close

గురువారం, ఏప్రిల్ 02, 2020

ప్రధానాంశాలు

భిక్షాటనలో బాల్యం

జిల్లాలో పలుచోట్ల యాచక వృత్తిలో చిన్నారులు
వలస వచ్చి ఈ దిశగా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు
యంత్రాంగం పునరావాసం కల్పిస్తున్నా కానరాని ప్రయోజనం

సామర్లకోటలోని సాయినగర్‌ ప్రాంతంలో గుడారాల వద్ద

ఉంటున్న వలస కుటుంబాల పిల్లలను

విచారిస్తున్న బాలల సంరక్షణ అధికారి

అమ్మ.. నాన్నల కలల రూపాలు పసిబిడ్డలు.. ఎంత కష్టం వచ్చినా కన్నబిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న తపన కొందరిది.. తాము ఎంత దారిద్య్రంలో ఉన్నా కూలి పనులు అయినా చేసి కనుపాపలకు ఏలోటూ రాకుండా పెంచాలన్న సంకల్పం ఇంకొందరిది.. కానీ అమూల్యమైన బాల్యాన్ని కొందరు భిక్షాటనకు పరిమితం చేస్తున్న తీరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.నెలలు నిండని పసిబిడ్డలను చంకన ఎత్తుకుని కొందరు భిక్షాటన చేస్తుంటే.. ముక్కుపచ్చలారని చంటి బిడ్డలను అడ్డం పెట్టుకుని మండుటెండలో బిచ్చమెత్తుకుంటున్న వారు ఇంకొందరు ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి దీనికి అలవాటుపడుతున్న చిన్నారులు భవిష్యత్తులో విద్యకు దూరమై నేరచరితులుగా మారుతున్న పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.

కాకినాడ, ఈనాడు

జిల్లాలో వివిధ ప్రాంతాలకు పొరుగు జిల్లాల నుంచి వలస వస్తున్న కుటుంబాల్లో చంటి పిల్లలు ఎక్కువగా ఉండడం..వారంతా రద్దీ ప్రాంతాలు, ఆలయాల ఆవరణ, వీధుల్లో తిరుగుతూ బిచ్చమెత్తుకుంటున్న తీరు కలవరపరుస్తోంది. దీని నియంత్రణకు మహిళాభివృద్ధి- శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సమగ్ర బాలల పరిరక్షణ విభాగం (ఐసీపీఎస్‌), విద్యా శాఖకు సంబంధించి సమగ్ర శిక్ష విభాగాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు లభించడం లేదు. ఇటీవల ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ పేరుతో పోలీసు శాఖ వీధి బాలల వ్యవహారంపై దృష్టి సారించింది. వీరి పరిశీలనలో వందలాది మంది బడిబయట, యాచక వృత్తిలో కొనసాగుతున్న బాలలను గుర్తించారు. కాకినాడ పరిధిలోని మాధవపట్నం, వాకలపూడి తదితర ప్రాంతాలతోపాటు రాజమహేంద్రవరంలోని క్వారీ ఏరియా, సామర్లకోటలోని సాయినగర్‌లలో భిక్షాటన చేస్తున్న పిల్లలు ఎక్కువగా తారసపడుతున్నారు. అమలాపురం, కాట్రేనికోన, కరప మండలాల పరిధిలోనూ ఈ జాడలు ఎక్కువగానే ఉన్నాయి. అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ప్రకాశం జిల్లాలోని అద్దంకి, చీరాల తదితర ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లా వినుకొండ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, కొవ్వూరు, పాలకొల్లు తదితర ప్రాంతాల నుంచి పసిపిల్లలను జిల్లాకు తీసుకొస్తూ వారితో తల్లిదండ్రులే భిక్షాటన చేయిస్తున్నట్లు గుర్తించారు. మూడు, నాలుగు నెలలపాటు ఒకచోట ఉంటూ గుడారాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న వలస కుటుంబాల్లో పెద్దలు వివిధ పనులకు వెళ్తూ పిల్లలను యాచక వృత్తి దిశగా ప్రోత్సహిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది.

 

మళ్లీ మొదటికే..
* ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు గత ఏడాది సెప్టెంబరు 6 నుంచి పలు దశల్లో నిర్వహించిన సోదాల్లో పలువురు బడిబయట పిల్లలను గుర్తించారు. జిల్లాలోని వివిధ పనిప్రాంతాలు, కర్మాగారాలు, పార్కులు, బస్టాండ్లు, సినిమాహాళ్లు తదితర పాంత్రాల్లో నిర్వహించిన సోదాల్లో 191 మంది చిన్నారులను గుర్తించారు. వీరిలో 174 మంది బాలురు, 17 మంది బాలికలు ఉండడం గమనార్హం. 168 మందిని తల్లిదండ్రులకు అప్పగించగా.. 23 మందిని బాలల సôరక్షణ కేంద్రాల్లో చేర్పించారు. పోలీసులు గుర్తించిన పిల్లల్లో 176 మంది మన రాష్ట్రానికి చెందినవారు కాగా 15 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం గమనార్హం.
* సమగ్ర బాలల పరిరక్షణ విభాగం ఇప్పటి వరకు భిక్షాటన నుంచి 184 మంది పిల్లలను కాపాడింది. గత ఏడాది 92 మంది పిల్లలను గుర్తించగా.. ఈ సంవత్సరం అమలాపురం డివిజన్‌లోనే ఇప్పటివరకు 53 మందిని గుర్తించింది. వీరిలో 8 మందిని మాత్రమే పాఠశాలల్లో చేర్పించగలిగారు. పిల్లలను భిక్షాటన దిశగా ప్రోత్సహించకుండా వారి నివాసాల వద్దకు వెళ్లి గుడారాల పండుగ పేరుతో అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల భవిష్యత్తును పాడు చేయవద్దని చైతన్యపరుస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గత విద్యా సంవత్సరంలో గుర్తించిన 2,400 మంది బడిబయట పిల్లలను రెగ్యులర్‌ పాఠశాలల్లో చేర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

కాకినాడలోని బ్యాంకు కాలనీ

ప్రాంతంలో ఓ బాలిక భిక్షాటన


పిల్లలతో భిక్షాటన చేయిస్తే నేరం
పిల్లలు పాఠశాలల్లో ఉండాలి.బాగా చదువుకుంటేనే వారి భవిష్యత్తుకు బంగారుబాట పడుతుంది. అలా కాదని బడిఈడు పిల్లలను పనుల్లో పెట్టినా, వారిచేత భిక్షాటన చేయించినా నేరమే. చిన్నతనం నుంచి ఊరికే వచ్చే డబ్బులకు అలవాటు పడే కొందరు తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. పిల్లలు చదువుకు దూరమైతే వారి భవిష్యత్తు వక్రమార్గం పట్టే ప్రమాదం ఉంది. జిల్లాలో బెగ్గింగ్‌ మాఫియా వ్యవహారం ఇంతవరకు మా దృష్టికి రాలేదు. ఈ జాడలపైనా దృష్టిసారిస్తాం. అలాంటి తప్పుడు పనులకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ ముష్కాన్‌ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీల్లో ఇప్పటి వరకు 191 మంది పిల్లలను గుర్తించాం. వారిని తల్లిదండ్రులకు అప్పగించడం, పాఠశాలలు, సంరక్షణ కేంద్రాల్లో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. - అద్నాన్‌ నయీం అస్మి, జిల్లా ఎస్పీ

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.