close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

తరాల మధ్య అనుసంధానం అవసరం

ఆటా.. అక్షరబాట కార్యక్రమంలో వక్తలు
అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
న్యూస్‌టుడే, నారాయణగూడ

మనదైన భాష, సాహిత్యం, సంస్కృతీ సంప్రదాయాలు, విలువలను ముందు తరాలకు అందించే ప్రయత్నం జరగాల్సిందే అంటున్నారు నిన్నటి, నేటితరం సాహితీవేత్తలు, కవులు. అమెరికా తెలుగు సంఘం(ఆటా).. ‘ఆటా.. అక్షరాల బాట’ నినాదంతో పాత, కొత్తతరం రచయితలను అనుసంధానం చేసేందుకు ‘అంతర్జాతీయ సాహితీ సదస్సు’కు శ్రీకారం చుట్టింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరం ఇందుకు వేదికయింది. శనివారం ‘ముందు తరాలతో సంభాషణ’ పేరిట నిర్వహించిన సదస్సులో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. సీనియర్‌ పాత్రికేయులు కె.శ్రీనివాస్‌ మాట్లాడారు. అనంతరం పద్యం, పాట, జానపదం అంశంపై జరిగిన సదస్సులో కవి దేశపతి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కవులు సిరాశ్రీ, శ్రేష్ఠ, పి.యెల్లారెడ్డి తదితరులు మాట్లాడారు. ఆటా అధ్యక్షుడు పరమేశ్‌ భీమ్‌రెడ్డి, ఆటా వేడుకలు ఛైర్‌ భువనేష్‌, కో-ఛైర్‌ జయంత్‌ చల్లా, రవీందర్‌ పర్యవేక్షించారు.

స్వరకల్పన, గానంలో పట్టుండాలి..
- అనంత శ్రీరామ్‌, సినీ గీతరచయిత
నటన కంటే నాటకాన్ని, సన్నివేశాన్ని సృష్టించిన కవి గొప్పవాడు కదా అనే భావన కలగడంతో గీత రచన వైపు మళ్లాను. ప్రజలను రంజింపజేస్తూనే సాహిత్యం విలువను తెలియజేసే ప్రక్రియ ఇది. సినిమా పాటలు రాసేవాళ్లకు రచనపై పట్టు ఉంటూనే స్వరకల్పన, గానంలో ప్రవేశం ఉంటే.. దాని భావాన్ని దర్శక నిర్మాతలకు వివరించగలం.


వర్తమానంతో మేళవిస్తూ ..
- కె.శివారెడ్డి, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు

ఒక తరం.. మరో తరంతో అనుసంధానం అవడమంటే బోధించడమే కాదూ.. నేర్చుకోవడం అని కూడా. మనం చెప్పే ఏ విషయాన్నయినా సమాజంతో, వర్తమానంతో మేళవిస్తూ చెప్పగలిగితే కొత్త తరం వింటుంది. ఒక సాహితీవేత్త, కవి.. ఒక కథను, కవిత్వాన్ని ఎంత గొప్ప భావాలతో రాస్తాడో.. అలాగే తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి.


ఆలోచింపజేసే రచనలు రావాలి..: ఓల్గా, రచయిత్రి

పాత, కొత్త తరాల మధ్య సంభాషణ నడిచినప్పుడే.. ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. రచయితలు సామాజిక నేపథ్యంలోంచి కథలు రాయాలి. వాటిని ఎలా రాయాలో మాట్లాడుకోవడానికి చక్కటి వేదిక ఇది. ప్రజలను ఆలోజింపజేసే రచనలు అవసరం. అలాంటి రచనలు రావాలని మా తరం కోరుకుంటోంది. సెన్సార్‌షిప్‌ను ఎలా ఎదుర్కొవాలనేది ముందే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి.


దృక్పథాన్ని అర్థం చేసుకుంటే..
- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, రచయిత

సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను అర్థం చేసుకునే క్రమాన్ని దృక్పథం అనుకోవచ్చు.అది రచయితలకు తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైతే పాతతరం, కొత్తతరం తమతమ అభిప్రాయాలను పంచుకుంటుందో.. రాబోయే తరాలకు మరింత గొప్ప సాహిత్యాన్ని అందించే అవకాశం ఉంటుంది.


మార్పునకు నాంది కావాలి
- ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి

నలుగురు కలిసినప్పుడు చర్చలు జరుగుతాయి. కొత్త ఆలోచనలు పుడతాయి. అవి మంచి సందేశాన్నిస్తాయి. మనసులో నాటుకుంటాయి. జీవితంలో, ఆచరణలో ఉపయోగపడతాయి. తరాల మధ్య జరిగిన ఈ కూర్పు కొత్త మార్పునకు నాంది కావాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.