close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

తినరామైమరుచి

పిజ్జా దోసె తిన్నారా.. దోరగా కాల్చిన ఫ్రాంకీ రుచి చూశారా! ఖాఠ్‌మండూ మోమోస్‌, ఫ్రైడ్‌ మోమోస్‌ చూశారా.. ఇలాంటి వైవిధ్య రుచులకు ఎక్కడికో వెళ్లక్కర్లేదు. మన నగర గల్లీల్లోనే ఇవన్నీ ఘుమఘుమలాడుతున్నాయి. పేరుకు ‘స్ట్రీట్‌ ఫుడ్స్‌’ అయినా ఇంట్లో చేసుకున్నంత శుచి, రుచితో నోరూరిస్తున్నాయి. అందుకే యువత అర్ధరాత్రి అయినా వెళ్లి ఆరగిస్తోంది.. అంతర్జాలం ద్వారా నలుగురితో పంచుకుంటోంది. ఆ రుచులపై తినరా మైమరుచి లోపలి పేజీల్లో..


టిబ్స్‌ ఫ్రాంకీ

ఫ్రాంకీ ప్రియులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం టిబ్స్‌ ఫ్రాంకీ. సుమారు 15కు పైగా శాఖలతో నగర వాసులకు ఫ్రాంకీలు చేరువ చేస్తోంది. ముంబయి శైలిలో రూపొందిస్తున్న ఫ్రాంకీలంటే ఇష్టపడనివారుండరు. ఇక్కడ మాంసాహారులకు మూడు రకాలు, శాఖాహారులకు ఐదు రకాల్లో గ్రిల్డ్‌ శాండ్‌విచ్‌లు లభిస్తున్నాయి. డబుల్‌ ఎగ్‌, సింగిల్‌ ఎగ్‌ లేయర్‌తోనూ అందిస్తున్నారు.

‘ప్యాకెట్‌ ఫెండ్లీ’ ఫ్రాంకీ

ప్రత్యేకత..
చిల్లీ చికెన్‌, మటన్‌ ఫ్రాంకీల రుచే రుచి.

ఫాస్ట్‌ఫుడ్‌, రోల్స్‌, వెజ్‌ ఫ్రాంకీ, వెజ్‌ చీజ్‌ ఫ్రాంకీ, ప్లెయిన్‌ చీజ్‌ ఫ్రాంకీ, పనీర్‌ ఫ్రాంకీ, టాంగీ పనీర్‌ ఫ్రాంకీ, ఎగ్‌ ఫ్రాంకీ, మటన్‌ ఫ్రాంకీ, చికెన్‌ టిక్కా ఫ్రాంకీ, తవా చికెన్‌ ఫ్రాంకీ, చెట్టినాడ్‌ చికెన్‌ ఫ్రాంకీ, చిల్లీ చికెన్‌ ఫ్రాంకీ.. ఇలా మాంసా, శాఖాహార ఫ్రాంకీలు దొరుకుతాయి. రెండు ఫ్రాంకీలు తింటే కడుపు నిండుతుంది.

ఎప్పటి నుంచి..
1969లో ముంబయిలో మొదలైన ఈ ఫ్రాంకీ రుచులు.. క్రమంగా హైదరాబాద్‌ వరకు విస్తరించాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే రొట్టె.. స్థానిక రుచులకు అనుగుణంగా దట్టించే మసాలాలతో నగరంలో చాలా ప్రాంతాల్లో శాఖలు అందిస్తున్నాయి.

పల్చటి చపాతీ మధ్యలో వేడివేడి కూర కారం, తీపి కలిసిన రుచిలో ఉంటాయి.

సమయం: మధ్యాహ్నం 12-రాత్రి 10.30 వరకు.

