close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

ప్రగతి రథం.. తూర్పూపథం

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

గణతంత్ర దినోత్సవంలో భాగంగా కాకినాడలోని పోలీసు  కవాతు మైదానంలో జాతీయ 
పతాకాన్ని ఎగురవేస్తున్న  కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి 

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌  : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందరి సహకారంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఉద్ఘాటించారు. కాకినాడలోని పోలీసు కవాతు మైదానంలో ఆదివారం నిర్వహించిన 71వ భారత గణతంత్ర దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన  తరువాత ఆయన ప్రసంగించారు. భారతరత్న బీఆర్‌ అంబేడ్కర్‌ అందించిన సర్వోత్తమ రాజ్యాంగంతో దేశంలో సర్వసత్తాక, ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన రోజును పురస్కరించుకుని గణతంత్ర వేడుకలను జాతి యావత్తూ పర్వదినంగా జరుపుకొందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఉన్నత ప్రమాణాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్న పథకాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. జిల్లాలో అర్హులందరికీ పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం 
జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకాల ద్వారా జిల్లాలో 4.13 లక్షల మందికి రూ. 307 కోట్ల ఆర్థిక సహాయం అందించిందని చెప్పారు. దీనిలో 15,562 మంది కౌలు రైతులకు రూ. 17 కోట్లు చెల్లించామన్నారు. 3.87 వేల మంది ఉచిత పంట బీమా పథకంలో నమోదయ్యారని తెలిపారు. ప్రస్తుతం రబీ సాగు ఆశాజనకంగా సాగుతోందన్నారు. 700 వ్యవసాయ సహాయకుల పోస్టులను భర్తీ చేశామన్నారు. వచ్చే నెలలో 300లకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 1.78 హెక్టార్లలో ఉద్యాన పంటలు విస్తరించి ఉన్నాయని, వీటి అభివృద్ధికి యాంత్రీకరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. బిందు, తుంపర సేద్యాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. మాంసం ఉత్పత్తిలో రెండో స్థానం, పాల ఉద్పాదకతలో వ΄డో స్థానంలో నిలిచామన్నారు. పాలిచ్చే పశువులు మరణిస్తే బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, జిల్లాలో 15.30వేల మంది రైతులకు పరిహారం చెల్లించామన్నారు. వేట నిషేధ సమయంలో 22,708 మంది మత్స్యకారులకు రూ. 22.70 కోట్ల పరిహారం అందించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మత్స్య సంపదలో 75 శాతం ఉత్పత్తి సాధించామని వివరించారు. 
విద్యతోనే అభివృద్ధి 
పేదరికంతో ఎవరూ విద్యకు దూరంగా ఉండకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పటి వరకు జిల్లాలో 4,57,222 మంది విద్యార్థుల తల్లులు, సంరక్షకులకు రూ. 685.83 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా తొలి విడతలో 1,382 పాఠశాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దశల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలోని 4,268 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక మెనూను అమలు చేస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 24,591 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని చెప్పారు.
వైద్యం, ఆరోగ్యానికి పెద్దపీట 
రాష్ట్ర ప్రభుత్వం వైద్యం, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని వెల్లడించారు. ఈ ఏడాది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.137.58కోట్ల ఖర్చులో వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేయించామన్నారు. రోగులు కోలుకోవడానికి నెలకు రూ. 5 వేలు చెల్లిస్తున్నామన్నారు. డయాలసిస్, తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫిలియా వ్యాధిగ్రస్థులకు నెలకు రూ. 10 వేలు, పక్షవాతం, కండరాల, క్షీణత , వ΄త్రపిండాలు, కాలెయం, గుండె వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. అయిదు వేలు చొప్పున పింఛను అందిస్తున్నామన్నారు. లెప్రసీ వ్యాధిగ్రస్థులకు నెలకు రూ. 3 వేలు పింఛను ఇస్తున్నామన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా ఇప్పటి రెండు దశల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. 10,374 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామని, 4,405 మందిని వివిధ పరీక్షలకు గుర్తించామని తెలిపారు. నాడు-నేడు పథకం ద్వారా ఆసుపత్రులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
సంక్షేమమే లక్ష్యం 
జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగ, కాపు, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థుల విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తోందన్నారు. ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. బీసీ సామాజిక వర్గీయుల్లో చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామన్నారు.కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల్లో 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. 1,605 మంది భవన నిర్మాణ కార్మికులకు వివిధ సహాయాలు కింద రూ.3.13కోట్లు చెల్లించామన్నారు. వాహన మిత్ర పథకం ద్వారా జిల్లాలో 25,745 మందికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. దివ్యాంగుల శాఖ ద్వారా 1,750 మందికి రూ.3.59కోట్లు మేర ఉపకార వేతనాలు, ఆర్థిక సహాయాలు పంపిణీ చేశామన్నారు. నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యం కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు.
అందరికి ఆవాసం 
జిల్లాలో పేదలందరికి గృహ వసతి కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఉగాది నాడు జిల్లాలో 2.97 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనికోసం 4,460 ఎకరాల భూమి అవసరమని గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 1,666 ఎకరాలు గుర్తించామని, మిగతా భూములు సేకరిస్తామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి, గృహవసతి కల్పిస్తామని తెలిపారు. జిల్లాకు 61,591 గృహాలు మంజూరయ్యాయని, ఒక్కో óŸ΄నిట్‌ రూ. 1.50 లక్షల చొప్పున రూ. 923.86 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు.
త్వరలో కొత్త బియ్యం కార్డులు 
నవశకం పథకం కింద త్వరలో పేదలకు బియ్యంకార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఏప్రిల్‌ నుంచి ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. త్వరలో కొత్త రేషన్‌కార్డులు కూడా జారీ చేస్తామన్నారు. రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు.ఇప్పటి వరకూ 74,352 మంది రైతుల నుంచి 8.36 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని, దీనికి గాను రైతు బ్యాంకు  ఖాతాలకు రూ. 1,516 కోట్లు చెల్లించామన్నారు.
పేద కుటుంబాలకు ఉపాధి 
జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పేద కుటుంబాలకు పని కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 1.56 కోట్ల పనిదినాలు కల్పించి, రూ. 208 కోట్లు వేతనాలు కల్పించామన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 638 గ్రామ సచివాలయ భవనాలు, 262 అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మాణం చేస్తున్నామన్నారు. రూ. 282 కోట్లతో 1,316 సీసీ డ్రెయిన్లు, రూ.242 కోట్లతో 542 కి.మీ. 
సీసీ రోడ్లు, రూ. 87 కోట్లతో ఇళ్ల స్థలాలను ఎత్తు చేసే పనులు చేపడుతున్నామని చెప్పారు. రూ. 60 కోట్లతో 1,284 పాఠశాలలకు ప్రహరీలు నిర్మాణం చేస్తున్నామని వివరించారు. 
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం 
వివిధ ఇంజినీరింగ్‌ శాఖల ద్వారా జిల్లాలోని ప్రజలకు మౌలిక వసతలు కల్పించడానికి చర్యలు చేపట్టామన్నారు. 43 ఆవాసాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి రూ. 20.44 కోట్లతో నాలుగు రక్షిత మంచినీటి పథకాలు చేపట్టామన్నారు. విద్యుత్తు సరఫరా లేని ఏజెన్సీ ప్రాంతంలోని ఆవాసాల్లో 32 సోలారు డ్యూయల్‌ పంపులు ఏర్పాటు చేశామన్నారు. రూ. 4,000 కోట్ల ప్రతిపాదనలను వాటర్‌ గ్రిడ్‌ కోసం ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా 781.80 కి.మీ మేర రహదారుల అభివృద్ధి, నిర్వహణకు రూ.1,631 కోట్లతో 202 పనులు చేపట్టామని వెల్లడించారు. కాకినాడలో ఉప్పుటేరుపై రూ.116.20కోట్లతో వ΄డో వంతెన నిర్మాణం చేస్తామన్నారు. దీనికి భూసేకరణ పూర్తయిందన్నారు. పంచాయతీరాజ్‌శాఖ ద్వారా రూ. 32 కోట్ల నాబార్డు నిధులతో 22 రహదారుల పనులు చేపట్టగా, 13 పూర్తయినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంలో పెద్ద సంఖ్యలో రహదారులు, మురుగునీటి కాలువలు, అంగన్‌వాడీ, సచివాలయ భవనాలు నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్తు సరఫరాలో నష్టాలను నివారించేందుకు రూ. 26.48 కోట్లతో పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించినట్లు తెలిపారు. గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు చేపడుతున్నామన్నారు. ఏలేరు ఆధునికీకరణ పనులకు కూడా చర్యలు చేపట్టామన్నారు. ఎత్తిపోతల పథకాలు, వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను కలెక్టర్‌ వివరించారు. ఇసుక సరఫరాకు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. దశలవారీగా మద్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. స్పందన ప్రజా సమస్యల పరిష్కారం ద్వారా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి రాయితీలు కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. క్రీడల ద్వారా జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది కాలంలో సాధించిన పతకాలను ఆయన వివరించారు.

వేడుకల్లో అలరించిన  ఎటపాక కేజీబీవీ విద్యార్థినుల 
జానపద నృత్యం 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.