close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

నిమ్స్‌మేలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత తర్ఫీదు

రాజ్యసభలో 100 శాతం పనిగంటలకు పట్టుబట్టిన వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ: శీతాకాల సమావేశాల్లో 100% పని గంటలను పూర్తిచేసేలా రాజ్యసభను నిర్వహించేందుకు ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు చేసిన ప్రయత్నాలకు చివరి రోజు పరిణామాలు స్వల్పంగా గండికొట్టాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలతో చివరి రోజు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే సభ వాయిదా పడింది. దీంతో స్కోర్‌ 99%వద్ద ఆగిపోయింది. రాజ్యసభలో విపక్షాలకే బలం ఎక్కువ. కత్తిమీద సాములాంటి సభను వెంకయ్యనాయుడు గత రెండు సమావేశాల నుంచి ఒడుపుగా నిర్వహిస్తూ వస్తున్నారు. రోజూ సభ ఎన్నిగంటలు పనిచేసిందన్న విషయాన్ని ఆయన క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ వచ్చారు. 249వ సమావేశం 100% పనితీరు కనబరిచిన నేపథ్యంలో 250వ సమావేశం సమయంలోనూ దాన్ని పునరావృతం చేయాలన్న సంకల్పంతో ఆయన ఉన్నారు. తొలి మూడువారాల్లో సగటున 96% సాధించింది. చివరి వారంలో పౌరసత్వ సవరణ బిల్లుపై నిర్దిష్ట సమయానికి మించి 3 గంటలు అధికంగా పనిచేయడంతో 100% దాటిన పనితీరుకు అవకాశాలు కనిపించాయి. చివరి రోజు సాఫీగా నడిస్తే సభ పనితీరు 100.12%కి చేరుకుంటుందని రాజ్యసభ సచివాలయ సిబ్బంది వెంకయ్యనాయుడి దృష్టికి తీసుకొచ్చారు. తొలిగంటలో 23 నిమిషాలు వృథా అయిపోయాయి. ప్రశ్నోత్తరాలు ఇంకా అరగంట మిగిలి ఉండగానే సభను వాయిదా వేయాల్సి వచ్చింది. దాంతో ఉత్పాదకత 99%కి పరిమితమైంది.

ఆదర్శంగా నిలవాలనే తాపత్రయం
ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా గత రెండు సమావేశాలు అత్యంత ఉత్పాదకంగా సాగడంపట్ల ఛైర్మన్‌ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘ఆయన ఒక్క క్షణం వృథానూ సహించరు. ప్రతి సమావేశానికి కనీసం అయిదునిమిషాలైనా ముందుగా వస్తారు. పెద్దల సభగా పేరొందిన రాజ్యసభ మిగతా సభలకు ఆదర్శంగా నిలవాలన్నదే ఆయన తాపత్రయం’’ అని రాజ్యసభ సచివాలయ సిబ్బంది పేర్కొన్నారు. సమావేశాలు ముగిశాక ప్రధానమంత్రి, మిగిలిన పక్షాల నాయకులు ఆయన ఛాంబర్‌కు వెళ్లినప్పుడు వెంకయ్యనాయుడు ఒకింత ఆవేదనతో కనిపించారు. సభ ఇంత సజావుగా సాగినప్పటికీ ఇంకా ఎందుకు బాధపడతారని కొందరు సభ్యులు ప్రశ్నించారు. ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటూ- ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయని, అందువల్ల సభలో చోటుచేసుకున్న అంశాల గురించి నాయుడు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను తప్పుబడుతూ సభ చివరి రోజు సోనాల్‌ మాన్‌సింగ్‌ సభలో పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ను లేవనెత్తినప్పుడు వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుంటూ- ‘‘మీరు లేవనెత్తిన అంశంలో పాయింట్‌ ఉంది. కానీ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేదు’’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. తద్వారా సభా మర్యాదల లక్ష్మణ రేఖను దాటకుండానే... రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న భావనను వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.