close

శనివారం, మార్చి 28, 2020

ప్రధానాంశాలు

తీరంలో సమీకృత సేవలు

జిల్లాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 10 మండలాల్లో పరీక్ష కేంద్రాలు


కాకినాడలోని మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కార్యాలయం

కాకినాడ, ఈనాడు : వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలతో పాటు రైతుల్లో భరోసా నింపి వారి శ్రమకు ఫలితం దక్కే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రైతు విజ్ఞాన కేంద్రాలను ..మిగతా 7లో అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ కేంద్రాల్లో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల సేవలనూ క్షేత్రస్థాయికి చేరువ చేయనున్నారు. రాష్ట్ర మత్స్య శాఖతో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఆక్వా కల్చర్‌ (సిఫా) కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని తొమ్మిది తీర ప్రాంత జిల్లాల్లో 46 సమీకృత పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో 10 కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో నీరు, మట్టి విశ్లేషణలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు సేవలతో పాటు చేపల మేత విశ్లేషణ, రసాయనాల వినియోగంతో అనర్థాలు, క్రోమోజోముల సేవలు అందుబాటులో ఉండే రెండు కేంద్రాలు మంజూరు కాగా..అందులో ఒకటి కాకినాడలోని రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్‌ఐఎఫ్‌టీ)లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 161 కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం విస్తరించి ఉంది. తీరంలో 13 మండలాలు ఉండగా.. వీటి పరిధిలో 99 మత్స్యకార గ్రామాలున్నాయి. మత్స్యకార జనాభా 3.03 లక్షలుగా ఉంది. సముద్రంలో వేట సాగించే వారు 62 వేలు మంది వరకు ఉన్నారు. సొసైటీలో నమోదై వేట సాగించే ఎస్సీలు 300, ఎస్టీలు 1500 మంది ఉన్నారు. జిల్లాలో రొయ్యలు, చేపల చెరువులు 20 వేల హెక్టార్లకు పైగా సాగవుతోంది. జలాశయాలు, చిన్న- మధ్యతరహా ప్రాజెక్టులు, గ్రామ పంచాయతీల పరిధిలోని 25,522 చెరువుల్లో వివిధ రకాల చేపల పెంపకం సాగుతోంది. గుర్తించిన చేపల విక్రయ కేంద్రాలు 30 వరకు నడుస్తున్నాయి. నీటి, మేతల్లో నాణ్యత, వ్యాధులతో పాటు యాజమాన్య పద్ధతులపై సరైన అవగాహన లేకపోవడంతో దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా మత్స్యశాఖ సేవలూ అందుబాటులోకి రానున్నాయి.

సేవలు మరింత విస్తృతం

జిల్లాలో 310 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. వీటిలో 270 కేంద్రాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మిగిలిన వాటిని ఈనెల 25 నాటికి సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాలకు అనుసంధానంగా తొండంగి, ఉప్పాడ, తాళ్లరేవు, అమలాపురం, రాజోలు, అయినవిల్లి, ఆత్రేయపురం, మండపేట, కాజులూరు మండలాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ల్యాబ్‌లు సైతం ఏర్పాటు చేస్తారు. ఒక్కో ల్యాబుకు రూ.కోటిపైనే వెచ్చించి పరీక్ష సామగ్రి, ఇతర వసతులు, ఆపరేషన్‌ బృందాలను అందుబాటులోకి తేనున్నారు. చాలా సంవత్సరాలుగా కాకినాడ కేంద్రంగా రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్‌ఐఎఫ్‌టీ) సేవలు అందిస్తోంది. ఇక్కడి రొయ్యలు, చేపల వ్యాధి నిర్ధారణ కేంద్రంలోనే తీర ప్రాంతంలోని అన్ని జిల్లాలకు చెందిన పీసీఆర్‌ పరీక్షలతో పాటు సీడ్‌ నాణ్యత, బ్యాక్టీరియా పరీక్షలు, నీరు, మట్టి, మేత పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీన్ని రిఫరల్‌ ల్యాబుగా మరింత అభివృద్ధి చేయనున్నారు. దీంతో పాటు ఒక్కో సమీకృత పరీక్ష కేంద్రాల అభివృద్ధికి జిల్లాలో రూ.కోటికి పైగా వెచ్చించనున్నారు.

రైతులను చైతన్య పరిచేందుకు దోహదం

సాంకేతికత ఆధారంగా రైతులకు నాణ్యమైన సేవలు అందించేందుకు నాలెడ్జ్‌ సెంటర్లుగా రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఈ కేంద్రాలకు అనుసంధానంగా రాష్ట్రంలో 46 చోట్ల మత్స్య శాఖ ఇంటిగ్రేటెడ్‌ ల్యాబులను రూ.56 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో జిల్లాలో 10 ల్యాబులు ఏర్పాటవుతాయి. ఇక్కడి ఎస్‌ఐఎఫ్‌టీ ల్యాబ్‌ అప్‌గ్రేడ్‌ కానుంది. ఇవి అందుబాటులోకి వస్తే రొయ్యలు, చేపలకు సంబంధించిన వ్యాధులపై అధ్యయనంతో పాటు నీటి, మట్టి, మేత విశ్లేషణలు, రసాయనాల వాడకం ద్వారా ఎదురయ్యే అనర్థాలను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు రైతులను చైతన్యపరిచేందుకు వీలుంటుంది. - పి.కోటేశ్వరరావు, ప్రిన్సిపల్‌, రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్‌ఐఎఫ్‌టీ)

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.