close

బుధవారం, నవంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిన్నారి పెళ్లికూతురు

జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతున్న బాల్య వివాహాలు

సరాసరి 15.2 ఏళ్లకే పెళ్లిపీటలు ఎక్కించే ప్రయత్నం

కొన్నింటిని అడ్డుకుంటున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ

దేవాదాయశాఖ పరిధిలోనూ ప్రత్యేక చర్యలకు సన్నాహాలు

న్యూస్‌టుడే, తుని పట్టణం

జిల్లాలో అమ్మాయికి 18 సంవత్సరాల యుక్త వయసు రాకుండానే వివాహాలు చేయాలని అనేక మంది చేస్తున్న ప్రయత్నాలు సామాజిక సమస్యగా మారాయి. జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లెక్కలే దీనికి నిదర్శనం. 2019లో అధికారికంగానే 156 బాల్య వివాహాలను ఆ శాఖ అధికారులు అడ్డుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, అమలాపురం తదితర డివిజన్ల పరిధిలో కూడా ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. సరాసరి 15.2 ఏళ్ల వయసుకే వారిని పెళ్లిపీటలు ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నింటిపై ఫిర్యాదులు, సమాచారం అందుకున్న అధికారులు ఆయా వివాహాలను అడ్డుకున్నారు. తెలియకుండా జరిగిపోతున్నవి కోకొల్లలుగా ఉంటున్నాయి.

సంసారంలో బందీ...

లోకం తెలియని బాలికలు, తోటివారితో సరదాగా గడపాల్సిన వయసులో అత్తారింటికి వెళ్లాల్సిన పరిస్థితులను అనేక మంది బాలికలు ఎదుర్కొంటున్నారు. పుస్తకాలతో కళాశాలలకు వెళ్లాల్సిన వయస్సులో కుటుంబ బాధ్యతల్లో పడాల్సిన దుస్థితి. 10వ తరగతి పూర్తికాగానే అనేక మంది బాలికలకు వివాహాలు చేయడానికి కొంత మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. దేవాలయాల్లో కూడా వివాహాలు అనేకం జరుగుతున్నాయని తెలుస్తోంది. అధికారులకు సమాచారం ఉంటే అడ్డుకుంటున్నారు. లేకుంటే వివాహాలు జరిగిపోతున్నాయనే చెప్పాలి. అమ్మాయికి పెళ్లిచేస్తే బాధ్యత తీరిపోతుందని, మంచి సంబంధమని, ఆస్తి కలిసి వస్తుందని, బంధుత్వం కలుపుకోవడానికి ఇలా కారణాలు అనేకం ఉంటున్నాయి. చట్టప్రకారం 18 ఏళ్లు నిండనిదే ఆడపిల్లకు, 21 ఏళ్ల నిండకుండా పురుషులకు వివాహం చేయకూడదు. కానీ అనేక మంది పలు కారణాలతో యుక్త వయసు రాకుండానే బాధ్యతల వలయంలో చిక్కిపోతున్నారు. పరిణయం అయిన కొద్ది రోజులకే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. చిన్న వయసులోనే గర్భిణిగా, ఇల్లు, పిల్లలు, సంసారం అనే ఛట్రంలో కొట్టుమిట్టాడే పరిస్థితులున్నాయి.

ఇదీ పరిస్థితి..

● సరాసరి 15.2 ఏళ్లకు బాలికలకు వివాహాలు చేయడానికి ఆయా కుటుంబాలు ప్రయత్నించాయి. ● 12 ఏళ్ల వయసుకు కూడా బాలికలకు వివాహాలు చేయడానికి సిద్ధమైన వారు ఉన్నారు. ● ఇందులో 14-17 ఏళ్ల వయసు ఉన్న వారు అధికంగా ఉన్నారు. ● బాలల్లో 19 ఏళ్లకే జరిగే రెండు వివాహాలను అడ్డుకున్నారు.

అనేక సమస్యలు...

బాల్యంలో వివాహం చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. చిన్న సమస్యలకు సైతం మానసికంగా కుంగిపోయే అవకాశాలుంటాయి. పిల్లలను కనే ప్రయత్నంలో అనేక ఆరోగ్య సమస్యలూ వచ్చే అవకాశం ఉంది. శిశుమరణాలు సంభవించవచ్ఛు ఒక్కో సందర్భంలో తల్లి, బిడ్డలకు ఇద్దరికీ ప్రమాదకరంగా మారవచ్ఛు చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల గర్భిణిగా కూడా ఇబ్బందులు వస్తాయి. పుట్టే పిల్లలకు కూడా అత్యధిక శాతం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మానసిక ఎదుగుదల ఉండదు.

- అన్నపూర్ణ, గైనకాలజిస్టు, ప్రభుత్వ వైద్యురాలు, తుని

తల్లిదండ్రుల్లో మార్పు రావాలి

బాల్య వివాహాల విషయంలో ప్రతి ఒక్కరిలో అవగాహన రావాలి. బాల్యంలోనే పెళ్లి చేయాలని భావించే తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. చట్టాల గురించి తెలియాలి. ఈ విషయంలో అవగాహన కల్పించేందుకు అనేక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. దీనివల్ల భవిష్యత్తులో అనర్థాలు, వీటిని ప్రోత్సహిస్తే చట్టపరంగా శిక్షలు కూడా తెలియజేస్తున్నాం. సమాచారం తెలిస్తే అడ్డుకుంటున్నాం.

-ఎస్‌.వెంకట్రావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి, కాకినాడ

బాల్య వివాహాల అడ్డుకట్టకు చర్యలు

దేవస్థానాల్లో బాల్య వివాహాలు జరగకుండా, వీటికి అడ్డుకట్ట వేయడానికి దేవాదాయశాఖ చర్యలు తీసుకుంటుంది. ఈ విషయమై ఇటీవల ఉన్నతాధికారులు చర్చించారు. అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దేవాదాయశాఖ కూడా త్వరలోనే దీనిపై మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశముంది.

- త్రినాథరావు, ఈవో, అన్నవరం దేవస్థానం

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.