close

సోమవారం, ఏప్రిల్ 06, 2020

ప్రధానాంశాలు

చేతలు చిన్నగా విలువలు గొప్పగా...

పిల్లలను ఉన్నతంగా ఎదగనిద్దాం
అనుభవం నిండా పాఠాలే

పాఠశాలలో నిజాయతీ దుకాణంలో 
వస్తువు తీసుకొని డబ్బులు పెట్టెలో వేయాల్సిందే.. 

పిల్లలు అద్భుతాలు.. నేలపై నక్షత్రాలు. వీరు ఎలా నేర్వాలి?
ఎలా ఎదగాలి? రెండు అట్టల మధ్య పుస్తకంలోంచి, తరగతి నాలుగు గోడల మధ్య నుంచి దేశానికి విలువైన వనరులుగా పరిచయం అవ్వాలి. వ్యక్తి, శీల నిర్మాణానికి దోహదపడేది, తనకాళ్లపై తాను నిలబడగలిగేలా చేసేదే అసలైన విద్య అంటారు స్వామి వివేకానంద. ఎన్ని సూక్తులు పిల్లల ముందు వల్లెవేసినా, వారిలో ఉండే విలువలను చాటుకొనేలా చిన్న ప్రయత్నాలతో ప్రోత్సహించడమే పెద్దల బాధ్యత. అది బడిలో అయినా, ఇంట్లో అయినా!!


అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఒంటిని శుభ్రంగా ఉంచుకోవడం నుంచి పర్యావరణానికి హితంగా మెలగడం వరకూ బడి వాకిట్లో మొక్కనాటి నీరు పోయడం నుంచి క్రమశిక్షణతో నలుగురికీ నీడనిచ్చే చెట్టులా ఎదగడం వరకూ చిన్నపాటి అనుభవాలు, ఆచరణనే దోహదపడతాయి. ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తాయి. జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. పిల్లలు అడిగింది ఇచ్చేయడమే కాదు..కష్టసుఖాలను సునాయాసంగా తీసుకొనేలా మలచాలి. పాఠశాలలు చదువుల సరదాలయాలుగా..గృహాలు వికాస వనాలుగా నిలపాలి.

 

ఓ రోజు క్షేత్రానికి..
పిల్లలకు వారానికో రోజు సెలవు ఉంటుంది. సెలవునాడు పుస్తకాలు, హోంవర్కులతో కుస్తీపట్టనీయకుండా, టీవీలు, చరవాణిలతో దోస్తీ కట్టనీయకుండా క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లవచ్చు. ఇందుకు భారీ ప్రణాళికలే అక్కర్లేదు. నిత్యావసర వస్తువుల దుకాణానికి తీసుకెళ్లడం నుంచి పొలంలో జరిగే పనులు, కుటీర పరిశ్రమలు, అవగాహన కలిగించాల్సిన వ్యాపకాలను చూపించొచ్చు. జిల్లాలో ఇలా అనుభవ పాఠాలు నేర్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పాఠశాలల్లో న్యోబ్యాగ్‌డే.. అంటూ చేసే ప్రయత్నం క్షేత్రఅధ్యయనంలో భాగం చేయొచ్చు. తరగతి నాలుగు గోడలు, ఇంట్లో నాలుగు గదులు బయట ఉన్న ప్రపంచాన్ని నేర్చేలా చేయాలి.

 

ఇదో నిజాయతీ పాఠం..

కాజులూరు శ్రీరామ్‌నగర్‌ కాలనీ ప్రాథమిక పాఠశాలలో నిజాయతీ దుకాణం ఉంది. పెన్ను కావాలన్నా, పెన్సిల్‌ కావాలన్నా మరో సామగ్రి కావాలన్నా ఆ దుకాణం వద్దకు వెళ్తారు. తాము తీసుకొనే వస్తువు ఖరీదును అక్కడున్న పెట్టెలో వేస్తారు. కావలసిన పెన్ను కోసం పక్కవాడిని అడగడమో, మరో ప్రయత్నమో చేయకుండా.. నిజాయతీగా వస్తువును సమకూర్చుకుంటున్నారు. ఉన్న వనరులను ఒబ్బిడిగా వాడుకోవాలనే భావన అలవడుతుంది. ఇదే పాఠశాలలో చాక్లెట్‌ బాక్స్‌ మరో ముచ్చట. పుట్టినరోజు వేడుకలు జరిగినపుడు ఎవరైనా చాక్లెట్‌ హితం కానివాళ్లు, ఒకటి తిని ఒకటి దాచుకొనేవారు ఆడబ్బాలో వేస్తారు. వాటిని ఎవరైనా తీసుకోవచ్చు.