ఎక్కడ: బేగంపేటలోని షాపర్స్‌స్టాప్‌, గ్రీన్‌ లాండ్స్‌లోని వైట్‌హౌజ్‌

ధరలు: అల్పాహార ప్రియులకు ప్యాకెట్‌ ఫ్రెండ్లీ. ఎటువంటి ఫ్రాంకీ అయినా (వెజ్‌, నాన్‌వెజ్‌) రూ.55కే లభిస్తుంది. అదనపు చీజ్‌కు రూ.10


యమ్మీ.. యమ్మీ.. చికెన్‌ 65

ఫాస్ట్‌ఫుడ్‌కి పెట్టింది పేరు....అక్బర్‌ ఫాస్ట్‌ఫుడ్‌ కార్నర్‌. చార్మినార్‌ ప్రాంతంలో ఇది ఉంది. చికెన్‌తో చేసే పదార్థాలకు వీరాభిమానులు ఉన్నారు. ముఖ్యంగా చికెన్‌ 65 రుచిని ఆస్వాదించడానికే ఎక్కువ మంది ఇక్కడికి వెళ్తుంటారు. ఇతర ప్రాంతాల్లో దొరికే చికెన్‌ 65కి ఇక్కడ దొరికే దానికి వ్యత్యాసాన్ని మీరు ఇట్టే కనిపెట్టేస్తారు.

ప్రత్యేకత..
సగం ప్లేట్‌ కూడా సగం ధరలకు లభ్యం అవుతుంది.

మటన్‌ బిర్యానీ, మటన్‌ హండీ, మటన్‌ ఫ్యామిలీ ప్యాక్‌, జంబో ప్యాక్‌, చికెన్‌ బిర్యానీ, జంబో ప్యాక్‌, చికెన్‌ తందూరి తదితర వెరైటీలన్నీ లభిస్తాయి. చికెన్‌, మటన్‌లో బోన్‌, బోన్‌లెస్‌, లివర్‌ కూడా దొరుకుతాయి.ఎర్రగా ఉండి కరకరలాడేలా ఉండే చికెన్‌ ముక్కలు ఊరిస్తాయి.

వాతావరణం
రాత్రి పూట ఎక్కువ రద్దీగా ఉంటుంది. పార్కింగ్‌కు ఇబ్బందులు తప్పవు. దూరంగా పార్కింగ్‌ చేసుకుని రావాల్సిందే. పర్యటక ప్రాంతం కావడంతో పార్కింగ్‌కు చోటు దొరకదు. లోపల కూర్చునే వెసులుబాటు ఉంటుంది.

చికెన్‌ 65కి పేరొందింది. రూ.150పెడితే ఫుల్‌ప్లేట్‌, రూ.75కు ఆఫ్‌ప్లేట్‌ వడ్డిస్తారు.


అక్బర్‌ ఫాస్ట్‌ఫుడ్‌ కార్నర్‌


సమయం: సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది.
ఎక్కడ: చార్మినార్‌ సమీపంలోని మక్కా మసీదు పక్కనే.
ధరలు:  మటన్‌ బిర్యాని రూ.140, చికెన్‌ బిర్యాని 130 ఉంటుంది.


విదేశీ కుడుముల్లో మన మసాలా!

మోమోస్‌ ఇప్పుడిప్పుడే నగరవాసులకు పరిచయం అవుతున్న ఆహారం ఇది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ కనిపిస్తుంది. అందుకే ఖాట్మండూ మోమోస్‌ అనే పేరుతోనూ నగరంలో స్టాల్స్‌ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకైతే అతుల్‌ మోమోసే ఫేమస్‌. నగర వాసుల రుచులను కనిపెట్టిన నిర్వాహకులు మోమోస్‌లో మన మసాలాలు దట్టించి వడ్డిస్తున్నారు.

ప్రత్యేకత..
వెజ్‌ మోమో, జ్యూసీ మోమోలు, చిల్లీ మోమో, బిర్యానీ, స్టీమ్‌ చికెన్‌ మోమో

అతుల్‌ మోమోస్‌ పాయింట్‌కు చాలా ప్రత్యేకమైన పేరుంది. మోమోస్‌ రుచిగా ఉండటానికి వాటి లేయర్‌ కారణం. యంత్రాలతో చేస్తే మందంగా వస్తాయి. అందుకే ఇక్కడ చేతితో అతి పలుచగా చేస్తారు.

