా పాల ప్యాకెట్లకు ఆదరణ పెరగడంతో పాలకేంద్రం ఆవరణలో ప్రయోగాత్మకంగా ఆధునిక హంగులతో విజయ డెయిరీ పార్లర్‌ను ఇటీవల ప్రారంభించారు. దీనిలో ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్‌ వారి పాలు, పాలపదార్థాలు, వివిధ మిఠాయిలు, పన్నీర్‌, తాగునీరు, చిరుధాన్యాలతో చేసిన మిఠాయిలు, తీపి లేని మిఠాయిలు.. ఇలా పలు రకాల ఆహార పదార్థాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభించిన కొద్దికాలంలోనే వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దాంతో రాజమహేంద్రవరం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు అయిదు పార్లర్‌లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రైతుల సహకారం మరువలేం..

మేం అభివృద్ధి చెందడానికి పాడి రైతులు అందిస్తున్న సహకారం మర్చిపోలేం. జిల్లాలో ఇంకొన్ని శీతలీకరణ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చి పాలకేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే లక్ష్యం. మరిన్ని డెయిరీ పార్లర్‌లను అందుబాటులోకి తెస్తాం.

- పి.ఉమాదేవి, ఉప సంచాలకురాలు,

ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార

సమాఖ్య లిమిటెడ్‌, తూర్పుగోదావరి జిల్లా

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.