 

సేవ.. జీవితాంతం ముచ్చటగా..

పాఠశాలల్లో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, స్కౌట్, గైడ్‌ల తర్ఫీదులో పిల్లలుండేలా చూడాలి. జిల్లాలో ఇప్పటికీ పలుపాఠశాలల్లో ఈ శిక్షణ విజయవంతంగా నడుస్తోంది. ఉత్సవాలు, వేడుకల్లో వారి స్వచ్ఛంద సేవలు ముచ్చటవుతాయి. సాటివారికి ఉపకారంగా మెలగాలనే ధోరణితో పాటు సేవ చేయడానికి డబ్బే ప్రధానం కాదు సమయం, సన్నద్ధత ఉండాలనే అనుభవపాఠం జీవితాలను ఉన్నతంగా మలుస్తుంది.

బడి వాకిట్లో ఆనప.. ఇంటి పెరడును పోషకవనంగా

మార్చుకొనే అనుభవ పాఠం 

పోషకవనం.. పెద్ద అనుభవమే

బడి వాకిలి ఎంత ఉన్నా శుభ్రంగా, ఆహ్లాదంగా, ఉపయుక్తంగా తీర్చిదిద్దుకోవడం చిన్నారికి విశేషమైన అనుభవాలను భావిజీవితంలోనూ కొనసాగించేలా చేస్తుంది. బడి ఆవరణను స్వచ్ఛంగా తీర్చిదిద్ది పోషకాహార వనంగా మార్చుకుంటే పెరటి తోటల పెంపకం చిరకాల ఆచరణగా మిగిలిపోతుంది. బడిలో కలిసికట్టుగా పనిచేసిన బృంద స్ఫూర్తి ఉద్యోగం సాధించడం నుంచి నలుగురినీ జతచేసుకొని వెళ్లడం వరకు దోహదపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, సాగు పద్ధతులు, నైపుణ్యంతో ఇంటి పెరడును, వీధిని శుచిగా, ఉపయుక్తంగా మలచుకొనే నేర్పు వస్తుంది.

 

ఆర్థిక తంత్రం అబ్బేలా...

బడిలో సంచయిక..పొదుపు అనుభవానికి తెచ్చే పాఠం. ఇంట్లో పెద్దలు ఇచ్చిన డబ్బును బడిలో దాచుకోవడం. చాక్లెట్టో, రబ్బరో మరోటో ఉన్నంతలోనే కొనుక్కోవడం స్వావలంబన అనే పదం తెలియకపోయినా చిన్నారుల్లో కనిపిస్తుంది. అవసరానికే ఖర్చు చేయడం జీవితంలోనూ ఆచరించేలా చేసే ఆర్థిక తంత్రంగానూ అలవడుతంది. గారాబంతోనో, పిల్లల ముచ్చట తీర్చాలనో పిల్లల చేతికి డబ్బులు ఇవ్వడం వారు తోచినట్టు ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ తప్పుతుంది. జిల్లాలో కొన్ని పాఠశాలలు ఈ ప్రయత్నం చేస్తున్నాయి.

 

తరచి చూస్తే..

జిల్లా వనరుల ఖిల్లా..అనుభవైక బోధనకు అనువైన పరిస్థితులు బడి చుట్టూ ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు 6వేలకు పైగా ఉన్నాయి పాఠ్యప్రణాళికలు, పరీక్షలు, మూల్యాంకనాలు సరే. స్వీయ అనుభవంతో నేర్చుకునే పాఠాలు, విలువలు, నైపుణ్యాలు ఎన్నో ఉన్నాయి. పిల్లల వెనక ఉండి చూస్తే చాలు. అవకాశాలను సోపానాలుగా చేసుకొని ప్రతి చిన్నారి బాధ్యతాయుతమైన పౌరుడుగానే ఎదుగుతాడు.

* బడిలో వసతులు లేనపుడు, అవసరమైన వనరులు లేనపుడు అధిగమించేందుకు చేసే చిన్న ప్రయత్నాలూ విలువైనవే! పెద్దమనసుతో జీవితాంతం ఎదిగేలా స్ఫూర్తిని నింపుతాయి. సర్దుబాటు ధోరణిని, విశాల దృక్పథాన్ని నేర్పేస్తాయి.