ఎప్పటి నుంచి..
ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, డార్జిలింగ్‌లో ఈ ఆహారం ఎక్కువగా లభిస్తుంది. చైనీస్‌ బవోజి, జియోజి తరహాలో ఇది ఉంటుంది. ఉప్పల్‌లోని బీరప్పగడ్డ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ-2 వద్ద ఈ పాయింట్‌ ఉంది. స్టీమ్డ్‌, ఫ్రైడ్‌, చిల్లీ మోమోలు తినడానికి మోమోస్‌ ప్రియులు ఎగబడతారు.

దక్షిణ ఆసియా, హిమాలయా ప్రాంతాల్లో నుంచి నగరానికి ఇది విస్తరించింది.

సమయం: సాయంత్రం 5.30 -రాత్రి 9.30 వరకు.

ఎక్కడెక్కడ: హబ్సిగూడ, హిమాయత్‌నగర్‌లోని మోస్ట్‌లీమోమో పలు ప్రాంతాల్లో..

ధరలు:  చికెన్‌ చిల్లీ మోమోకు రూ.120, ఆవిరివి రూ.90, వెరైటీలు రూ.70-రూ.75 వరకు లభిస్తున్నాయి. అదనపు చీజ్‌కు రూ.15 తీసుకుంటారు.


ఆలూ టోస్ట్‌.. యమ టేస్టీ!

చాట్‌ అంటే ఇష్టపడేవారి మరో అడ్డా ఓహ్రీస్‌ చౌపట్టి. బంజారాహిల్స్‌లో ఉంది. నార్త్‌ ఇండియన్‌ వంటకాలు ఇక్కడ చాలా ఫేమస్‌. ఇక్కడికి వచ్చినవారు రగడ సమోసా, చోలే కుచ్లే రుచి చూడకుండా వెళ్లలేరు. చౌపట్టి అంటే ‘అన్నీ’ అని అర్థం. పేరుకు తగ్గట్టే అనేక రకాల వంటకాలు ఇక్కడ లభిస్తాయి. ఇక్కడి వాతావరణానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

ప్రత్యేకత..
స్పెషల్‌ ఆలూ టోస్ట్‌, రబ్డీ మాల్పువా, పాప్డీ చాట్‌, రాజ్‌ కచోరి, సేవ్‌ పూరి, భేల్‌ పూరి, ఆలూ టోస్ట్‌

అక్కడికి వెళ్లి తినడం కష్టమైతే ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్‌ ఇవ్వచ్చు. ఆన్‌లైన్‌లో ఓహ్రీస్‌ చౌపట్టికి 4.3 రేటింగ్‌ ఇచ్చారు. పనీర్‌ మకానీ చూసి మీకు నోరూరుతుంది. పావ్‌ బాజీ పరిమాణం కాస్త చిన్నగా ఉందంటూ ఊసురుమంటారు.

వాతావరణం
ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారు నాణ్యత, పరిశుభ్రత, సేవలకు మెచ్చుకోకమానరు.  పాప్డీ చాట్‌ చూసి లొట్టలేయాల్సిందే. రాజ్‌ కచోరి అన్ని వెరైటీల్లో రాజా, స్పెషల్‌ ఆలూ టోస్ట్‌, రబ్డీ మాల్పువా తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంటుంది.
అందుబాటులో ధరల్లో చక్కటి ఆహారం ఇక్కడ లభిస్తుంది.


ఓహ్రీస్‌ చౌపట్టి
బంజారాహిల్స్‌

ఎక్కడ: బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబరు 12
సమయం: మధ్యాహ్నం 1-రాత్రి 11.30గంటల వరకు.
ధరలు: సమోసా, పాపిడి, స్పైసీపాపిడి చాట్‌, రాజ్‌వాడి రాజ్‌ కచోరి, పాలక్‌ చాట్‌, బ్రెడ్‌ పకోడా, డోక్లా, రగడ రూ.80- రూ.90 వరకు ఉన్నాయి.


