close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

ఆర్టీసీలో తగ్గని అలజడి

వెయ్యి బస్సులు తగ్గించడంపై ప్రయాణికుల ఆవేదన
ఉద్యోగ భద్రతపై సిబ్బందిలో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్‌

ఆర్టీసీ కార్మికుల సమ్మె 52 రోజుల పాటు నడిచిన అనంతరం ప్రభుత్వ పిలుపుతో విధుల్లో చేరారు. ఇంతవరకు బాగున్నా తర్వాత చర్యలే అటు కార్మికులను, ఇటు ప్రయాణికులను కలవర పెడుతున్నాయి. పొరుగు సేవల ఉద్యోగుల్లో అయితే.. తాము ఇక బయటకు వెళ్లిపోవాల్సిందేనా అనే ఆందోళన నెలకొంది.

బస్సుల రద్దుతో..
ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో మొత్తం 3750 బస్సులున్నాయి. వీటిలో 3550 బస్సులు రోజూ రోడ్డెక్కుతున్నాయని అధికారులు తెలిపేవారు. డ్రైవర్ల కొరతతో రోజూ 500 వరకు డిపోలకే పరిమితమయ్యేవి. ప్రస్తుత పరిస్థితుల్లో వెయ్యి బస్సులు రద్దు చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. అసలే బస్సుల కొరత ఉందంటే.. ఇప్పుడు ఉన్నవాటిలో కోత పెట్టడమేంటని వాపోతున్నారు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత అవి కనిపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క బస్సు ఛార్జీల మోత.. మరోవైపు కోత ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మా ఉద్యోగాల పరిస్థితేమిటి?
వెయ్యి బస్సులను తగ్గించిన దరిమిలా మిగులు ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేయాలి.. ఏ మార్గాల్లో బస్సులను రద్దు చేయాలనేదానిపై ఆర్టీసీ ఓ అధ్యయన కమిటీని వేసింది. అది ఇచ్చే నివేదిక ప్రకారం కండక్టర్లను గుమస్తాలుగాను,  టైపిస్టులుగానూ మార్చాలని నిర్ణయించారు. అలాగే డ్రైవర్లను, మెకానిక్‌లను సర్దుబాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పొరుగు సేవల ఉద్యోగుల ద్వారా నిర్వహిస్తున్న విధులను వీరికి అప్పజెప్పాలని ప్రయత్నిస్తున్నారు. కొత్త విధులు ఎలా ఉంటాయి.. అసలు ఉద్యోగాలు ఉంటాయా.. బలవంతంగా విరమణ చేయమంటారా అన్న సందేహాలతో ఆర్టీసీ ఉద్యోగులు కలవర పడుతున్నారు. గ్రేటర్‌ జోన్‌లో దాదాపు 6 వేల ఉద్యోగుల భవిష్యత్తుపై వివిధ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పొరుగు సేవల ఉద్యోగుల్లో కలవరం
గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో మొత్తం 150 మందికి పైగా పొరుగు సేవల ఉద్యోగులున్నారు. వీళ్లంతా టైపిస్టులుగా.. జూనియర్‌ అసిస్టెంట్లుగా.. మెకానిక్‌లుగా, అటెండర్లుగా పని చేస్తున్నారు. ఇందులో ఇంటర్‌ నుంచి డిగ్రీ చదివినవారు ఉన్నారు. ఇంటికి దగ్గరగా ఉంటుందని పీజీ చేసినవారూ పని చేస్తున్నారు. ఇలా పదేళ్లుగా విధుల్లో ఉన్నవారు ఉన్నారు. గతంలో టైపిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.6 వేలుగా ఉన్న జీతం ఇప్పుడు రూ.9700కు పెరిగింది. అటెండర్లు, మెకానిక్‌లైతే రూ.8500 తీసుకుంటున్నారు. నగరంలో ఆపేసిన వెయ్యి బస్సుల వల్ల ఖాళీ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు పొరుగు సేవల ఉద్యోగుల విధులు అప్పగిస్తే తమవి ఉంటాయా.. ఊడతాయా అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఒప్పంద ఉద్యోగుల్లాగే తమ సేవలను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడూ తాము సేవలందించామని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమకు న్యాయం చేయాలని విన్నవిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.