close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

ఆత్మవిశ్వాసమే నిలబెట్టింది!

నా ప్రపంచంలో రోజూ ఓ ఎవరెస్టుని ఎక్కుతున్నా..
‘ఈనాడు’తో పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌ మానసి జోషి
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

‘‘మనం సాధించాలనకున్నదానికి లోపాలు ఎప్పుడూ అడ్డు కాదు. ఆత్మవిశ్వాసం ముందు అన్నీ ఓడిపోవాల్సిందే. నాకిలా జరిగిందని అక్కడే కూర్చోకుండా లేచి ప్రయత్నిస్తే తెలుస్తుంది.. నీతో అవుతుందో..కాదోననేది..’’

ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. ఆరో ఏటనే షటిల్‌ పట్టింది.. అందరూ సరదాకి ఆడినట్టే ఆడింది.. ఆటపై ఆసక్తితో పనిచేసే సంస్థ తరఫున కొన్ని టోర్నీల్లో పాల్గొంది. ఎప్పుడూ తను ప్రపంచ స్థాయి విజేతగా ఎదుగుతాననుకోలేదు.. కానీ రోడ్డు ప్రమాదం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని రెపరెపలాడించేలా చేసింది. తనే పారా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ మానసి జోషి. శనివారం నగరానికి వచ్చిన తను ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ప్రమాదం మలుపుతిప్పింది..
ముంబైలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేసేదాన్ని. 2011లో ఆఫీసుకు వెళ్లుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. నెలల పాటు చికిత్స అనంతరం కోలుకోగలిగాను. అయితే గ్యాంగ్లిన్‌ సోకడంతో ఎడమ కాలు పూర్తిగా తీసేశారు. ఇక నాలుగు గోడలకే పరిమితమవుతాననుకున్నారంతా. కానీ కృత్రిమ కాలు అమర్చుకుని ఆటపై శ్రద్ధ పెట్టాను. 2014లో పారా ఏషియన్‌ గేమ్స్‌తో బ్యాండ్మింటన్‌లోకి ఆరంగేట్రం చేశాను. బ్యాడ్మింటన్‌ ఆటపై ఉన్న ఆసక్తితో కళాశాల, పనిచేసే సంస్థల తరఫున చిన్న స్థాయి టోర్నీలు ఆడేదాన్ని. ఎప్పుడూ ప్రపంచ స్థాయి విజేతనవుతాననుకోలేదు. ప్రమాదం తర్వాత ఏదో ఒకరకంగా గుర్తింపు సాధించాలనుకున్నా. అప్పుడే ఆటపై దృష్టి పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు పారా బ్యాడ్మింటన్‌లో ప్రపంచ స్థాయిలో రెండో స్థానానికి చేరుకున్నా. రాబోయే ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తాను.

నగరమే నడిపించింది..
ఆటలో మరింత పట్టుకోసం గోపీచంద్‌ అకాడమీలో చేరాను. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కి సరిగ్గా రెండు నెలల ముందు ఇక్కడికొచ్చాను. కోచ్‌ గోపీచంద్‌ శిక్షణలో పూర్తి స్థాయిలో రాటుదేలాను.  ఈ ప్రయాణంలో హైదరాబాద్‌ నగరం కీలకపాత్ర పోషించింది.

రోజూ ఓ ఎవరెస్టు ఎక్కుతున్నా..
చాలామంది వైకల్యాన్ని చూసి మనుషుల్ని అంచనా వేస్తుంటారు. అలాంటి వాళ్లకి మన ప్రతిభతో సమాధానం చెప్పాలి. నా విషయంలో ప్రమాదం తర్వాత నాలుగు గోడలకే పరిమితమవుతాననుకున్నారు. కానీ వాళ్లందరిది తప్పని నిరూపించా.. నాపై ఉన్న నమ్మకమే నన్ను ఈరోజు ఇలా నిలబెట్టింది. నా ప్రపంచంలో నేనూ రోజూ ఓ ఎవరెస్టు ఎక్కుతున్నాను.

మానసి ఘనతలు..
‘రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినప్పటికీ అధైర్యపడకుండా తానేంటో నిరూపించుకుంది మానసి. 2011లో జరిగిన ప్రమాదం తర్వాత కోలుకొని 2015లో పారా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. 2018 అక్టోబర్‌లో ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన పారా బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ ఏడాది పారా ఒలింపిక్స్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో పసిడి పతకం సాధించింది. ఇదే ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది.’’

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.