పావ్‌బాజీ... మస్త్‌ హై జీ

మహారాజా చాట్‌.. ఇక్కడి పానీపూరి, ఆలూ రగడ, భేల్‌పూరీ ఎంతో రుచిగా ఉంటాయని పేరుంది. ఇక్కడికి వచ్చినవారు మసాలా పావ్‌బాజీ తినకుండా వెళ్లరు. ఏళ్ల తరబడి ఉన్నా రుచి మాత్రం తేడా లేదు. మిల్క్‌షేక్‌లు, జ్యూస్‌లు, పానీపూరి రగడ, పావ్‌బాజీ రుచి అమోఘం. ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి.

ప్రత్యేకత..
ఫ్రూట్‌బౌల్‌, ఛాట్‌, పానీపూరి, పావ్‌బాజీ, దహీపూరి, భేల్‌పూరి, సమోసా రగడ

పానీపూరి సంప్రదాయంగా ఎలా తయారు చేస్తారో ఆ రుచి ఇక్కడ దొరుకుతుంది. తాజా పళ్ల రసాలూ లభిస్తాయి.  పానీపూరి, భేల్‌పూరి తిన్నవాళ్లు తప్పక ఓ పళ్ల రసం తాగుతారు.

వాతావరణం
ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని అనుకునేవారికి ఇది మంచి ప్రదేశం. సాయంత్రం రాత్రివేళల్లో వెళ్లే వారికి వేగంగా సర్వీస్‌ అందుతుంది.

రాత్రి భోజనం చేశాక కూడా ఇక్కడికి వచ్చి మరీ చాట్‌, కుల్ఫీ రుచులు ఆరగిస్తారంటే ఆశ్చర్యమే కదా!

సమయం: మధ్యాహ్నం 1గంట- రాత్రి 11.30వరకు.

ఎక్కడ: మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌ సమీపంలో ఈ చాట్‌ సెంటర్‌ ఉంది.

ధరలు: ప్రత్యేక పావ్‌బాజీ రూ.110, పావ్‌బాజీ రూ.90, బటర్‌ పావ్‌బాజీ రూ.100, పానీపూరి (8పీసెస్‌) రూ.40, 15పీసెస్‌ రూ.70.


తియ్యతియ్యని  జిలేబీ!

మీరు మిఠాయి ప్రియులా.. చార్మినార్‌ వైపు వెళ్తున్నారా..? అయితే తప్పకుండా రాజస్థానీ జిలేబీ దుకాణానికి వెళ్లాల్సిందే. జిలేబీ ప్రియులకు ఇది ఎంతో ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడ పేరుకు జిలేజీ అని ఉన్నా.. అన్ని రకాల కచోరీలు, చిరుతిళ్లు దొరుకుతాయి.

ప్రత్యేకత..
ఎర్రని జిలేబీతో పాటు కచోడీ, సమోసా, జాంగ్రీ చాలా ఫేమస్‌.

ఇక్కడ జిలేబీతో పాటు మిక్చర్‌ కూడా చాలా రుచిగా ఉంటుంది. గాజు పెట్టెలో అన్నీ సర్ది ఉంటాయి. జిలేబీలు మాత్రం వేడి వేడిగా ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది. పార్సిల్‌ కూడా తీసుకెళ్లొచ్చు.

వాతావరణం
రోడ్డు పక్కన ఉన్న చిన్న గది దాని ముందు స్టాల్‌లో జిలేబీ వేస్తుంటారు. చార్మినార్‌ పక్కనే ఉండటంతో ఇక్కడ పార్కింగ్‌ వెసులుబాటు ఉండదు. దీనికి 200మీటర్ల దూరంలో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కింగ్‌లో వాహనాలు నిలుపుకోవచ్చు. కూర్చొనే వీలు లేదు.
చార్మినార్‌కు వెళ్లిన మిఠాయి ప్రియులు తప్పకుండా జిలేబీ, కచోడి, జాంగ్రీ ఆస్వాదించే వెళ్తారు.

రాజస్థానీ జిలేబీ

ఎక్కడ:  చార్మినార్‌లోని చింతల్‌మెట్‌, రూహీ కేఫ్‌ సమీపంలో ఇది ఉంది.

సమయం: ఉదయం 7గంటల - రాత్రి 10 గంటల వరకు.

ధరలు: సామాన్యుడికి అందుబాటు ధరలో ఉంటాయి. కిలో జిలేబీ రూ.300 పలుకుతుంది.


