close

గురువారం, ఫిబ్రవరి 27, 2020

ప్రధానాంశాలు

పురభారత్‌ సంగ్రామం!

తారస్థాయిలో ప్రచారం
పద్మవ్యూహంలో.. మాయాపాచికలు..
న్యూస్‌టుడే, షాద్‌నగర్‌

ఎన్నికలెప్పుడూ యుద్ధాన్నే తలపిస్తుంటాయి. పురపాలిక ఎన్నికలు నిజంగా మహాభారత్‌ సమరాన్ని కళ్లకుగట్టుతాయి. అంతా ఒకే వీధి వాళ్లే.. తరచి చూస్తే అక్కా, బావ, మామ వరుస ఉన్నవాళ్లే.. ఎన్నికల వేళ బద్ధ శత్రువల్లా కత్తులు నూరుకుంటారు. ఓట్ల కోసం ప్రతి గడపలో కాచుక్కూర్చుంటారు. పురభారత సంగ్రామంలో మహాభారత యుద్ధాన్ని చూద్దాం!

రాజకీయం అంటేనే ఇది. టికెట్టు ఆశించి భంగపడిన వారు అగ్రనేతల ఒత్తిడి మీద అభ్యర్థుల వెంట తిరుగుతున్నా లోలోపల ఎక్కడ సందు దొరుకుతుందా అని చూస్తున్నారు. బాగా తెలిసిన వారిని ‘మా పార్టీకి ఓటేయొద్దు’ అని చెప్పి తెలియని వారికి మాత్రం ‘మా పార్టీకే ఓటేయండి’ అని చెబుతున్నారు. ఎందుకంటే... తెలియని వారికి ఇతనేపార్టో తెలియదు కదా..! అదీ కిటుకన్నమాట. మొత్తానికి ఫలానా అతనికి టిక్కెట్టు ఇవ్వకపోవడం వల్లే ఓడిపోయం అనే విషయం అగ్రనేతలకు అర్థం చేయించేలా శతవిధాల కష్టపడుతున్నారు.
నేలను చూసి నీరని..నీటినిచూసి నేలని సుయోధనుడు మయసభలో పడిన అవస్థలు తెలిసిందే. ఇక్కడ మాత్రం అభ్యర్థులు ఏ ఇంటికెళ్లినా ‘మా ఓటు మీకే’ అంటారు. వారి మనసులో ఏ ముందో తెలుసుకోవడం.. మయసభ కంటే కఠినం. హామీలతో ఓటర్ల మనసు తేటతెల్లంకాదు.. నేతలూ తేలికపడరు. అందుకే కొన్ని చోట్ల రాతపూర్వక హామీలు ఇస్తున్నారు.. మన నేతలు.

గెలుపోటములు ఎవరివైనా అభ్యర్థులు, పార్టీలు కలిసి పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యులు మాత్రం ఓటర్లే. ఎవరికి వారు తమ పథకాల ద్వారా ఓటరుకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుండడంతో అర్థం కాక ఓటర్లు సతమతమవుతున్నారు. పోలింగ్‌ బూత్‌కు వెళ్లే సమయం దాకా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. మరి ఈ అభిమన్యులు పద్మవ్యూహం నుంచి బయట పడతారా.. పనిచేసే నేతలను ఎన్నుకుంటారా.. చూడాలి.

ఇప్పుడు ప్రత్యర్థులు ఏం చేస్తున్నారన్నదానిపైనే అభ్యర్థులు దృష్టి సారించారు. వారి బలం కనిపెట్టి, బలగాన్ని కొనిపెట్టి, ఓట్లపరంగా దెబ్బకొట్టి.. వాళ్లను వాళ్లు నిలబెట్టుకునే రాజకీయం ఇది. ఇక్కడ పాచికల ఆరు వైపులా మందు చుక్క, చికెన్‌ ముక్క, డబ్బుకట్ట.. వంటివే ఉంటాయి. అవతలి వాళ్లు ఎంతిస్తున్నారో తెలుసు‘కొనే’లా గూఢాచారులను పెట్టుకొని మరీ పట్టు నిలపుకోవాల్సి ఉంటుంది.

కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో.. అభ్యర్థుల పరిస్థితి ఇలానే ఉంది. ప్రలోభాలు, ప్రత్యర్థులు, పక్కచూపులు, పైసలు... ఒక్కటేమిటి అభ్యర్థి అన్నీ తట్టుకునేందుకు కుటుంబ సభ్యులనూ రంగంలోకి దించారు. ఇప్పటి వరకు కారణేలేవి కనిపించకుండా ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఫలితాల తర్వాతే అవి బయటపడేది.

మందు, మాంసానికి మస్తు గిరాకీ
శామీర్‌పేట: తూంకుంట పురపాలక సంఘం పరిధిలోని మందు, మాంసానికి మస్తు గిరాకీ పెరిగింది. పురపాలక సంఘంలో ఉప్పరిపల్లి, పోతాయిపల్లి, దేవరయాంజాల, సింగాయిపల్లి, హకింపేట, మందాయిపల్లి, శివశివానీ కాలనీ, అంతాయిపల్లి, బిట్స్‌ కాలనీలో కలిసి 20,065 మంది ఓటర్లు ఉన్నారు. తూంకుంట పరిధిలో 16 వార్డులు ఉండగా వాటిలో 75 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోటి చేస్తున్న అభ్యర్థుల్లో 12 మందికి పైగా స్థిరాస్తి వ్యాపారంలో కూడబెట్టినవారే. వీరు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మందుపోసుడు, మాంసం పంచుడు మార్గాన్ని ఎంచుకున్నారు. పురపాలక సంఘంలో 17 చికెన్‌ సెంటర్లు, 8 మాంసం విక్రయశాలలు ఉండగా వాటిలో ప్రతిరోజు రెండున్నర క్వింటాళ్ల మాంసం వ్యాపారం జరుగుతుండగా ప్రస్తుతం అయిదు క్వింటాళ్లకు పెరిగింది. మద్యం దుకాణాల్లో సాధారణ రోజుల్లో 3 నుంచి 4లక్షల వ్యాపారం జరిగితే ఇప్పుడు అదీ రెట్టింపయినట్లు, ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సీసాలు వస్తున్నట్లు తెలిసింది.

సమస్యల భయం.. నేతల అభయం
దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని డి.పోచంపల్లిలో ‘ఈనాడు’, ‘ఈటీవీ-తెలంగాణ’, ‘ఈటీవీ భారత్‌’ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చర్చావేదికకు విశేష స్పందన లభించింది. ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులకు బస్తీ ప్రజలు తమ సమస్యను నేరుగా వివరించారు. వారు సావధానంగా విని సానుకూలంగా స్పందించారు.

- న్యూస్‌టుడే, దుండిగల్‌

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.