close

గురువారం, ఫిబ్రవరి 20, 2020

ప్రధానాంశాలు

ముంచుతున్నా ముందుచూపేదీ..?

పూర్తికాని భూసేకరణ.ఆధునికీకరణ పనుల్లో కానరాని పురోగతి
వరదొస్తే ముంపుబారిన పంటలు, నివాసాలు  
సుద్దగడ్డ, పెదయేరు,  నక్కలగండి, గొర్రిఖండి కాలువలకు వీడని గ్రహణం
ముందుకు సాగని ఏలేరు అనుబంధ కాలువల అభివృద్ధి


పిఠాపురం మండలం జములపల్లి ప్రాంతంలో పూడికను కొంతమేర తొలగించి వదిలేసిన గొర్రిఖండి కాలువ

ఏలేరు కాలువల ఆధునికీకరణ పనులకు పట్టిన  గ్రహణం వీడడం లేదు. దీని పరిధిలోని ప్రధాన  కాలువలతో పాటు అనుబంధ కాలువలు ఏళ్లతరబడి  అభివృద్ధి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో  వానొచ్చినా.. వరదొచ్చినా ఈ కాలువల సమీపంలో భూములున్న రైతులతో పాటు స్థానిక ప్రజలూ బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. రోజులతరబడి ఆయా ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. ఆధునికీకరణ పనుల్లో భాగంగా భూసేకరణ ప్రక్రియకు ప్రతిబంధకాలు వీడక పోవడం..కాలువల విస్తరణ పనులు సాగకపోవడంతో పుష్కలంగా నీటివనరులున్నా కష్టాలు మాత్రం తప్పడం లేదు.

ఈనాడు, కాకినాడ  : జిల్లాలో రెండున్నర దశాబ్దాల కిందట ప్రారంభమైన ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు ఇప్పట్లో కొలిక్కివచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మావ΄లు రోజుల్లో కాలువల వైపు కన్నెత్తిచూడని యంత్రాంగం వరదలు, ముంపు సమయాల్లో మాత్రం హడావుడి చేస్తోంది. అంతిమంగా రైతులు, సామాన్య ప్రజలకు మాత్రం ఏటా కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలతో ఈ సమస్య ముడిపడి ఉంది. రూ.264 కోట్లతో రెండు దశల్లో  ప్రతిపాదించిన ఆధునికీకరణ పనుల్లో జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం నానాటికీ పెరుగుతోంది. ఈ పనులు కొలిక్కివస్తే 67,600 ఎకరాలకు మోక్షం కలిగినట్లే. తొలిదశ పనులు సగం మాత్రమే పూర్తవగా.. రెండో దశ పనుల్లో కనీస కదలిక లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలేరు జలాశయం నుంచి దిగువకు వరద నీరొస్తే శివారు ఆయకట్టు భూములున్న పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు ముంపుబారిన పడుతున్నాయి. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏలేరులో గత ఏడాది వరదల కారణంగా 20 వేల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో 15 వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఫలితంగా రెండు వేల హెక్టార్లకు పైగా పంటలకు నష్టం వాటిల్లింది. వ΄డున్నర దశాబ్దాలుగా ఏలేరు ప్రభావంతో వరదలు వచ్చినప్పుడల్లా పునరావాస చర్యలు, పరిహారం కింద రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి ఎదురుకానుంది.ఏలేరు తొలి దశలో నిర్మాణాలు, తవ్వకం పనులు కొలిక్కిరాని కారణంగా సమస్య ఎదురవుతోంది. ఏలేరుతో పాటు సుద్దగడ్డ, పెదయేరు, నక్కలగండి, గొర్రిఖండి కాలువలు, వాటి పరిధిలోని పిల్ల కాలువల్లో భారీగా తూటికాడ, గుర్రపుడెక్క పేరగడంతో వ΄సుకుపోయి నీటి ప్రవాహం దారిమళ్లుతోంది. భారీ వర్షాలు, వరద నీరు సముద్రంలోకి నేరుగా వెళ్లే వీలులేక జనావాసాలపై పడుతోంది. దీని ప్రభావంతో గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని ఈబీసీ కాలనీ, దేవీనగర్, కరణంగారితోట, ఎస్సీపేట, సూరంపేట, శివాలయ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు తప్పడం లేదు. 

రెండో విడతలో కదలిక ఎప్పుడో..?

ఏలేరు కాలువ మొదటి విడత పనులు 52 శాతం మాత్రమే పూర్తయ్యాయి. భూసేకరణ, గుత్తేదారు చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపునకు నిధులు రూ.50 కోట్ల వరకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో కదలిక లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. మొదటి విడతలో కిర్లంపూడి మండలం నుంచి పిఠాపురంలోని గొర్రిఖండి కాలువ వరకు మేజర్‌ కాలువలు 36.36 కి.మీ, మైనô్ కాలువలు 46.52 కి.మీ పొడువున, 5.6 మీటర్ల లోతున, కాలువలు ఏడు మీటర్లు వెడల్పుతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. భూసేకరణలో చిక్కుల కారణంగా వెడల్పు 160 మీటర్ల నుంచి 120 మీటర్లకు తగ్గించాల్సి వచ్చింది. రెండు విడతల్లో వెయ్యి ఎకరాల వరకు భూసేకరణ జరగాల్సి ఉన్నా 150 ఎకరాల వరకే సేకరించడం గమనార్హం. ఈ పనులు నిలిచిపోగా, రెండో విడతలో సుద్దగడ్డ, పెదయేరు, నక్కల గండి కాలువలను ఆధునికీకరణ పనుల్లోనూ కదలిక లేదు. ఈ పనులకు రూ.137 కోట్లు కేటాయించినా ప్రారంభకాని పనులు నిలిపివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో సందిగ్ధం నెలకొంది. ప్రధాన కాలువ పొడవునా పూడిక పేరుకుపోవడం, పొదలు పెరిగిపోవడం..గట్లు బలహీనపడడంతో భవిష్యత్తులో గండ్లు కూడా పడే ప్రమాదం ఉందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. 

మళ్లీ టెండర్లు పిలుస్తాం

ఏలేరు కాలువ ఆధునికీకరణలో భాగంగా రెండో విడత పనులు రూ.127 కోట్లతో చేపట్టాల్సి ఉంది. ఇందులో భూసేకరణకు పోను..ఆధునికీకరణ పనులకు రూ.110 కోట్లతో గతంలో టెండర్లు పిలిచారు. 25 శాతానికి మించి ప్రగతి లేని పనులు నిలిపివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పనులకు ప్రభుత్వ ఆమోదంతో మళ్లీ టెండర్లు పిలుస్తాం. తొలి విడత ఆధునికీకరణ పనులకు సంబంధించి భూసేకరణకు రూ.48 కోట్లు కేటాయించాల్సి ఉంది. గుత్తేదారు చేసిన పనులకు రూ.అయిదు కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంతో పనులు నెమ్మదించాయి. తాజా పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. - ప్రశాంత్‌బాబు, డీఈ, ఏలేరు నిర్వహణ విభాగం

గత ఏడాది వరదలతో ముంపునకు గురైన  గొల్లప్రోలులోని ఎస్సీపేట 

గొర్రిఖండి కాలువలో సాగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన పూడిక మేట

 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.