మనసు దోచె.. గోవింద్‌ దోసె!

వీధి ఆహారం అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది దోసె. ఎక్కడ చూసినా, తిన్నా.. ఆలు కుర్మా, పుట్నాల చట్నీ రుచి మాత్రం మారదు. అలా కాకుండా దోసెలో మాం..చి రుచి కోరుకునే వారిని గోవింద్‌ బండి ఆహ్వానిస్తోంది. రుచికర దోసె తినాలంటే చార్మినార్‌ వద్దనుండే ఈ బండి వద్దకు రావాల్సిందేనంటోంది.

ప్రత్యేకత..
ఇక్కడి బటర్‌ దోసెకు మాంచి డిమాండ్‌.

ఒక చేత్తో అవలీలగా దోసె వేసి, దానిపై పల్చటి ఉప్మాపొర, ఉల్లి తరుగు, బటర్‌ వేస్తారు.  ఉల్లి కొద్దిగా ఉడకగానే బటర్‌ పూర్తిగా కరిగి దోసెకు పడుతుంది. ఆ తర్వాత మసాలా కారం జల్లితే.. వచ్చే ఆ ఘుమఘుమలు సామాజిక మాధ్యమాల్లోనూ గుప్పుమంటున్నాయి.

వాతావరణం
ఈ రుచి కోసం ఉదయాన్నే పెద్ద క్యూ ఉంటుంది.  రోడ్డు పక్కన బండిపై గోవింద్‌ కుటుంబ సభ్యులంతా కలిసి పని చేస్తారు. ఈ ప్రక్రియ ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1గంట దాకా ఉంటుంది. చట్నీ కోసమే ఎక్కువ మంది ఓపికగా నిల్చుంటారు.
చార్మినార్‌ సమీపంలో 30 ఏళ్లుగా వివిధ రకాల రుచులను అందిస్తున్నారు నిర్వాహకులు.

సమయం: ఉదయం 8.30 నుంచి సాయంత్రం 3.30 వరకు.

ఎక్కడ: చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌజ్‌.

ధరలు: సాదా దోసె రూ.40, పిజ్జా దోసె రూ.100, పనీర్‌ మైసూర్‌ బజ్జీ రూ.80, వెరైటీలను బట్టి ధరల్లో కొద్ది తేడా ఉంటుంది. 


కాజు బర్ఫీ.. కాదనలేరు ఎంతైనా

మిఠాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆల్‌మండ్‌ హౌజ్‌ కాజుబర్ఫీకి ఎంతో మంది లవర్స్‌ ఉన్నారు. కాజు కట్లీ కోసమూ ఎక్కువ మంది వస్తుంటారు. ఎన్నిసార్లు తిన్నా, రోజుల తరబడి విరామం ఇచ్చి మరోసారి తిన్నా రుచిలో  ఏ మాత్రం తేడా ఉండదు. కొందరైతే ప్యాకేజింగ్‌ చూసి కూడా ముగ్దులవుతున్నారంటే నమ్మండి.

ప్రత్యేకత..
సచ్ఛమైన కాజు బర్ఫీ, కాజు కట్లీ, అన్ని రకాల మిఠాయిలు.

విదేశాల్లో ఉన్న వారికీ వీటిని అందజేయొచ్చు. విమానాశ్రయంలోనూ ఓ శాఖ ఉంది. ఎండు పండ్లతో చేసే మిఠాయికి ఎంతో గిరాకీ ఉంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చినా ముప్పై నిమిషాల్లో సిద్ధం చేస్తున్నారని వినియోగదారుల అభిప్రాయం. హల్వా కూడా ఫేమస్‌. చిన్నపాటి స్నాక్‌ ఐటెంలూ లభిస్తాయి.

వాతావరణం
శుభ్రమైన వాతావరణం. ద్విచక్రవాహనదారులకు పార్కింగ్‌ వసతి ఉంది. కారు నిలపాలంటే ఇబ్బందే. రద్దీ ఉన్నా సర్వీస్‌ వేగంగా ఉంటుంది. ధరలు ఎక్కువ అనిపించినా శుచి, రుచివల్ల కొంటున్నారు.
నగరంలో మరో మూడు ఆల్‌మండ్‌ మిఠాయి కేంద్రాలున్నాయి.