* బళ్లో, ఇంట్లో పెద్దలకు చేదోడుగా ఉంటూ ఎన్నో పనులు చక్కపెడుతుంటారు. పిల్లల్లోని నిర్వహణ నైపుణ్యాలను మెచ్చుకుంటే వారు చేసే ప్రయత్నాలకు అనుభవంగా ఉంటాయి.

 

అందుకే ఫిన్‌లాండ్‌ బెస్ట్‌!
పేద, ధనిక అంతర అతి తక్కువ కలిగిన దేశాల్లో ఫిన్‌లాండ్‌ ఒకటి. అవినీతి రహితమైన మొదటి పది దేశాల్లోనూ ఫిన్‌లాండ్‌ నిలుస్తోంది. చదువు.. అది నేర్పిన విలువల ఫలితం. ఇక్కడ పాఠశాలలన్నీ ఉత్తమ ప్రమాణాలతో ఒకేలా ఉంటాయి. మార్కులు ముఖ్యం కాదు. నేర్వడమే ప్రాధాన్యం. ఇక్కడ పరీక్షల ఫలితాలను ఉపాధ్యాయుల బోధనను మెరుగుపరచుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు. పాఠశాల పనిదినాలు గరిష్ఠంగా 180 రోజులు మాత్రమే. పిల్లలు స్వీయ అనుభవంతో అభ్యసించేలా అవకాశాలు కల్పించడం, క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్లడం, తరగతిలో ఉన్నపుడు ప్రతి చిన్నారీ క్రియాశీలకంగా ఉండేలా చూడడమే ఫిన్‌లాండ్‌ చదువులసారం. అందుకే వివిధ దేశాల విద్యార్థుల నాణ్యతను తెలిపే పీసా (పి.ఐ.ఎస్‌.ఏ-ప్రోగ్రాం ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఎసెస్‌మెంట్‌) పరీక్షలో ఈ దేశ విద్యార్థులు మొదటి పది స్థానాలను వదలరు.

వ్యాయామం ఉండాలిలా..

ప్రత్తిపాడులోని వసతి గృహంలో 

వ్యాయామం

చిన్నపుడు ఆసనాలు వేయమంటే ఉత్సాహంగా వేస్తారు. రోజూ ఆప్రయత్నం చేయిస్తుంటే జీవనశైలిగా మారిపోతుంది. కొన్ని పాఠశాలల్లో, వసతి గృహాల్లో విద్యార్థులచేత వ్యాయామం చేయిస్తున్నారు. శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వానికి దోహదపడుతుందని ప్రతి చిన్నారులు మున్ముందూ ఆచరణలో ఉంచుతారు.

 

ఆట తత్వం అలవడవలె!

ప్రతి ఒక్కరూ పతకాలకే పోటీ పడక్కర్లేదు. రాష్ట్రజాతీయ స్థాయిలోనే రాణించాల్సిన అవసరం లేదు. ప్రతి విద్యార్థి క్రీడల్లో భాగస్వాములవ్వాలి. కనీసం ఒక క్రీడనైనా ఇష్టంగా ఆడగలగాలి. క్రీడాస్ఫూర్తి ఉంటే గెలుపు ఓటములను సమతలంగా భావించి భావి జీవితంలో పరుగెత్తే నేర్పు ఎవరూ బోధించకుండానే వంటపడుతుంది. మార్కులు, ర్యాంకులు, ఉజ్వత భవిష్యత్తులు ప్రమాణాలుగా పెట్టి జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఏడాదికోమారు జరిగే స్పోర్ట్స్‌డేలకే సరిపెడుతున్నారు. క్రీడలను కంటితో ఆస్వాదించడానికే పరిమితం చేస్తున్నారు.

 

గలగలా.. సభాపిరికి పోయేలా..

పాఠశాలల్లో ప్రతి రోజూ ఉదయం అరగంట పాటు మొదటి పిరయడ్‌ను ఆనందవేదికగా నిర్వహించమని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ సమయం పాఠశాలలో మిగతా సమయాన్ని సద్వినియోగం చేసుకొనేంతగా వికాసం నింపాలి. సభాపిరికి పోయేలా గలగలమంటూ ఉండేలా చూడాలి. దీనివల్ల ఉపాధి సాధనలో, ఉద్యోగ, కుటుంబ జీవనంలో సభాపిరికిని పోగొడుతోంది.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.