close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

అంతటా అక్రమాల ఊడలు

నిధులు బొక్కేయడంతో కుదేలవుతున్న సొసైటీలు

● సహకార సంఘాలకు నష్టాల ఉసురు

న్యూస్‌టుడే, ఆలమూరు : రైతులకు తక్కువ వడ్డీకి పెట్టుబడి సాయం అందించే సహకార సంఘాలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని సొసైటీలు అక్రమాల కారణంగా కోలుకోలేని విధంగా దెబ్బతినగా.. మరికొన్ని మొండి బకాయిలతో వెనుకబాటులో ఉన్నాయి. కొంతమంది అక్రమార్కులు నిధులను బొక్కేయడం, వాటిని లోసకాలంలో గుర్తించి చర్యలు చేపట్టలేకపోవటానికి తోడు బినామీల పేర్లతో నిధులు కాజేస్తుండటం.. వారి నుంచి రికవరీ పటిష్టంగా చేయకపోవడంతో చాలాచోట్ల గడ్డు పరిస్థితి నెలకొంది. జిల్లాలో 298 సహకార సంఘాలుంటే అందులో 178 మంది మాత్రమే లాభాల్లో ఉన్నాయి. 120 సొసైటీలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వచ్చిన తర్వాత కమీషన్ల రూపంలో సొసైటీలకు రూ. లక్షలాది ఆదాయం సమకూరుతోంది. ఒక్కో బస్తాకు రూ.32లు చొప్పున ఆదాయం వస్తుండడంతో కొన్ని లాభాల బాట పట్టాయి. రాష్ట్ర సగటుతో పోలిస్తే ఇప్పటికీ జిల్లాలో నష్టాల్లో ఉన్నవే ఎక్కువ. రాష్ట్రంలో మొత్తం 2,051 సొసైటీలు ఉండగా అందులో 1240 లాభాల్లోనూ, 811 నష్టాల్లో ఉన్నాయి. పక్క జిల్లా పశ్చిమ గోదావరితో పోలిస్తే మన జిల్లా పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పశ్చిమలో మొత్తం 265 సొసైటీలు ఉండగా అందులో 230 లాభాల్లో ఉన్నాయి. నష్టాల్లో ఉన్నవాటి సంఖ్య కేవలం 35 మాత్రమే. దీంతో మన జిల్లాలో నష్టాల్లో ఉన్న వాటి సంఖ్య మూడు రెట్లు ఉంది. డీసీసీబీలు సొసైటీలకు 5.75 శాతం వడ్డీకి రుణాలిస్తాయి. సొసైటీలు రైతులకు 7 శాతం వడ్డీకి మంజూరు చేస్తాయి. దీనిప్రకారం సొసైటీలకు 1.25 శాతం వడ్డీ రూపంలో మిగిలాల్సి ఉంది. సొసైటీలకు ఈ ఏడు శాతం సొమ్ము కేంద్ర ప్రభుత్వం నుంచి 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4 శాతం రావాల్సి ఉంది. అక్కడి నుంచి వచ్చినా రాకపోయినా సెంట్రల్‌ బ్యాంకు సొసైటీల వద్ద వసూలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన 4 శాతం వడ్డీ సొమ్ము మూడేళ్లుగా మంజూరు చేయడం లేదు. ఈ పరిస్థితి కూడా సొసైటీలు నష్టాల్లో చిక్కుకోవటానికి కొంత కారణమవుతోంది.

నష్టాలకు కారణాలు..

సాధారణంగా సొసైటీలు నష్టాలబారిన పడవు. సెంట్రల్‌ బ్యాంకు నుంచి తెచ్చే వడ్డీకి, రైతుల వద్ద నుంచి వసూలు చేసే వడ్డీకి మధ్య

తేడా వీటికి ఆదాయ వనరులుగా ఉంటాయి. కొన్ని పాలకవర్గాలు, కొందరు ఉద్యోగుల్లో దోపిడీ, మోసం, బినామీ రుణాలు తదితర కారణాలతో చాలా వరకు నష్టాల్లోకి వెళ్లాయి. అక్రమాలకు పాల్పడిన వారికి కఠిన చర్యలు లేకపోవటం, రికవరీ సరిగా చేయకపోవటంతో సమస్యలు ఎదురవుతున్నాయి.

ప్రత్తిపాడు మండలంలోని లంపకలోవ సొసైటీలో ఇటీవల రూ.20 కోట్ల బినామీ రుణాలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 497 బినామీ ఖాతాల ద్వారా ఈ నిధులు కాజేశారు. 51 ఎంక్వైరీ జరిగినా చర్యలు లేవు.

రాయవరం మండలంలో 9 సొసైటీలకు ఎనిమిది లాభాల్లో ఉండగా ఒక్క వెదురుపాక సొసైటీలో 2005-06 సంవత్సరంలో రూ. మూడు కోట్ల మేర అక్రమాలు జరగటంతో ఇప్పటికీ అవి వెంటాడుతున్నాయి.

ఆలమూరు మండలం చొప్పెల్ల సొసైటీలో రూ.కోటికి పైగా అక్రమాలు జరిగాయి.

ఆత్రేయపురం మండలంలోని 8 సొసైటీల్లో లొల్ల మినహా మిగిలిన ఏడు నష్టాల్లో ఉన్నాయి. ఇందులో ఒక సొసైటీలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

రాజానగరం, రంగంపేట తదితర మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ సొసైటీలు నష్టాల్లో ఉన్నాయి. కొన్నింటిలో సిబ్బంది నియమాలను ఉల్లంఘించి ఎక్కువ నిధులను జీతాలుగా తీసుకోవటం, ఖర్చులు చేయటం కూడా నష్టాలకు కారణమైంది. బుక్‌ ఎడ్జస్ట్‌మెంట్‌ విధానం అమలు చేయడం, రైతుల నుంచి రుణాలు సరిగా వసూలు చేయకపోవటంతో గతి తప్పాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న వాటికి గతేడాది కాలంగా కమీషన్‌ సొమ్ములు ప్రభుత్వం విడుదల చేయలేదు.

నష్ట నివారణ చర్యలు చేపడితేనే..

సిబ్బందికి తగిన శిక్షణ, జవాబుదారీతనం పెంచటంతోపాటు క్రమం తప్పకుండా తనిఖీలు, ఆడిట్‌ చేయిస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశముంటుంది. సభ్యులైన రైతులకు పంట రుణాలు ఇవ్వటం, సమర్థంగా వసూలు చేయడంతో పాటు ఇతర సేవలు అందించటం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేలా తీర్చిదిద్దాల్సిన అవసరముంది. పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అమ్మకాలను సొసైటీల ద్వారా

సాగిస్తే స్వయంప్రతిపత్తి సాధించే అవకాశముంది. అక్రమాలకు పాల్పడిన వారిపై సకాలంలో కఠినచర్యలు చేపడితే మిగిలినవారికి హెచ్చరిక అవుతుంది.

గట్టెక్కించటానికి చర్యలు

నష్టాల్లో ఉన్న సొసైటీలను బయటకు తీసుకురావటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కమిటీలు వేసి డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకుంటున్నాం. లంపకలోవ సొసైటీపై విచారణ జరిగింది. నివేదిక డీసీవోకు ఇవ్వాల్సి ఉంది. సొసైటీల్లో అక్రమాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దోషులెవరైనా రికవరీ చేస్తాం- పి.ప్రవీణ్‌కుమార్‌, ఇన్‌ఛార్జి సీఈవో, డీసీసీబి, కాకినాడ

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.