ఆల్‌మండ్‌ హౌజ్‌
ఎక్కడ: హిమాయత్‌నగర్‌లోని ఆల్‌మండ్‌హౌజ్‌.
సమయం: ఉదయం 8గంటల నుంచి రాత్రి 11గంటల వరకు.
ధరలు: కిలో కాజు బర్ఫీ రూ.1380, చిన్నపాటి స్నాక్స్‌ డ్రైఫ్రూట్‌ పూతరేకులు ఒక పీస్‌ రూ.40, మాలాయ్‌ పూరి రూ.120, రసగుల్ల రూ.26.


యువత మెచ్చే పిజ్జా దోసె!

పిజ్జా దోసె ఎప్పుడైనా తిన్నారా..? కావాలంటే రామ్‌కి బండి వెళ్లండి. దోసెల్లో వైవిధ్యమైన రుచులు చూడాలంటే వడ్డించేందుకు రామ్‌కి సిద్ధం. ఎంతో మంది యువత బారులు తీరి మరీ ఈ అల్పాహార విందును ఆరగిస్తుంటారు. దుకాణం    తెరవక ముందే బండి దగ్గర జనం పోగవుతారంటే ఆశ్చర్యం కలగకమానదు.

ప్రత్యేకత..
బటర్‌ దోసె, పిజ్జా దోసె, బట్టర్‌ ఉప్మాకు ఈ బండి ఫేమస్‌.

ఉదయం నుంచే ఈ  అల్పాహారం కోసం క్యూ మొదలవుతుంది. బటర్‌ పన్నీర్‌ దోసె, బటర్‌ దోసె, తవా ఇడ్లీ, మసాలా దోస, ఇడ్లీ ఇక్కడ లభిస్తున్నాయి. ఇక్కడి పిజ్జా దోšసెకు  నగర యువత నూటికి నూరు మార్కులు వేస్తున్నారు.

ఎప్పటి నుంచి..
1989లో 8 ఏళ్లప్పుడే రామ్‌ తన తండ్రి నిర్వహించే టిఫిన్‌ బండి వద్ద పని చేయడం మొదలుపెట్టారు. ఆ అనుభవంతో ఎంబీఏ చేసినా అదే రంగంలోకి అడుగుపెట్టారు. యువతను ఆకట్టుకోవాలని కొత్త రుచులు ప్రవేశపెట్టి చీజ్‌, బటర్‌ దోశెలలను ప్రవేశపెట్టారు.
ఎంబీఏ చేయడంతో యువతకు నాడి పట్టుకొని మరీ వడ్డిం చేస్తున్నారు.

సమయం: ఉదయం 3.30-8.30గంటల వరకు.

ఎక్కడ: మొజంజాహీ మార్కెట్‌ కూడలి, కరాచీ బేకరీ ఎదురుగా.

ధరలు: అత్యల్పంగా ఇడ్లీ రూ.25 ఉండగా, బటర్‌ పనీర్‌ దోసె రూ.60.  చవకగా రుచికర అల్పాహారం తినొచ్చు.


గ్రీన్‌ చట్నీకి  అంతా ఫిదా!

అల్పాహారమే కదా అలా వెళ్లి చేసొద్దాం అంటే కుదరదిక్కడ. ఎందుకంటే లక్ష్మణ్‌ కీ¨ బండి వద్దకు వచ్చే జనం రద్దీ అంతలా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 6.30 నుంచి 10 గంటల మధ్యలో వెళ్తే ఆర్డర్‌ ఇవ్వాలన్నా అర్ధగంట పాటు ఆగాల్సి వస్తుందంటే ఎంత డిమాండ్‌ ఉంటుందో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఒక్క టిఫిన్‌ తిని బ్రేవ్‌.. అనుకుంటూ వెళ్లొచ్చు.

ప్రత్యేకత..
బటర్‌ ఇడ్లీ, చట్‌పటా దోసె, పనీర్‌ దోసె, పేపర్‌ దోసె, బోండా.

లక్ష్మణ్‌ కీ బండి అందించే గ్రీన్‌ చట్నీ అంటే అందరికీ నోరూరుతుంది. ఆహార ప్రియులు ఈ చట్నీకే ఫిదా అయ్యామంటారు. 6.30కు దుకాణం తెరిచినా.. 6గంటలకే జనాలు లైను కడతారు. ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్లు ఇచ్చి మరీ తీసుకుంటారు.

వాతావరణం
పిజ్జా దోసె తప్ప మిగతా అల్పాహారాలు అన్నీ అందుబాటు ధరల్లో ఉంటాయి.  పేరుకు బండే అయినా.. లోన కూర్చొని తినే వెసులుబాటూ ఉంది. దీర్ఘకాలికంగా ఉండటం వల్ల జనాల్లో విశ్వాసాన్ని పొందింది.  సుమారు 50 ఏళ్ల నుంచి ఈ దుకాణం నడుస్తోంది.

సమయం: ఉదయం 6.30- సాయంత్రం 3.30గంటల వరకు.

ఎక్కడ: బేగంబజార్‌, గ్యాన్‌బాగ్‌ కాలనీ, గోషామహల్‌లో శాఖలున్నాయి.

ధరలు: సామాన్యుడికి అందుబాటు ధరల్లోనే ఉన్నాయి.  రూ.25ల్లోనే అన్నీ లభిస్తాయి. తక్కువ ధర అని యువత అభిప్రాయం.


కంటికి వినోదం జిహ్వకు రుచి

పరిశుభ్రమైన వాతావరణంలో హైదరాబాద్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ను ఆశ్వాదించాలనుకునే వారు లమకాన్‌ వెళ్లొచ్చు. రుచికరమైన ఆహారం తింటూ వినోద కార్యక్రమాలను వీక్షించొచ్చు. స్నేహితులతో కబుర్లు మాట్లాడుకోవడానికి, కథ కూర్పును చర్చించుకునేందుకు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారు పాకెట్‌ఫ్రెండ్లీ కేఫ్‌ అంటూ సోషల్‌ మీడియాలో కితాబులిచ్చేస్తున్నారు.

ప్రత్యేకత..
మిర్చి బజ్జీ, పకోడా, వడ, లస్సీ, శాండ్‌విచ్‌, ఎగ్‌ పకోడా, సమోసా నోరూరిస్తాయి.

ఇక్కడి జింజర్‌ టీ తాగారంటే ఎలాంటి తలనొప్పి అయినా ఎగిరిపోవాల్సిందే.! రుచి, శుచికి నగరంలో మొదటి ఓటు దీనికే. స్నేహితులతో కలిసి సమూహాంగా వచ్చి సరదాగా గడిపి నచ్చిన ఆహారం తినడానికి మంచి అనువైన ప్రదేశం. అందుబాటు ధరల్లో ఆరోగ్యకరమైన ఆహారం ఇక్కడ లభిస్తుంది.

వాతావరణం
ఇక్కడి వాతావరణం ఎప్పటికీ రద్దీగా ఉన్నప్పటికీ వెంటనే ఆహారం లభిస్తుంది. కూర్చొని తినేందుకు విశాలమైన స్థలం, బల్లలు ఉంటాయి. బయట ఓ పక్కగా బైక్‌లు నిలుపుకోవచ్చు. కార్లకు పార్కింగ్‌ సౌకర్యం లేదు. ఔత్సాహిక కళాకారులు ప్రదర్శన చూస్తూ.. చిరు తిండి  ఆస్వాదించొచ్చు.

లమకాన్‌
సమయం: ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు.
ఎక్కడ: బంజారాహిల్స్‌, జీవీకే సమీపంలో రోడ్డు నం.5
ధరలు: టీ కాఫీ నుంచి లస్సీ వరకు రూ.10 నుంచి రూ.20 వరకు ఉన్నాయి. వెజ్‌ సాండ్‌ విచ్‌ రూ.40, ఆమ్లెట్‌ రూ.30, బ్రెడ్‌ ఆమ్లెట్‌ రూ.40.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.